3, జులై 2022, ఆదివారం

శ్రీరామ శ్రీరామ యనకుండ

శ్రీరామ శ్రీరామ యనకుండ మోక్షము చిక్కేది లేదని తెలియండీ మీకు
శ్రీరామచంద్రుని దయలేక మోక్షము చిక్కేది లేదని తెలియండీ

విచ్చలవిడిగాను వెదజల్లి ధనములు విలుచుకొనగలేరు తెలియండీ
హెచ్చుగా యజ్ఞయాగాలు చేసినగాని ఏమీ లాభములేదు తెలియండీ
అచ్చుపడగ శ్రధ్ధ మంత్రజపంబుల నతిశయించిన రాదు తెలియండీ
మెచ్చగ పదిమంది దానాలనేకము మెఱయించిన రాదు తెలియండీ

వేదంబు లెఱిగిన విద్వాంసులని మీకు బిరుదులుండినగాని రాదండీ
వేదాంతశాస్ర్రవిజ్ఞానులై మీరెంత పేరుకెక్కినగాని రాదండీ
ఏదేవతల నెంత మెప్పించగలిగిన నెవ్వరు మీకీయలేరండీ
లేదు వేరొకదారి శ్రీరామకృప కాక వాదాలు మాని గ్రహించండీ

భక్తుల కెపుడను పరమసులభుండైన భగవంతుడు రాము డున్నాడు
భక్తుల యోగక్షేమాలభారంబును వహియించు మన రాము డున్నాడు
భక్తిశ్రధ్ధలు కలిగి పరమాత్ముడాతని భావించితే వాడు మీవాడు
యుక్తి మరొక్కటి యోచించ వద్దు హరిభక్తులకే మోక్ష ముందండీకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.