27, మార్చి 2024, బుధవారం

నుయ్యాల నూగ రావయ్యా


సీతమ్మతో గూడి శ్రీరామచంద్ర 
   ప్రీతితో నుయ్యాల నూగ రావయ్యా
భీతహరిణేక్షణను సీతమ్మ నిపుడు 
   చేతులను పొదవుకొన వలెను రామయ్యా

క్రిందికిని మీదికిని జీవులను మీర 
   లందముగ నాడించు చందమున మేము
సందడిగ మీయిద్దరను నూయలందు 
   చక్కగా నాడించ దలచు కొన్నాము
ముందుగా నూయల నెక్కి శ్రీరామ 
   ముదిత సీతమ్మును చేదుకోవయ్యా
అందరము మీదు డోలోత్సవం బిపుడు 
  డెందంబు లలర తిలకించేము నేడు

క్రిందుగా నూగ నుయ్యాల మీదైన 
   సుందరవదనారవిందముల జూచి
అందరము సంతోష మందుచును దయలు 
   చిందించు దృష్టులను బడసేము తండ్రి
సుందరీమణు లూప నుయ్యాల నున్న 
   సుదతి సీతయు మీరు మీదు  పాదార
విందములు మాతలల నుంచున ట్లెగయ 
   చెందెదము ధన్యతను శ్రితపారిజాత

కోలాహలంబుగ డొలోత్సవమును 
   గొప్పగా మీకిపుడు మేము చేసేము
నేల కూతురు సీత మిక్కిలిగ మురియ 
   డోలలూగ రయ్య మీ యిర్వు రిపుడు
చాల వేడుకతోడ దేవతలు కూడ  
   సందడిగ నింగిపై గుమిగూడి చూడ
నీలమేఘశ్యామ నిగమాంతవేద్య 
   డోలలూగగ రమ్ము దివ్యప్రభావ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.