6, జులై 2022, బుధవారం

వినుడు రామభక్తుని విధము

వినుడు రామభక్తుని విధ మిట్టిదై యుండును
కను డాతని రాముడును కటాక్షించుచుండును
 
రామా యని నిదురలేచు రామా యని నిదురవోవు
రామా యని పనుల నారంభించును తానెపుడును
రామా యను సకలకార్యావసానముల యందు
రామా యనకుండ నుండరా దతని రసన కనగ

రామానుగ్రహ మనిపల్కును ప్రజలు తన్ను పొగడుచో
రామరామ యనుకొనును ప్రజలు నిందించుచో
రామునిపై భారముంచి ప్రవర్తించు నెల్లపుడు 
రామచంద్రుడే తనను రక్షించునని నమ్మును

రాముడొకడె సర్వజగ్రద్రక్షకుడని నమ్మియుండు
రాముడొకెడె భుక్తిముక్తి ప్రదాతయను నెల్లప్పుడు
రామచంద్రుడు శ్రీమన్నారాయణుడని యెఱిగియుండు
రాముచంద్రు నాత్మలోన లక్షించును తానెపుడును