12, సెప్టెంబర్ 2018, బుధవారం

'కలలో నీలిమ కని' పాటకు వివరణ


ఈ కలలో నీలిమ కని అన్న మాటను గూర్చిన సమగ్ర వ్యాసం కలలో నీలిమ కని .... వేణువు విని! మనకు వేణువు బ్లాగులో లబిస్తున్నది.  తప్పక చదవండి. అన్నట్లు ఈ పాటను వ్రాసినది ఎస్.వి. భుజంగ రాయ శర్మ గారు.

ఈ పాట వినవలసిన పాటల్లో ఒకటి. దీని ఆడియో లింక్ ఆ వ్యాసంలో కూడా లభిస్తున్నది.

ఒకటపా డియర్ లార్డ్ కృష్ణా! నీ బర్త్ డే కి …. అనే దానిలో ఒక వ్యాఖ్య కనిపించింది.

Chiranjeevi Y
"చిన్నప్పుడు రేడియోలో నాకు బాగా నచ్చిన పాట అది. 2 సం.. క్రితం దాన్ని వెతికి పట్టుకోని దాచుకున్నాను. ఇప్పటికి కూడా నాకు దాన్లో ఒక్క ముక్కకి కూడా అర్ధం తెలియదు .

ఈ వ్యాఖ్యను చూసాకనే ఆ బ్లాగు తెరచి ఈ పాటను గమనించటమూ వినటమూ జరిగింది. ఇంంతవరకూ ఈ పాటను ఎన్నడూ విననే లేదు!

ఈపాట సాహిత్యాన్ని వేణువు బ్లాగునుండి తీసుకొని క్రింద చూపుతున్నాను. (గమనిక: పాటపాడేటప్పుడు అక్కడక్కడా పల్లవి వగైరాలు పునరావృత్తం అవుతాయి. ఇక్కడ సాహిత్యం మాత్ర్రమే వ్రాస్తున్నాను.)

కలలో నీలిమ కని, నీలిమలో
కమల పత్ర చారిమ గని
కమల పత్ర చారిమలో
సౌహృద మృదు రక్తిమ కని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

కలలో మువ్వలు విని , మువ్వలలో
సిరి సిరి చిరు నవ్వులు విని
సిరి సిరి నవ్వులలో
మూగ వలపు సవ్వడి విని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

కలలో వేణువు విని, వేణువులో
విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో
ప్రణయ తత్వ వేదము విని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

ఇంక చిరంజీవి గారు అన్నట్లుగా ఈ పాట అర్థం కాని వారి కోసం కొంచెం వ్యాఖ్యానించటం అవసరమే.

ఈ పాటలో  చెప్పుకోవలసిన విశేషం శ్రవణసుభగత్వం. అంటే చెవికి ఇంపుగా ఉండటం. ఈ లక్షణం ఎలా వస్తున్నదీ అంటే దానికి ఒక కారణం పల్లవిలో నీలిమ, చారిమ, రక్తిమ అనే ఒకే రకంగా ముగిసే పదాలూ అలాగే చరణాల్లో మువ్వలు, నవ్వులు, సవ్వడి, వేదన వేదన  వంటి ప్రాసపదాల వలన. ఐతే అంతకన్నా ముఖ్యకారణం ఈ పాటలో విస్తృతంగా కనిపించే ముక్తపదగ్రస్తాలంకారం వలన. అంటే ఒకపదాన్ని వెంటవెంటనే వాడటం అనే చమత్కార ప్రక్రియ వలన.

