31, మార్చి 2024, ఆదివారం

హరి హరి యనవే మనసా


హరి హరి యనవే మనసా అన
   మరచిన చెడుదువు మనసా

అలుపులేక హరి పాదాబ్జంబుల 
   నంటియుండవే మనసా
కలుషసాగరము సంసారములో 
   కలయదిరుగకే మనసా

సిరిని నమ్ముకొని హరిని మరచిన 
   చెడిపోదువుగా మనసా
హరిని నమ్ముకొన సిరులును కలుగును 
   తరచుగ నీకో మనసా

హరిభక్తులు విజ్ఞానుల మాటల
నాలకించవే ఓ మనసా
పరులు చెప్పు దుర్నీతులు వినిన
పరము దూరమగు నో మనసా

భవతారకమగు రామనామమును
వదలి యుండకే మనసా
భువనము నందున రాముడు మాత్రమె
ముఖ్యుడు నీకో మనసా

హరేరామ యని హరేకృష్ణ యని
మరువక పలుకవె మనసా
పరమంత్రంబుల నతిగా నమ్ముచు
భంగపడకె ఓ మనసా

భగవన్నామము వదలని వారికి
పరమపదము గలదో మనసా
తగని మమతలను తగులుకొన్నచో
గగనము మోక్షము మనసా