22, అక్టోబర్ 2020, గురువారం

నమ్మిన వారిని చల్లగా జూచే

 నమ్మిన వారిని చల్లగ జూచే నారామునకు జేజేలు

కమ్మని వరములు కొల్లగ కురిసే కన్నతండ్రికి జేజేలు


ఆజుల దనుజుల తేజము లణచే తోజోనిథికి జేజేలు

రాజన నితడే రాజన నేలిన రాజరాజునకు జేజేలు

జేజేలంతా సతతము మ్రొక్కే సీతాపతికి జేజేలు

రాజలోకపు పూజల నందే రామరాజునకు జేజేలు


పరమవీరులు పడిపడిమ్రొక్కే పరమవీరునకు జేజేలు

పరమహంసలు నిరతము తలచే పరమపురుషునకు జేజేలు

పరమాత్ముడని హరుడు తెలిపిన పరంజ్యోతికి జేజేలు

నరుడై ధరపై వెలసిన శ్రీమన్నారాయణునకు జేజేలు


కాలరూపునకు జగదోద్భవక్షయ కారణమూర్తికి జేజేలు

నీలాంబోధరశ్యామునకు కమనీయగాత్రునకు జేజేలు

మేలుగ సద్భక్తాళిని బ్రోచు దయాలవాలునకు జేజేలు

నాలో నిలచిన నాశరహితునకు నారాయణణనకు జేజేలు