కలలో ఒక నీలిమ కని అని మొదలవుతుంది పాట. నిజానికి కలలో ఒక నీలిమ కని అని ఉంటే మరింత బాగుండేదని నా అభిప్రాయం. నీలిమ అంటే నలుపురంగు. కలలో ఒక నలుపురంగు కనబడింది అంటే అంత గొప్ప మాటగా అనిపించదు గబుక్కున. నీలిమ అంటే నల్లదనం అన్నది వాస్తవమే కాని ఇక్కడ సూచించేది ఏమిటంటే ఒక నల్లటి వస్తువు అని. వస్తువేమిటయ్యా వస్తువూ? కలలో ఒక నల్లపిల్లాడు కనిపించాడూ అని అర్థం తీసుకోవాలి. ఎవడి నీలివర్ణం ఒకవిశేషమో అతడు కనిపించాడూ అని చెప్పటమే నీలిమ కని అని చెప్పటంలో ఉద్దేశం. నీలాకాశం అటే మబ్బుపట్టిన ఆకాశం - అది చూడగానే కృష్ణుడు మనస్సుకు స్ఫురించటం అనేది ప్రసిధ్ధంగా అనేకానేక పాటల్లో కనిపిస్తూనే ఉంటుంది కదా.  ఐతే, ఈ పాటలో చెప్పిన విధం ఏమిటంటే కలలో ఒక నల్లని వాడు కనిపించాడు అని చెప్పి, మనల్ని అతడు కృష్ణుడే అని  గ్రహించమనటం జరుగుతోంది. ఏమిటయ్యా అందుకు ఋజువూ అంటే, కాస్త ఆగండి. మరికొంచెం అర్థవివేచన చేసాక పునరాలోచన చేస్తే అంతా స్పష్టం అవుతుంది కదా.

ఆ నీలిమలోకమల పత్ర చారిమ గని అని నీలిమను స్మరించటం వెంబడే చెబుతుందీ పాట. కమలపత్రం అంటే ఏమిటీ అన్నది మొదట తెలుసుకోవాలి. కమలం అంటే తామరపువ్వు, పత్రం అంటే ఆకు కాబట్టి కమలపత్రం అంటే తామరాకు అను చెప్పుకున్నామా కుదరనే కుదరదు అన్వయం. పత్రం అంటే పువురేకు కూడా. కమలపత్రం అంటే తామరపూవు రేకు.

అయోద్యాకాండలోని ఈ శ్లోకం చూడండి

స మామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః.
రామః కమలపత్రాక్ష: జీవన్నాశమితో గతః. (2.66.8)

అలాగే

రామః కమలపత్రాక్ష:,సర్వ సత్వమనోహరః!
రూప దాక్షిణ్య సంపన్నః,ప్రసూతే జనకాత్మజే!!

అలాగే

రామః కమలపత్రాక్ష. సర్వసత్వ మనోఠథః  అని హనుమంతుడు రాముని వర్ణిస్తాడు.

భగవద్గీతల్లో పదునొకండవ అధ్యాయంలో అర్జునుడు చెప్పిన శ్లోకం

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా
త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయమ్

ఇందులో అర్జునుడు కృష్ణుణ్ణి కమలపత్రాక్షుడని అంటాడు.

అందుచేత కమలపత్రచారిమ అన్న మాటలో, చారిమ అన్న సౌందర్యసూచకపదానికి అధారం ఐన కమలపత్రం ఏమిటీ అంటే అది ఒక తామరపూవు రేకుతో పోల్చబడిన సౌందర్యం అని గ్రహించాలి.

మనం చూసాం కదా, ప్రసిధ్ధంగా కమలపత్రాక్ష అని విష్ణువునీ ఆయన అవతారాలైన రామ, కృష్ణులనీ సంబోధిస్తున్నారని?

అందుచేత కమలపత్రచారిమ అంటూ తామరపూరేకువంటి ఒక ఆందం కనిపించిందంటూన్నారే అది ఆ నల్లని స్వరూపంలోని కన్నుల సౌందర్యమా? మరొకటా?

మరింత పరిశీలనగా చూదాం మరి.

కమలపత్రచారిమలో కనిపించినది సౌహృద మృదు రక్తిమ అట. ఏమిటండీ ఈ సౌహృద మృదు రక్తిమ అన్నది?

