18, అక్టోబర్ 2020, ఆదివారం

ఇత డిటువంటి వాడె యెఱుగరో మీరు

ఇత డిటువంటి వాడె యెఱుగరో మీరు
చతురత రామునకు సరి వారెవరు

ఎందుబోయి డాగి కొన్న నెదిరించ రాగలడు
క్రింది మీదులను తానై క్రీడించ గలడు
ముందుకురికి మీదికెత్తు భూగోళ మైనను
సందుజూచి యెత్తగల డెందులేని వేసము

మెల్లగాను కాలుపెట్టి కొల్లగొట్టు సర్వమును
కొల్లపుచ్చు నెంతవారి గొప్పలైనను
చల్లని చూపుల నేలు సర్వలోకములను
కల్లలాడు వారి తోడ కలహము లాడును

భూమికి బరువైన వారి బొందపెట్టు చుండును
భూమిని కలిపెత్తనము పోనడగించు
ప్రేమ జూపు భక్తులకు రెట్టింపు సేయుచు
కామితార్ధముల నెల్ల కరుణించు చుండును