23, జులై 2022, శనివారం

వనవాసమునకు వచ్చెదనంటే..


వనవాసమునకు వచ్చెదనంటే వద్దందువేమయ్య రాఘవా
వనములనిండా క్రూరమృగములే భయపడుదువేమో జానకీ

వనములలో క్రూరమృగము లుండినా మనకేమి భయము రాఘవా
వినవే పులులూ సింహములంటే వనమయూరములా జానకీ

పురుషసింహుడవు నీప్రక్కనుండగ పుట్టదేభయమూ రాఘవా
సరసిజాక్షి మంకుపట్టు మానవే వనములు భయంకరములే

నరనాథ వనమైన నీప్రక్కనుండగ నగరతుల్యము నాకు రాఘవా
తరళాక్షి వనసుందరివి కావలెనని తలచుట మానవె జానకీ

వనవాసమునకు వచ్చెదనంటే వద్దందువేమయ్య రాఘవా
వనములలోన రాకాసులుందురు వద్దువద్దే జానకీ

వనములనిండా రాకాసులుంటే మనకేమి భయము రాఘవా
వనజాక్షి నీవు వారినిచూచి భయపడుదువేమో జానకీ

వనజాక్ష నీవు నా ప్రక్కన నుండగ భయమేల కలుగును రాఘవా
అనుభవింఛినకాని వనవాసకష్టము లర్ధముకావా జానకీ

వనవాసమునకు వచ్చెదనంటే వద్దందువేమయ్య రాఘవా
వనములలో నీవు చూడదగినవి కనరావు నాకు జానకీ

వనముల పునిపుంగవులను జూడగవచ్చు వద్దనకయ్య రాఘవా
మునులకన్నను ముందు మన కడవులలో పులులెదురౌనే జానకీ

వనవాసమునకు వచ్చెదనంటే వద్దందువేమయ్య రాఘవా
వనవాసకష్టము నిను సుకుమారిని  భరియింప మందునో జానకీ

నను నీ వడవుల భరియింపలేనని ఆడలుచున్నావో రాఘవా
వినవయ్య నీవబల వలె బల్కుటను నేను వినలేను వినలేను రాఘవా

హరిబోలు తేజంబు గలనీవు నిలచిన అడవి యుద్యానంబు రాఘవా
సరిసరి నీధృఢనిశ్ఛయ మెఱుగితి సంతోషమాయెను జానకీ

దైవనిర్ణయమిది నీవెంట నేనుందు పోవుదమడవికి రాఘవా
దేవతలెందుకు త్రోసిరడవికి  దాని తీర్చగ బోదుమె జానకీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.