30, జనవరి 2024, మంగళవారం

రామనామరసాస్వాదన


రామనామరసాస్వాదనామగ్న శుభస్థితి

సామాన్యులు పొందుటనగ సాధ్యమేనా


ఎన్నెన్ని జన్మలెత్తి ఎంతపుణ్యము చేసి

ఎన్నెన్ని పూజల నొనరించిన కలుగు

ఎన్నెన్ని మారు లోయీశ్వరా కావుమని

విన్నపములు చేసిన పిమ్మట కలుగు


భోగముల నుజ్జగించి రాగమర్దనము చేసి

యోగసాధనలు చేయ నొప్పుగ గలుగు

త్యాగుల కాజన్మవిరాగులకు భక్తులకు

బాగొప్పగ స్వామికృపాభాగ్యము కలుగు


కలుగునా మాబోంట్లకు కలిసర్పదష్టులకు

కలనైన రామనామకలిమి ఎక్కడ

తలచి కరుణాళువైన దశరథరాముడే

తెలియుమని యది యిచ్చి దీవించనిదే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.