12, మార్చి 2024, మంగళవారం

ఉన్నా డున్నాడు

ఉన్నా డున్నాడు రాము డున్నా డున్నాడు
ఉన్నాడని నీవన్నా ఒప్పుకొనక లేడన్నా

మూర్తిమంతమైన బ్రహ్మముగను యోగులెరుగగ
కర్తవ్యరహితుడయ్యును కడిదిధర్మరక్షకుడై

ధూర్తుల శిక్షించి భక్తులను కాచు వీరుడై
ఆర్తులను బాధలలో నాదుకొనెడు దేవుడై

సురల కష్టములను తీర్చు సురవైరినాశకుడై
నరులకెల్ల ముక్తినొసగు నారాయణమూర్తియై

పరమయోగులకు నిత్యము నిరవధిసుఖదాయియై
పరమభక్తులకు నిత్యము వరములిచ్చు దేవుడై

వివిధవేదాంతవేద్య విమలస్వరూపుడై
భువనభాండములకు నిత్యపోషడగు దేవుడై

పవనసుతుని గుండె నిండి ప్రకాశించు చున్నాడు
శివుని హృదయపద్మ మందు చేరి వెలుగుచున్నాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.