5, సెప్టెంబర్ 2018, బుధవారం

బాలరాముని చేత బంగారువిల్లు


బాలరాముని చేత బంగారువిల్లు
లీలగా నిలిపినది లోలాక్షి కైక

నిజమైన విలుబూని నీవొక్క నాటికి
ప్రజలను రక్షించు ప్రభుడ వగుదు వోయి
ఋజువుగా నీకీర్తిధ్వజము నింగినంటు
విజయరాముడవని పేరుగొందు వనుచు

వరధనుర్ధరుడవై వర్థిల్లగలవు నీవు
సురవైరులను గెల్చి శోభిల్లగలవు నీవు
ధరాధరంబులును సాగరము లుండు వరకు
నరులనాలుకలపై నాట్యమాడు నీ పేరని

ఏరీ నీ సాటివా రిల నెన్నడు కలుగరని
శూరులు హరిహరులే చూడ నీకు సాటి యని
వీరనారి కైక దీవించినది రాముని
భూరివింటి వీరు నదే ముద్దాడి మురిసినది


2 వ్యాఖ్యలు:

 1. కైకతో పొగిడించినందుకు ఈ కీర్తన నాకు నచ్చిందండీ...అస్మదీయులూ/తస్మదీయులూ పొగిడినపుడే కదా దైవం అని నిరూపించబడేది ?!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చిన్నప్పుడు ఒక మంచి రేడియో నాటిక విన్నాను. రేపే రామపట్టాభిషేకమని కైక మురుస్తుంటే అది నీవు చెడగొట్టవలసి ఉందని దేవతలు ఋషులతో కూడిన మహీపీఠం ఆదేశిస్తుందట! రాముడై హరివచ్చిన కార్యం వేరుసుమా అని గుర్తుచేస్తుందట.

  విశ్వనాథవారు దశరథపత్నులను గూర్చి చెప్పిన పద్యంలో కైకేయి మధుసామగానమూర్తి అని అంటారు. అవిడకు రాముడు ప్రాణసమానుడనీ, రామునకు విద్యాగురువుల్లో ఆవిడ కూడా ఉన్నారనీ మనం పెద్దల రచలల్లో చదువుతున్నాం కదా. ఆవిడను తక్కువ చేసి అనుకోవటం లోకంలో అపోహవలననే.

  ఈ కీర్తనలో పసిబాలుడైన రాముని చేతికి బంగారు వింటిబొమ్మనిచ్చి ఆ మనోహరదృశ్యానికి మురిసి కైకమ్మ బిడ్డ్డను ఆశీర్వదించే ఘట్టాన్ని ఆవిష్కరించటం జరిగింది. భక్తిరచనల్లో భవిష్యసూచకమైన పలుకులు దొరలటం సాధారణంగా కవులందరి రచనల్లోనూ ఉండే విషయమే. ఐనా, తల్లి బిడ్డను నువ్వంతవాడి వవుతావూ ఇంతవాడి వవుతవూ అని పొగడుకోవటం లోకసహజమైన విషయమే కదా.

  ఈ కీర్తన మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఇలా వ్రాయించినది శ్రీరామచంద్రుడి కృపావిశేషమే కాని ఈ కీర్తనలో నా ప్రతిభ యేమీ లేదండి.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.