సాక్షు లున్నారయా సాకేతరామ
సాక్షులు నీమహిమ చాటుచున్నారు
శ్రీరామ నీదయాగుణ మద్భుతంబని చెప్పగా నొక కాకి సాక్షి
శ్రీరామ నీరూప మతిలోకమే నని చెప్ప నొక రాకాసి సాక్షి
శ్రీరామ నీబలం బింతింత యనరామి చెప్ప దుందుభికట్టె సాక్షి
శ్రీరామ నీకెదురు నిలువరాదని చెప్ప చెడిన రాక్షసరాజు సాక్షి
శ్రీరామ నిను చేరియుండుటే చాలనుచు చెప్పగా కపిరాజు సాక్షి
శ్రీరామ నిను శరణు జొచ్చుటే చాలనుచు చెప్ప రావణభ్రాత సాక్షి
శ్రీరామ నీసేవచేయుటే చాలనుచు చెప్ప హనుమంతుడే సాక్షి
శ్రీరామ నీనామమంత్రమే చాలనుచు చెప్ప నీభక్తాళి సాక్షి
శ్రీరామ నీవినయశీలంబునకు చాల ప్రీతిచెందిన ఋషులు సాక్షి
శ్రీరామ నీవిజయశీలంబునకు ప్రీతి చెందిన యింద్రుడే సాక్షి
శ్రీరామ నీవు శ్రీహరివనుచు చాటగా చేరి పొగడిన బ్రహ్మ సాక్షి
శ్రీరామ తారకబ్రహ్మంబు నీవనగ శివదేవు డున్నాడు సాక్షి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.