19, జులై 2022, మంగళవారం

రాముని నమ్మితే రాని దేమున్నది

రాముని నమ్మితే రాని దేమున్నది ఆ
కాముని నమ్మితే కడ కేమున్నది

రాముని నమ్మితివా ప్రసాదించు సంపదలు
కాముని నమ్మితివా కబళించును నీసిరులు
రాముని నమ్మితివా ప్రసాదించు వరములు
కాముని నమ్మితివా కలిగించు వికారములు

రాముని నమ్మువారు రాజ్యములను పొందినారు
కాముని నమ్మువారు ఘనత పొందలేరు భువిని
రాముని నమ్మి యొకడు బ్రహ్మపదము పొందినాడు
కాముని బ్రహ్మవంశఘనుడు నమ్మి చెడినాడు

రాముని నమ్మి చెడడు భూమిపైన నెవ్వడును
కాముని నమ్మి సుఖము గాంచడే మానవుడును
రాముని నమ్మి మోక్షగామి యగును ముముక్షువు
కాముని నమ్మి నరకగామి యగును పామరుడు

1 కామెంట్‌:

  1. మాస్టారూ,వాల్మీకి రామాయణం నుంచి హనుమంతుడికి సంబంధించిన ఒక సాంకేతికమైన సందేహానికి జవాబు చెప్పాలి.హనుమంతుడి ఆయుధం ఏమిటి?

    ఎందుకు అడుగుతున్నానో తెలుసా!హనుమంతుడు గద వాడినట్టు వాల్మీకి ఎక్కడా చెప్పలేదని ఒక పరిశోధకుడు వాదిస్తున్నాడు.ఆన్లైన్ రామాయణాల్లో ఒకటి కంటె ఎక్కువ వెర్షన్లు కనిపిస్తున్నాయి.ఏది సాధికారికమైన వాల్మీకమో తెలియడం లేదు.మీరైతే సాధికారికమైన సమాచారం ఇస్తారని అడుగుతున్నాను.వాల్మీకి హనుమంతుడి ఆయుధం గద అని చెప్తున్న శ్లోకం ఉందా?

    అదీ గాక,రాముడు మాంసం తిన్నాడని కొందరు అంటున్నప్పుడూ ఇతరమైన వాదనలలోనూ రామాయణంలో కూడా ఇతరులు చేర్చిన ప్రక్షిప్తాలు ఉన్నాయని కొందరు అంటున్నారు.ప్రక్షిప్తాలతో కలిసి 24000 శ్లోకాలు అయితే వాల్మీకి వెయ్యి శ్లోకాలకి ఒకచోట గాయంత్రీ మంత్రాక్షరాల్ని నిక్షిప్తం చేసి గాయత్రీ రామాయణం వచ్చేలా వ్రాశాడని చెప్పటం కుదరదు కదా!

    ఈ రెండు సందేహాలకీ మీరే జవాబు చెప్పగలరని నా నమ్మకం.

    జై శ్రీ రాం!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.