సౌహృదం అంటే సుహృద్భావం అనగా స్నేహం.  మృదు శబ్దం కూడా తెలిసినదే - మెత్తనిది అని అర్థంలో. ఇక రక్తిమ అంటే ఏమిటి? ఆ మాటకు మూలం రక్త శబ్దం! రక్తం ఎఱ్ఱగా ఉంటుంది కదా. అందుచేత రక్తిమ అంటే రక్తవర్ణం - ఇంగ్లీషు వాడు బ్లడ్ రెడ్ అంటాడే ఆ రంగు అన్నమాట. ఈ సౌహృద మృదు రక్తిమ అన్న పదగుంభనంలో అన్ని మాటలకూ విడిగా అర్థాలు చూసాం కదా. ఇప్పుడు సమాహారంగా ఈ సౌహృద మృదు రక్తిమ అంటే ఏమన్న మాటా?
 మొట్ట మొదట మధ్యలో ఉన్న మృదు శబ్దం రక్తిమ పైననా సౌహృదం పైననా అన్వయించేదీ అన్నది నిర్థారించుకోవాలి.  మెత్తని ఎఱుపు అన్నది అసందర్భం కాబట్టి చచ్చినట్లు ఆ మృదుశబ్దం కాస్తా సౌహృదం పైననే ప్రయత్నించాలి. మెత్తని స్నేహం అన్నదేదో కొంచెం బాగానే ఉన్నట్లుంది. కొందరి దృష్టిలో కొంచెం కవిత్వపుపైత్యం అనిపించినా సరే. ఎంతో అభిమానంతో కూడిన స్నేహం అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది మొత్తానికి. ఇప్పుడు ఆపైన రక్తిమ అన్నది ఎలారుద్దేదీ చూడాలి. అభిమానమో స్నేహమో దేనికైనాను ఎలా రంగుపులిమేదీ? అది ఎంత అందమైన ఎరుపు ఐతే మాత్రమున్నూ?

కొంచెం క్లిష్టమైన వ్యవహారంగా అనిపిస్తోంది కదూ? అక్షరాలా క్లిష్టమైన సంగతేను.

ముందు మనం రక్తిమకు ఎక్కడైనా మానవదేహంలో అన్వయం దొరుకుతుందేమో చూదాం.  అందంగా ఎఱ్ఱగా ఉన్నాయీ అని సాధారణంగా మన కవులు తెగ వర్ణించేవి ఏమిటబ్బా అంటే సులభంగానే పోల్చుకోవచ్చును.
అమ్మాయిలకైతే బింబాధరి అని ఒక పర్యాయపదం కూడా ఉంది చూడండి. ఇక్కడ బింబం అంటే దొండపండు. దొండపండు ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది కదా అని అమ్మాయిల పెదవులకు దానితో పోలిక అన్నమాట. ఇంకా చిగురుటాకుల్లాగా మృదువుగా ఎఱ్ఱగా ఉంటాయి అరచేతులూ అరికాళ్ళూ అని కూడా అమ్మాయిల పరంగా మనకి వర్ణనల్లో కనబడటం మామూలే.

ఎంతలేదన్నా విష్ణుమూర్తినీ - కృష్ణస్తు భగవాన్ స్వయమ్ - అని చెప్పటం ప్రసిధ్ధం కాబట్టి కలేసి కృష్ణుడినీ కూడా అమ్మాయిలకి చెప్పినట్లే అరవిందాక్షుడనీ గట్రా వర్ణించటం మామూలే. కావాలంటే చూడండి లీలాశుకుడు ఎలా బాలకృష్ణుణ్ణి వర్ణించాడో

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయం తం
వటస్య పత్రస్య పుటే శయానాం
బాలాం ముకుందం మనసా స్మరామి

ఇన్ని అరవిందాలున్నాయే ఈ శ్లోకంలో, అసలు అరవిందం అంటే ఏమిటో తెలుసునా? తామరపువ్వు. విశేషంగా ఎఱ్ఱతామర పువ్వు అన్న అర్థం ఉంది ముఖ్యంగా.

అమ్మయ్య. పట్టు దొరికింది కదా?

ఇప్పుడు సౌహృద మృదు రక్తిమలోని రక్తిమ అన్నది ఎఱ్ఱతామరలోని ఎఱుపున్నూ, ఆఎఱుపు రంగు ఉన్నది సౌహృదం చిందే మృదువైన పెదవులున్నూ అనుకుంటే అంతా చక్కగా అహ్లాదకరంగా అన్వయం సిధ్ధిస్తున్నది. అదీ సంగతి.

ఇప్పుడు పాట పల్లవిని ఒకసారి మరలా చూదాం.

