17, అక్టోబర్ 2020, శనివారం

రమణీయం బగు రాముని చరితము

రమణీయం బగు రాముని చరితము
విమల ముదారము విబుధార్చితము

హరి నీవే ముష్కరుడగు రావణు
పరిమార్చుమని సురవరు లడుగగ
నరుడై శ్రీమన్నారాయణుడే
పరమాధ్బుతముగ బరపిన లీల

కలుగ రాముడై కమలాపతియే
వెలసెను వేదమె విభుని చరితమై
కలకాల మిది నిలచి యుండునని
తెలిసి కొలుచుటే దివ్య భాగ్యము

ఇల భవతారక మీతని నామము
పలికిన చాలును తొలగును పాపము
కొలుచిన వారికి కొంగుబంగరై
కొలుచును మోక్షము కూరిమితోడ