1, మార్చి 2024, శుక్రవారం

రామహరే శ్రీరామహరే

 

రామహరే శ్రీరామహరే బ్రహ్మానందస్వరూప హరే

మహాద్భుతంబగు లీలాకృతులను మహినేలెడు శ్రీరామహరే
మహాప్రళయమున సృష్టిని గాచిన మత్స్య స్వరూప రామహరే

కొండను వీపున చక్కగ మోసిన కూర్మస్వరూప రామ హరే
మొండిరాక్షసుల మోసగించగ మోహిన వైన రామహరే

హిరణ్యాక్షుని దర్పము నణచిన వరాహరూప రామ హరే
హిరణ్యకశిపుని పొట్టను చించిన నరహరిరూప రామ హరే

బలితలపై నిజపాదము నుంచిన వామనరూప రామహరే
బలిమిని క్షత్రియకులమును తరిగిన భార్గవరూప రామహరే

దశరథనందన దరహాసముఖ దయామయా శ్రీరామహరే
దశకంఠాదిక దానవనాయక దర్పాంతక శ్రీరామహరే

కురుక్షేత్రమున నరపతు లందర కూల్చిన గోవిందరామహరే
పరిపరివిధములు ధర్మోధ్ధరణకు బయలుదేరు శ్రీరామహరే