5, మార్చి 2024, మంగళవారం

జయమెల్ల విధములుగను


జయమెల్ల విధములుగను శ్రీరామచంద్రునకు దిగ్విజయము

 

జగములన్నియు పొగడెడు మాతండ్రి జానకీపతికి జయము

నిగమరాసులు పొగడెడు మాతండ్రి నీరజాక్షునకు జయము


హనుమదాదులు పొగడెడు మాతండ్రి అఖిలాత్మకునకు జయము

మునులెల్లరును పొగడెడు మాతండ్రి మోక్షప్రదునకు జయము


వాసవాదులు పొగడెడు మాతండ్రి బ్రహ్మజనకునకు జయము

దాసులెల్లరు పొగడెడు మాతండ్రి ధర్మవీరునకు జయము


కామదహనుడు పొగడెడు మాతండ్రి కామజనకునకు జయము

భూమినాథులు పొగడెడు మాతండ్రి రామచంద్రునకు జయము


రావణాదుల నొంచిన మాతండ్రి దేవదేవునకు జయము

వేవేల వరములిచ్చు మాతండ్రి విజయరామునకు జయము