కలలో నీలిమ కని, నీలిమలో
కమల పత్ర చారిమ గని
కమల పత్ర చారిమలో
సౌహృద మృదు రక్తిమ కని

కలలో ఒక నల్లని స్వరూపం (అంటే నల్లనయ్య రూపం అన్నమాట) కనిపించింది. అది ఆట్టే స్పష్టంగా లేదింకా. క్రమంగా అందులో ఒక కమలపత్ర చారిమ కనిపించింది పరిశీలనగా చూస్తేను. ఆ కమలపత్రచారిమ అంటే అందమైన తామరరేకులవంటి కన్నుల సొగసు అన్నమాట. ఆ కమలపత్రచారిమలో అంటే అందమైన తామరకన్నులున్న రూపంలో అన్నట్లుగా అన్వయం చెప్పుకోవాలి - అందులో ఒక సౌహృద మృదు రక్తిమ కనిపించిందట. అంటే స్నేహపూర్వకమైన (చిరునవ్వుకల) మృదువైన అందమైన ఎఱ్ఱని పెదవులు కనిపించాయట. అంటే నల్లనయ్య స్వరూపం స్థూలంగానూ క్రమశః అందులో ఆయన అందమైన కన్నులూ పెదవులూ కనిపించాయంటున్నారు. ఇక్కడ అందచందాల ప్రసక్తి ఎందుకూ అంటే చూడండి కళ్ళు మనపట్ల ప్రసన్నంగా ఉంటేనే కదా అవి అందంగా కనిపించేదీ? అలాగే చిరునవ్వులు చిందే పెదవులే కదా అందంగా కనిపించేదీ? ఇక్కడ అంతర్లీనభావం ఏమిటంటే ఆ నల్లనయ్య మోము ఎంతో ప్రసన్నంగా ఉన్నదీ అని చెప్పటం.

ఇక్కడ మరొక రెండు మాటలు చెప్పుకోవలసి ఉంది. కమలపత్రచారిమ అన్నప్పుడు ఆ కమలపుటాలుగా కనిపించినవి పాదాలో అరచేతులో లేదా  ముఖమో అనుకోవచ్చును కదా అన్నది ఎందుకు పరిశీలించలేదూ అని ఎవరైనా అనవచ్చును.  సౌహృద అనే పదం కూడా అన్వయం కావలసి ఉన్నది కాబట్టి కేవలం కన్నులను మాత్రమే తీసుకొనటం జరిగింది కమలపత్రచారిమ కొరకు అని సమాధానం. కమలపు రేకులతో పోల్చటానికి కన్నులకున్న సౌలభ్యం ఇక్కడ మరింత బాగున్నది కాబట్టి అనీ మనం గ్రహించాలి.

ఈ స్వప్నదృశ్యానికి మనస్సు ఎలా స్పందించిందీ అంటే

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

అగరుదూపం అంటే అగరు వత్తి పొగ. అదిసన్నగా ఒక తీగలాగా గాలిలో పైకి కొంచెం మెలికలు తిరుగుతూ వెళ్ళటం అందరికీ అనుభూతం ఐన విషయమే కదా. లత అన్నా లతిక అన్నా ఒక తీగ అని అర్థం.  క అనేప్రత్యయం అల్పార్థాన్ని సూచిస్తున్నది కాబట్టి లతిక అంటే సన్నని తీగ అని తీసుకోవాలి. నిజమే కదా అగరువత్తి పొగ ఒక సన్నని తీగలాగా గాలిలో తేలుతూ పైకి ప్రాకుతూ పోతూ ఉంటుందీ.

ఇక్కడ అలాంటి తీగలాగా ఎగసిపోతున్నదట మనసు. ఎగసిపోవటం అంటే పైపైకి ఎగిరిపోవటం అన్నమాట. ఈ మనసు అలా ఎందుకయ్యిందీ అంటే అవశమవటం కారణం. అవశత్వం అంటే తనపై తనకు అదుపుతప్పిపోవటం - అనగా - మైమరచిపోవటం అన్నమాట. బాగుంది కదా?

