23, సెప్టెంబర్ 2018, ఆదివారం

అన్నిట నీకు సాటి


అన్నిట నీకు సాటి యనుచు మా సీతమ్మ
నెన్నిక సేయరే యింద్రాదులు ఋషులు

తల్లి గొప్ప దండ్రి దనగ తండ్రి గొప్ప తల్లిది
అల్లిదండ్రుల గొప్పదనము లవి
యెల్లరి బిడ్డల గొప్ప లేవేళ లోకమందు
చల్లని వారు మీరు తల్లిదండ్రులు మాకు

ఛాయేవానుగతా యని జనకుడాడిన మాట
మాయమ్మ సత్యముగ మలచినది
వేయేల నీవలె పితృవాక్యపాలనమున
మాయమ్మ సీతమ్మ మరినీకు సాటి రామ

మాయ గొని నీ వొక్క మనుజరూపము దాల్చ
మాయయే వచ్చె సీతామాతగను
మీ యిరువురి యందు మిక్కిలి భక్తులము
మాయందు దయగల మా పితరులు మీరు

2 కామెంట్‌లు:

  1. నేను చదివిన పరిమిత సాహిత్యంలో ఒక సొబగు style లలో అన్నమయ్య ultimate అనిపించింది. ఎందరో పండితులు అన్నమయ్యను మించిన వాగ్గేయకారుడు లేడని నిర్ధారణ చేశారు. పల్లవి చరణాలలోని ఆ భావవైచిత్రి చివరకు వెంకటేశుని నుతించడంలో సమన్వయపరిచే తీరు అనితర సాధ్యం.అన్నమయ్య స్పృశించని జీవనపార్శ్వం లేదు అనిపిస్తుంది. మీరు వ్రాసిన కొన్నిపాటలలో ఆ అన్నమయ్య ఒరవడిని అందిపుచ్చుకున్నారు అనిపించింది.పితృవాక్య పరిపాలన లో కూడా సీతమ్మ రామయ్యకు సాటి అని చెప్పిన భావం ఎంతో ఆకట్టుకుంది. మీరు అన్నమయ్య పాటలలో సొగసులు వివరిస్తూ కొన్ని వ్యాసాలు వ్రాస్తే బాగుంటుంది. వాల్మీకి మహర్షి వ్రాసిన ఛాయా ఇవ అనుగతా..ఏమిపదము ఇది. తలచుకుంటేనే మనసు సంతోషంతో పులకరించి పోతుంది. అంతకుమించి ఎవరైనా సీతారాముల అన్యోన్యతను వివరించగలరా.

    రిప్లయితొలగించండి
  2. . . . మీరు వ్రాసిన కొన్నిపాటలలో ఆ అన్నమయ్య ఒరవడిని అందిపుచ్చుకున్నారు అనిపించింది. . .
    పెద్దలతో పోల్చదగినంత వాడను కానండి.

    . . . మీరు అన్నమయ్య పాటలలో సొగసులు వివరిస్తూ కొన్ని వ్యాసాలు వ్రాస్తే బాగుంటుంది. . . .
    అన్నమాచార్య అన్న వర్గంలో కొన్ని అన్నమయ్య కీర్తనలను వివరించటానికి ప్రయత్నించానండి. అవి 12 ఉన్నాయి ప్రస్తుతం. వీలు వెంబడి మరికొన్నింటిని వివరిస్తాను శక్తిమేరకు.

    . . . అంతకుమించి ఎవరైనా సీతారాముల అన్యోన్యతను వివరించగలరా. . . .
    సీతారాములకు అభేదము సత్యము.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.