19, జనవరి 2024, శుక్రవారం

రెట్టమత శాస్త్రం

ఈరోజు 2024-01-19 నాడు కష్టేఫలి బ్లాగులో శర్మ గారు రెట్టమతశాస్త్రం అని ఒక టపాను ప్రచురించారు. విషయం ఒక వాట్సాప్ వ్యాసం లేదా అన్నారు.

ఆటపా విషయంగా కొన్ని విషయాలను గురించి సరైన వివరణలను నాకు తెలిసినంత వరకూ ప్రస్తావించటానికి గాను వ్రాయవలసి వస్తున్నది.

"ఈ రెట్టమత శాస్త్రం లో ఉన్న మనసు ఎవరు ఏమి చెప్పినా దానికి వెంటనే ప్రశ్న వేయడం, ప్రతీ సమస్యనూ వ్యతిరేక దిశలో చూడటం, దానికి విరుద్ధంగా సమాధానం చెప్పడం" అన్నది ఉంటుందని అభిప్రాయం ఉంది టపాలో.

ఈటపాలోని ఇంకొక అభిప్రాయం "రేణుక పరశురాముని తల్లి. భర్త ఏం చెబితే దాన్ని వ్యతిరేకంగా ఆలోచించేది, వ్యతిరేకంగా చేసేది. అందుకే రేణుకా మతం, రెటమత శాస్త్రం అనే పేరు వచ్చింది" అన్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.

ఇంకా "ఈ రెట్టమత శాస్త్రం వారికి శ్రోతలు కావాలి. వారు ఏం చెబితే అది జేజేలు కొట్టడానికి సంఘాలు కావాలి. వీళ్ళు సింగిల్ గా ఉండలేరు.. వీళ్ళని ఎవరు భరించలేరు. వారు చెప్పేది ప్రతీ వ్యక్తీ వినాలి. వీళ్ళు మాత్రం ఎవరి మాటా వినరు" అంటూ మరొక అభిప్రాయం.

ఇంకా "ఇంకొందరు ఉంటారు వారు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే రకం. ఇది కూడా రెట్టమతమే . సర్దుకోవడం, దిద్దుకోవడం ఈ రెండూ చేతకాని రెట్టమతం వారు" అన్నది.

ఈ అభిప్రయాలను పరిశీలిస్తే రెట్టమతం అంటే మూర్ఖత్వం అని నిర్ధారణ అవుతున్నది.

ఐతే నిజానికి రెట్టమతం అంటే మూర్ఖత్వమూ కాదు మరొక రకమైన మానవప్రవృత్తీ కాదు.  అది నిజంగా ఒక శాస్త్రం.

ఈ శాస్త్ర గ్రంథాన్ని సి.వి,కృష్ణా బుక్ డిపో (మద్రాసు) వారు ప్రచురించారు. ఈపుస్తకం పీడీయఫ్ కాపీని మనం ఆర్కీవ్ సైట్ నుండి దిగుమతి చేసుకోవచ్చును.

ఈ శాస్త్రం ఒక ఐదు ఆశ్వాసాల తెలుగు గ్రంథం. దీనిని వ్రాసిన వారి గురించి ఆశ్వాసాంత గద్యలో ఇలా ఉంటుంది.

ఇది శ్రీమ దొంటిమిట్ట రఘువీరకృపాలబ్ధసార సారస్వత ధుర్యాయ్యలు రాజవంశసంభ వాయ్యలాఖ్య భాస్కరాఖ్య కవిద్వయ ప్రణీతం బగు రెట్టమతశాస్త్రంబు నందు .. ఆశ్వాసము 

అని ఈవిధంగా ఆ గ్రంథంలో ప్రతి ఆశ్వాసం ముగింపులోనూ ప్రస్తావించబడింది.

ఈ గ్రంథం కొండ్రాజ వేంకటాద్రి నరేంద్రుడికి అంకితంగా వ్రాయబడిందని ఆశ్వాసాల్లోని మొదటి పద్యాల్లో చెప్పబడింది.

