30, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీరామ శ్రీరామ యని

శ్రీరామ శ్రీరామ అని నీవు జపము 

   చేయవిదేమి ఓ జీవుడా

శ్రీరామ నామము చింతించక నెట్లు 

   చేరేవు పరమపదము జీవుడా


భవసాగరమునందు పడియున్న దీనుడ

    బయటపడుదు వెట్టు లో జీవుడా

భవతారణైకమహానౌక శ్రీరామ

     పరమమంత్రమె కాద ఓ జీవుడా

చివరి దాకా నీవు శ్రీరామ మంత్రమే

     చింతించకున్నచో నో జీవుడా

భవతారణము లేదు పరమపదము లేదు

    మివుల విచారించి మేలేమియును లేదు

     

భవదుర్గమారణ్యపరిభ్రమణశీలుడ

    బయటపడుదు వెట్టు లో జీవుడా

భవవనమున దారి బాగా తెలిసిన మంచి

     వాడు రాముడే కద ఓ జీవుడా

చివరి దాకా నీవు శ్రీరాముని చెంత

     చేరకుండిన యెడల నో జీవుడా

భవవనమున నుండి బయటపడుట లేదు

    మివుల విచారించి మేలేమియును లేదు


భవసర్పగాఢపరిష్వంగబధ్ధుడ

    బయటపడుదు వెట్టు లో జీవుడా

ఎవనికి పెనుబామె యింపైన పరుపాయె

    వాడె రాముడు కద ఓ జీవుడా

చివరి దాకా నీవు శ్రీరాము నొడికము

    చింతించక యున్న నో జీవుడా

భవసర్పము నిన్ను వదలుటన్నది లేదు

    మివుల విచారించి మీలేమియును లేదు