మరి అలా మైమరచిపోవటం ఎటువంటిదీ అంటే అగరువత్తి ధూమపు పొగకు తనపై తనకు అదుపులేక ఎగిరిపోతూ ఉంటుందో అలాగన్నమాట. బాగుంది బాగుంది.

మరి ఆమనస్సును పట్టుకొని వెఱ్ఱిది అనటం ఎందుకూ అన్న ప్రశ్న వస్తుంది.  మరి వెఱ్ఱి అంటేనే తనపై తనకు అదుపు లేకపోవటమే కదటండీ. ఎంత పిచ్చిపట్టినట్లుగా అయ్యిందీ  అని చెప్పటం బాగున్నది కదా సార్థకంగానూ.

ఇలా అవశత్వం పొందటానికి ఆకలలో మరొక కారణం కూడా పాటలో తరువాత వచ్చే చరణాలు తెలుపుతున్నాయి.

మొదటి చరణం.

కలలో మువ్వలు విని , మువ్వలలో
సిరి సిరి చిరు నవ్వులు విని
సిరి సిరి నవ్వులలో
మూగ వలపు సవ్వడి విని

అన్నది.

కలల్లో దృశ్యమే కాదు శ్రవణం కూడా అందరికీ అనుభవమేను. ఇక్కడ ఆ శ్రవణానందమూ అనుభవం లోనికి వచ్చిందట. కలలో మువ్వల సవ్వడి వినిపించిందట. ఆ మువ్వల సవ్వడితో పాటే సిరిసిరి నవ్వులూ వినిపించాయట. ఆ నవ్వుల వెనుక ఒక మూగవలపు కూడా ధ్వనించిందట. ఇదంతా చాలా వరకూ సులభంగా అనిపిస్తోంది అర్థంచేసుకుందుకు. కాని మూగ వలపు అని ఎందుకన్నారూ?

అన్నట్లు సిరిసిరి నవ్వులూ అన్నారేమీ చిరుచిరు నవ్వులూ అనకుండా అన్న సందేహం వస్తుంది. సిరి అంటే శోభ అన్న అర్థం తీసుకొంటే ఎంతో శోభాయమానంగా ఉన్న నవ్వులు అని చెప్పుకోవచ్చును. నవ్వు శోభాయమానంగా ఉండటం అంటే ఆ నవ్వులే ఎంతో అందంగా ఉన్నాయని చెప్పట అన్నమాట.

మూగవలపు అంటే ఒకరి మనోభావాలని మరొకరితో ప్ర్రేయసీ ప్రియులు పంచుకోలేనిస్థితి. భాషతో వ్యక్తంచేసుకోలేని పరిస్థితి. దీనికి లోకవ్యవహారంగా ఐతే ఇతరుల వలన అడ్డంకులు. మరి ఇక్కడ? భాష చాలక అని అర్థం. ఏవిధంగానూ జీవుడు ఎంతప్రయత్నించినా భగవంతుడి పట్ల  తనప్రేమని పూర్ణంగా  భాషసహాయంతో వ్యక్తం చేయలేడు. భగవంతుడు వ్యక్తం చేయలేడు అనలేము కాము జీవుడు అందుకోలేడు కదా అని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ మూగవేదన అనటం. పై చరణం కూడా వ్యాఖ్యానించుకుందాం. అప్పుడు మరింత స్పష్టత వస్తుంది.

రెండవ చరణం చూదాం.

కలలో వేణువు విని, వేణువులో
విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో
ప్రణయ తత్వ వేదము విని


అలా శ్రవణం చేసినది ఒక వేణువు రవళి కూడా

ఆ వేణుగానంలో ధ్వనించినది ఒక మధురమైన విరహ వేదన అట.

ఆ విరయవేదన అన్నది ప్రణయతత్త్వాన్ని సూచిస్తున్నది అంటున్నారు.

అసలు విరహం అంటే ఎడబాటు. సాధారణంగా ప్రేయసీప్రియుల మధ్య కలిగిని ఎడబాటుగా చెప్పుతూ ఉంటాం. తల్లీబిడ్డలమధ్యనో అన్నాచెల్లెళ్ళ మధ్యనో కలిగిన ఎడబాటును విరహం అని చెప్పరు. అది సంప్రదాయం కాదు.

