14, జులై 2022, గురువారం

కోతులనే సాయ మడిగిన గొప్పదేవు డితడు

కోతులనే సాయ మడిగిన గొప్పదేవు డితడు మంచి 
కోతినే బ్రహ్మను చేసిన గొప్ప దేవు డితడు

పోడిమి చెడిన కోతులరాజును బుజ్జగించినాడు
వాడి శత్రువును పడగొట్టగ నొక బాణమేసినాడు
వేడుక వానిని రాజును చేసి ప్రీతిచెందినాడు
వాడిని ప్రత్యుపకారివి కమ్మని వేడినాడు వీడు 

కోతుల చక్కని కోతిని పిలచి కోమలి కీయుమని
నాతికి గుర్తుగ చేతియుంగరము ప్రీతి నొసగినాడు
ఆతడు భామిని నారసివచ్చిన నబ్బురపడినాడు
నాతమ్ముడవని కౌగలించుకొనినా డీదేవుండు
 
కోతులదండు సాగరమునకు గొబ్బున వారధిని
ఆతురపడుచు కట్టగ రావణు నంతుచూచి నాడు
సీతారాముడు సీతను కూడి చింతవీడి నాడు
కోతులసాయముతో గెలుపొందిన గొప్పదేవు డితడు