1, జులై 2022, శుక్రవారం

శ్రీరఘునాథుడవు నీవు సీతానాథుడవు

శ్రీరఘునాథుడవు నీవు సీతానాథుడవు
శూరవరేణ్యుడవు నీవు శుభ్రయశస్కుడవు

దానవవీరుల కాలునివోలెను దండనచేయుచు నుండెడి వాడవు
మానవకోటిని కన్నతండ్రివలె మంచిగ పరిపాలించెడువాడవు
జ్ఞానులభక్తులనర్ధార్ధులను చక్కగ సంరక్షించెడువాడవు
దీనజనావన బిరుదాంకితుడవు దినకరకోటిసమానతేజుడవు

పురుషోత్తముడవు పురాణపురుషుడ వరిందముడవు హరసన్నుతుడవు
వరవిక్రముడవు తరణికులేశుడ వరవిందాక్షుడ వఖిలేశ్వరుడవు
నరనాయకుడవు సురనాయకుడవు ధరణీతనయాప్రాణేశ్వరుడవు
వరగుణయుతుడవు మునిగణనుతుడవు సురగణనుతుడవు పరమేశ్వరుడవు

బ్రహ్మాండములు సృజించెడువాడవు వాటికిపోషణ చేసెడివాడవు
బ్రహ్మవేత్తలకు నిత్యము చక్కగ బ్రహ్మానందము నిచ్చెడివాడవు 
బ్రహ్మేంద్రాదుల పొగడిక లందెడు వాడవు రామబ్రహ్మం బనగా
బ్రహ్మర్షులతో నిండిన సభలో బంగరుగద్దియ నుండెడివాడవు