ఇక్కడ ప్రియుడు మురళీగానవినోదుడు. అంటే కృష్ణుడు.

మరి ఆ ప్రేయసి ఎవరూ అంటే జీవుడు.

భగవంతుడు ఒక్కడే పురుషుడు అని మీరా అన్నమాట ప్రసిధ్ధం. ఒకసారి ఆవిడ ఒక స్వాములవారిని చూడటానికి వెడితే ఆయన శిష్యులు అడ్డుపడి తమ గురువుగారు స్త్రీలను చూడరూ అని సెలవిచ్చారట. అప్పుడు అన్నదట మీరాబాయి. ఓహో పరమాత్ముడొక్కడే పురుషుడు అనుకుంటున్నాను ఇప్పటిదాకా.  ఇప్పుడు మీగురువుగారు అనే మరొక పురుషుడు బయలుదేరాడా అని. స్వాములవారి శిష్యులూ ఆ స్వాముల వారూ కూడా సిగ్గుపడ్డారట అని వేరే చెప్పనవరం లేదు కదా.

పరాభక్తిని గురించి 'సాతు అస్మిన్ పరమ ప్రేమరూపా' అని నారదులవారు సూత్రీకరించారు. ప్రేయసికి ప్రియునితో ఐక్యం కావటమే పరమార్థం ఐనట్లుగా జీవులు అనే స్త్రీలు భగవంతుడు అనే పురుషుడితో కలయికకు మరమప్రేమతో తపించటమే భక్తి అని దాని అర్థం.

ఈ భగవంతుడేమో దూరంగా ఉన్నాడనుకోండి. జీవుడికి విరహవేదన. అదే భక్తి. శివానందలహరిలో ఈ భక్తి అనేదానిని గురించి శంకరభగవత్పాదులు చెప్పిన శ్లోకం చూడండి

అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోపలం సూచికా
స్వాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభమ్
ప్రాప్నో తీహ యథా తథా పశుపతేః పదారవింద ద్వయం
చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే

ఈశ్లోకానికి ఇప్పుడు మనం వ్యాఖ్య చెప్పుకోవాలంటే చాలా గ్రంథం అవుతుంది కాని, ఇక్కడ అందులోని ఒక ఉపమానాన్ని మాత్రం చూద్దాం. అది 'స్వాధ్వీ నైజవిభుం' అన్నది.  పతివ్రత ఐన స్త్రీమూర్తి ఎలా తన భర్తను సర్వకాలసర్వావస్థల్లోనూ ఆశ్రయించి ఉంటుందో అలా ఉండటమే జీవుడు భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉండటమే భక్తి అని అంటారు అని ఈశ్లోకం నిర్వచనం చెబుతోంది.

ఇప్పుడు పాటదగ్గరకు వద్దాం. చరణంలో ' వేణువులో విరహ మధుర వేదన విని'  అన్నారు కదా.

ఇక్కడ  న్యాయంగా చదువరికి ఒక సందేహం కలగాలి.  విరహం అనేది ప్రేయసికి ప్రియుడు పట్ల కలిగేది కదా అని. కాదండీ పొరబడకండి. విరహం అన్నది ప్రేయసికీ ప్రియుడికీ కూడా సమానావస్థయే. కాకపోతే అది రసాభాసం అవుతుంది. ఇంగ్లీషువాడంటాడే వన్ సైడ్ లవ్ అనగా ఏకపక్షప్రేమ అనీ అలాగు అన్నమాట.

మనం సాధారణంగా జీవుడు భగవంతుడికోసం తపనపడటం గురించే ఎక్కువగా చదువుతూ ఉంటాము. అలాగే ఆ ప్రభావంతో ఆలోచిస్తూ ఉంటాము.

ఈ పాటలో అమురళీ రవంలో విరహం ధ్వనిస్తోందని చెప్పటం ద్వారా భగవంతుడు కూడా విరహంతో ఉన్నాడని చెప్పటం కనిపిస్తోంది కదా. అది గొప్పగా ఉంది.

