25, మార్చి 2024, సోమవారం

మ్రొక్కరె మ్రొక్కరె మీరిపుడు


మ్రొక్కరె మ్రొక్కరె మీరిపుడు
బహుచక్కగ భక్తిప్రపత్తులతో
మిక్కిలి దయతో నిజభక్తులను
మేలుగ నేలెడు రామునకు

ఘనయోగీంద్రులు మునిరాజేంద్రులు
ననయము సభలో తన యెదుట
హనుమత్సుగ్రీవులు విభీషణుడు
నంగదజాంబవదాదులును
విని మురియగను పరిపరివిధముల
వినుతించగ చిరునగవులతో
వినుచు ప్రసన్నత గనబరచెడు యీ
ఘనుడు రామునకు వినయముగ

నిరంతరంబుగ నానారద తుం
బురులు పాడగను తన యెదుట
గరుడుడు విష్వక్సేనుడు శేషుడు
సిరియును భూదేవియు వినుచు
శిరము లూపగను చిత్తగించుచును
పరిపరి విధముల కీర్తనల
చిరుచిరు నగవుల కనవచ్చెడు యా
హరియే యితడని వినయముగ

వైకుంఠంబున వెలిగెడు హరియే
సాకేతంబున రాముడని
లోకేశ్వరుడగు శ్రీహరియే యీ
లోకారాధ్యుడు రాముడని
శ్రీకంఠాదులు మిక్కిలి పొగడెడు
శ్రీహరియే యీ రాముడని
తేకువ మీరగ శ్రీరామునకు
దేవదేవునకు వినయముగ




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.