19, అక్టోబర్ 2020, సోమవారం

కోరిన వరమిచ్చువాడె గొప్పదేవుడు

కోరిన వరమిచ్చువాడె గొప్పదేవుడు చాల
కూరిమితో నుండువాడె గొప్పచుట్టము

మరువక నిన్నాదరించు మంచివాడె మిత్రుడు
కరుణామతి నన్నోదకంబు లిచ్చు వాడే దొర
గరువము లేకుండ నీవి కలుగువాడే దాత
తరియించు విద్యనిచ్చు దయాశాలియే గురువు

హరిని గూర్చి తెలుపునదే యసలుసిసలు విద్య
హరికి జోడించు నట్టి కరములే‌ కరములు
హరి పైన నిలచి యుండు నట్టి బుధ్ధి బుధ్ధి
హరియె సర్వస్వమను నట్టి వాడె పో నరుడు

సరగున ఫలించి ఫలమొసంగు నదే మంత్రము
మరియాద నిలుపునట్టి మంచిమాటయే మాట
హరినామములె పలుకు నదియే చక్కని నోరు
తరచు రామతత్త్వమును తడవునట్టిదే మనసు

2 కామెంట్‌లు:

  1. జన్మ కు మించిన వరం ఎనలేనిదని అంటాను శ్యామల్ రావు సర్.. ఎందుకనంటే.. దుర్లభమైన మానవ జన్మ పొందే భాగ్యం జీవకోటిలో మనషులకే అంది వచ్చిన గొప్ప వరం.. ఐతే కొందరు స్వార్థానికో మరే యితర కారణాల మూలాన ఇటువంటి జీవితానికి అనాలోచితంగా చరమగీతం పాడుతు ఉంటారు. అది మానవాళి కే విరుద్ధం. జీవితం ఉన్ననాళ్ళు బ్రతికితే అదే మనం ఈ జీవితానికి ఇచ్చే పరిపూర్ణత..

    ~శ్రీధర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంతూనాం‌ నరజన్మ దుర్లభం అని కాలడి శంకరుల మాట. ఐతే‌ నరులుగా మనం‌ నరజన్మ గొప్పది అనుకుంటాం. అనుకోవాలి కూడా. అది సహజం. కని నిజానికి, ఏ యుపాదిలో ఉన్న జీవున కైనా ఆ యుపాధియే దొడ్దదిగా అనిపిస్తుంది.

      ఒక సారి ఇంద్రుడికి కాలవశాత్తు పందిజన్మ సంప్రాప్తించింది. ఆయన ముందుగానే‌ నారడుణ్ణి వేడుకున్నాడు. మహాత్మా నన్ను పందిజన్మలో ఉండగా మీరు ప్రబోధించండి. ఆ భయంకరమైన నీచ జన్మం వదిలి తిరిగి యధాస్థితికి వస్తాను అని. నారదుడు అలాగే వచ్చి ప్రబోధిస్తే ఇంద్రుడు కాస్తా ఇదే‌ అత్యుత్తమైన ఉపాధి, దీనిని వదలటం‌ ప్రశ్నలేదు పో అన్నాడు బురదలో దొర్లుతూ.

      అందుచేత భగవంతుడి సృష్టిలో ఏ ఉపాధినీ‌ మనం తక్కువ తరగతిది అనుకోవద్దని నా అభిప్రాయం.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.