అవునండి. అయనకూడా ఈజీవుడు ఎప్పుడు తనను చేరుకుంటాడా అని ఎదురుచూస్తూ ఉంటాడట. జీవుడు తనవైపుకు ఒక అడుగు వేస్తే అయన ఆత్రంగా ఆ జీవుడివైపుకు పది అడుగులు వేస్తాడని చెబుతారు.

సర్వశక్తిమంతుడు కదా ఆయన జీవుణ్ణి కొంచెం జబర్ధస్తీగా తనవైపుకు నడిపించుకొన వచ్చును కదా అన్న మాట వస్తుంది సహజంగా. కాని అలా కాదు. ఆయన అలా చేయడు. అది ఆయన నియమం. ఆయన చేసిన సృష్టికి ఆయన పెటిన ఒక నియమం. జీవుడికి కర్మస్వాతంత్ర్యం ఉంది. అది ఆ ప్రభువు ఇచ్చినదే. అందుచేత అ జీవుడే తనవద్దకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు. అదే, ఆ ఎదురుచూపే విరహం. భగవంతుడికి భక్తుడికోసం కలిగిన విరహం అన్నమాట,

పాటలో విరహ మధుర వేదన అని ఎందుకన్నారూ అంటే విరహవేదన ఎంత దుస్సహంగా అనిపిస్తుందో అది అంత మధురంగానూ ఉంటుంది అంటారు కాబట్టి.  ఎందుకంటే ఆవలి వ్యక్తి గురించిని ఆలోచనా పరంపరతో ఇతరప్రపంచాన్ని మరచి ఆ వ్యక్తి సాన్నిధ్యాన్ని మనసా అనుభవిస్తూ ఉండటం చేత. అందుకే కదా ప్రసిధ్ధమైన సినిమా పాటలో 'విరహపు చింతన మధురము కాదా' అని అంటాడు కవి.

వేణు గానం మధురంగా ఉంటుంది. అది మరింత మధురంగా ఉందట - విరహమాధుర్యాన్ని సంతరించుకోవటం వలన.

ఈ విరహ మధుర వేదనలో ఒక ప్రణయ తత్త్వ వేదం వినిపిస్తోందని పాట అంటోంది.

ఇక్కడ జీవుడికీ దేవుడికీ మధ్యన ఉన్న ఉత్తమోత్తమమైన ప్రణయం అన్నదే కదా విరహం అనే స్థాయీ భావానికి కారణం? అందుచేతనే అలా చెప్పటం జరిగింది. ఇది చాలా బాగుంది.

మరి దాన్ని వేదం అని ఎందుకన్నారూ అని సందేహం రావాలి.

విద్ అన్న ధాతువుకు తెలుసుకోవటం అన్నది అర్థం కాబట్టి వేదం అంటే జ్ఞానం అన్న అర్థం సిద్ధిస్తోంది.

ఈ భగవంతుడికీ జీవుడికీ మధ్యన ఉన్న ప్రణయభావనయే జ్ఞానం! ప్రేయసీ ప్రియులు తాము ఒకటే అనుకుంటారు. అలా అని తెలుసుకోవటమే వారి ప్రణయానికి పరమార్థం. అలా జీవుడు దేవుడితో ఒకటి కావటమే ఆ ప్రణయానికి పరమార్థం కదా. అలా తెలుసుకోవటమే అంతిమమైన జ్ఞానం. దానికి మించిన జ్ఞానం లేదు.

మరి ఆ దివ్యప్రణయాన్ని తత్త్వం అని ఎందుకంటున్నారూ అని ఆలోచించాలి.

తత్త్వం అన్న మాట తత్ + త్వం అన్న మాటల కూడిన అంటే అది నీవే అని అర్థం.  ఆ భగవత్త్వత్త్వం - జీవుడూ ఒకటే. రెండుగా మాయచేత అనిపించటమే కాని ఆ దేవుడూ జీవుడూ ఒక్కరే. అదే ఆ ప్రణయతత్త్వం.

ఇదీ ఈ పాట వెనుక ఉన్న తాత్తికమైన వివేచన.

ఏదో నా చేతనైనంతగా పాటకు వివరణ ప్రయత్నించాను. ఎంత వరకూ నప్పుతున్నదీ చదువరులే చెప్పాలి.