ఈ రెట్టమత శాస్త్రం గ్రంథంలో ఏమి ఉంటుందో ఆగ్రంథం నుండే చూపిస్తున్నాను. గ్రంథం అవతారికలో

ఈప్రబంధంబున కనుక్రమణీయం బెట్టిదనిన వర్షాది హేతువులగు భూజాతపుష్పఫల లక్షణంబును గోవ్రజార్చనా శకునంబును దూతలక్షణంబును పక్షిశకునంబును గర్భర్తు లక్షణంబును మేహలక్షణంబును  విద్యులక్షణంనును గర్జితలక్షణంబును నింద్రచాప లక్షణంబును పరివేష లక్షణంబును ప్రతిసూర్యాతప వాయులక్షణంబును గ్రహయుధ్ధ లక్షణంబును బీజావాపంబును నర్ఘలక్షణంబును నాకస్మిక లక్షణంబును గ్రహచారాస్తమ యోదయ లక్షణంబును గ్రహఫల లక్షణంబును సంవత్సరాది ఫలంబును వివరించి యుండు ...

అంతే కాదు ఈపుస్తకం రెట్టమతం అనటం ఎందుకో కూడా అక్కడ 57వ పద్యంలో స్పష్టంగా చెప్పారు.

సీ. వరుస గర్గాచార్యవర్యుని మతమున
      మతిశాలి హరిభట్టు మతము నందు
ధర కీర్తిఘనుడైన ధన్యుని మతమున
      ప్రతిభ జెన్నొందు శ్రీపతి మతమున
మేటియైన వరాహమిహిరాచార్యు మతమున
      సన్మేఘమాలికా శాస్త్రమునను
నుచిత కీర్త్యాఖ్యచే నొనరు నారాయణ
      భట్ట మతంబున బ్రాజ్ఞులైన
తే. జనుల యుక్తిని జ్యోతిషసారమునను
శకునచయమున కల యర్ధచయము దెలిసి
కృతి యొనర్చిన రెట్టని మతము నేను
వేడ్క దెనిగించెదను మీకు వేంకటేంద్ర

ఈపద్యం ప్రకారం ఎవరో రెట్టన అన్న మహానుభావుడు జ్యోతిషమూ శకునశాస్త్రమూ మొదలైనవి చక్కగా అధ్యయనం చేసి వాతావరణం గురించి గ్రహాదుల శకునాదుల వలన ఎలా తెలుసుకోవచ్చునూ అని ఒక శాస్త్రగ్రంథం రచించాడనీ ఈ కవులు ఇద్దరూ దీనిని తెలుగు చేసారనీ అర్ధం అవుతున్నది.

అయ్యా, ఈ రెట్టమతం అంటే ఒక శాస్త్రం అన్నమాట. జనులకు వాతావరణ విన్నాణం కోసం ఒక మహానుభావుడు తయారు చేసింది.

అందువలన రెట్టమతం అంటే అది మొండితనమూ మూర్ఖత్వమూ అని అనటం అంత సబబు కాదు.

మరొక మాట. టపాలో పరశురాముల వారి తల్లి రేణుక గురించి వ్రాసిన మాటలు అన్యాయం. ఎంతమాత్రమూ సబబు కావు.

ఐతే జనం నోటిలో రెట్టమతం అన్నమాటకు క్రమంగా అపఖ్యాతి ఎందుకైనా వచ్చిందేమో మరి!

ఒక విషయం చెప్పటం మరచిపోయాను చివరిదాకా. ఈ రెట్టమతశాస్త్రం పుస్తకం నాదగ్గర ఉండేది. ఎక్కడో ఇంకా ఉందేమో కూడా. ఇది మాఅమ్మగారికి ఇచ్చాను. ఆవిడ దగ్గరనే ఉండేది. ఐతే ఆ పుస్తకం ప్రచురించినది సీ.వీ.కృష్ణా వాళ్ళు కాదని గుర్తు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.