29, అక్టోబర్ 2020, గురువారం

ముక్తి కావలయును

 ముక్తి కావలయును ముక్తి నెవ్వరిత్తురు

ముక్తి దేవుడిచ్చును పోయి వాని వేడుము


ముక్తినిచ్చు దేవుడెవరొ ముందుగా తెలుపుడీ

శక్తి కొలది యతని దెల్పు శాస్త్రముల జదివెద

యుక్తియుక్త మన్నటులే యున్నది నీమాట కాని

ముక్తినిచ్చు వాడు శాస్త్రములకు దొరుకబోడు


ముక్తినిచ్చు దేవుడెవరొ ముందుగా తెలుపుడీ

శక్తి కొలదిగా పూజలు సాగించు నతనికై

యుక్తియుక్త మన్నటులే యున్నది నీమాట గాని

ముక్తినిచ్చు వాడు నీపూజలకు దొరుకబోడు


ముక్తినిచ్చు దేవుడెవరొ ముందుగా తెలుపుడీ

శక్తి కొలది వాని మంత్రజపము చేయుదు నేను

యుక్తియుక్త మైన రీతి నున్నది నీమాట నీవు

శక్తికొలది రామనామ జపము చేయుమా యిక