19, అక్టోబర్ 2020, సోమవారం

ధన్యత చెందెను రామయ్యా

ధన్యత చెందెను రామయ్యా నీ దయచే నా బ్రతుకు
అన్య మెఱుగ నని జాలిచెంది నన్నాదరించి నావు

అంశలు స్థావరజంగమములు నీయందని తెలిసితిని
సంశయరహితుడనై నీపదముల చక్కగ నొదిగితిని

పుణ్యము పాపము రెండును వలదని బుధ్ధి నెఱింగితిని
అన్యులు లేరిట నందరు నీవా రన్నది తెలిసితిని

నిరుపమానమగు నీతత్త్వమునే నిత్యము తలచితిని
పురుషోత్తమ నీపదపీఠికపై పూవై నిలచితిని

నను చేరిన పొగడిక లవి నీవని మనసున తలచితిని
నను తెగనాడెడు వారును నాహితులనుచు సహించితిని

పరమాత్ముడవగు నీ పారమ్యము భక్తి నెఱింగితిని
హరియే నీవని హరుడవు నీవని యాత్మ నెఱింగితిని

శ్రీచక్రస్థిత లలితాపరమేశ్వరివని యెఱిగితిని
నీ చెయిదంబులు సృష్టిమూలమని నిజముగ తెలిసితిని

నిను కీర్తించుట నాభాగ్యముగా మనసున నెంచితిని
మనవిని విని నా కీర్తనలను విని నను మన్నించితివి

ఇసుమంతైనను తనివి తీరదే యెంతగ పొగడిననను
వసుమతి నిటులే పొగడుచు నుండెద వసుధాధిప నిన్ను
 

4 కామెంట్‌లు:

  1. రాముని యందే మీ చిత్తమును నిలిపి మీరు లిఖిస్తున్మ
    రచనలు రమ్యంగా ఉంటున్నాయి.
    (పైన రెండవ పాదంలో “అన్య మెఱుననని” అని పడింది. అన్య మెఱు..గ..నని అని ఉండాలేమో కదా?)

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శ్యామలోవాచ: స్వామి తవనామ సంకీర్తనమపి సహస్రాది విరచితాం. ఏతత్ ఖలు తవ కృపాకటాక్షమితి. భగవన్ ఏతత్ సమర్పయామి తవ పాదారవిందే. స్వీకృతో భవ.
    శ్రీ రామచంద్రోవాచ:కీర్తన సహస్రాది దృష్టవా అహమపి సంతుష్టాభవతామ్ దాతుమిచ్ఛామి వరాని లోక కళ్యాణం కురుతే తద్మనుష్యాణాం యశః ప్రాప్నోతి విజయోస్తు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.