రాముడు నాప్రాణమని రమణి కైక పలుకగ
నేమి విడ్డూర మనుచు నెగిరె మంధర
అరచేతులను చూడవె యందలి గీత లెఱుగవె
పరమదివ్యలక్షణములు భావన చేయవే
విరాజిల్లు రామయశము ధరాతల ముండు వరకు
పరమసత్య మిది యనుచు పలికె కైక
సాముద్రికశాస్త్ర మనుచు చట్టుబండ లనుచు నీవు
రాము నింత ముద్దుచేయ రాదనెను మంధర
ఏమే నాకు భరతుడును రాముడును రెండు కండ్లు
రామునిపై నసూయపడ రాదనె కైక
రాము డెక్కు వాయెనా ఏమమ్మా మన భరతున
కేమీ తక్కు వాయెనో యెఱుకపరచుము
ప్రేమ సవతికొడుకుపై వెల్లువెత్తు నిన్ను బోలు
భామామణి యుండదని పలికె మంధర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.