23, జులై 2022, శనివారం

తారకనామము చాలని.తెలియక

తారకనామము చాలని తెలియక ధరమీది జనులందరు
ఆరయ చేసే పనులన్నీ అక్షరాలా వెఱ్ఱివేషాలు

ఒకడేమొ ఉపవాసదీక్షలు-ఒకనాడు విడువక చేయును
ఒకడేమొ జపతపహోమాలు ఒళ్ళుమరచి చేయుచుండును
ఒకడేమొ నిత్యము దానాలు ఒట్టుపెట్టి చేయుచుండును
ఒకడేమొ తీర్ధాలు క్షేత్రాలు ఓహోహొ తిరుగుచు నుండును

వరుసపెట్టి ధర్మకార్యాలు మరువక చేసెడి వాడొకడు
తరచుగా గురుపాదపూజలని తత్తర పడుచుండు వాడొకడు
మరిమరి గొప్పగుడులంటూ పరుగులు పెట్టెడు వాడొకడు
అరరే క్షుద్రపూజలకే నిరతము తెగబడుచుండెడు వాడొకడు

పరమాత్ముని గూర్చి తెలియరుగా పతితపావనుని తెలియరుగా
మరి తెలియజెప్పే వారలతో నరులు స్నేహమును చేయరుగా
అరకొర తెలివిడితో వారు అవకతవకలునే చేసేరుగా
హరినామపరులై యున్నప్పుడే అపవర్గమును వారు పొందేరుగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.