19, అక్టోబర్ 2020, సోమవారం

రామతత్త్వ మనగ నేమి

రామతత్త్వ మనగ నేమి శ్యామలరాయా శ్రీ

రామతత్త్వ మంటే పరబ్రహ్మ తత్త్వమే


పిల్లికి బిడాల మనే విధ మిదయ్యా కాస్త

వెల్లడించ వయ్య అసలు విషయ మేమిటో

ముల్లోకంబులును ప్రకృతి మూటను కలవు ఆ

ముల్లె పరబ్రహ్మము మూపున కలదు


ప్రకృతి లోనె నామరూపాదులు కలవు ఆ

ప్రకృతి కవలి బ్రహ్మమునకు పట్టవట్టివి

ప్రకృతిజనుల కెట్లు తెలియు బ్రహ్మము గూర్చి ఈ

ప్రకృతి లోని కా బ్రహ్మము వచ్చు నందుకే


వచ్చె నట్లు రాముడై బ్రహ్మ మొకపరి అట్లు

వచ్చిన ఆ రాముని పరమతత్త్వమే

అచ్చమైన బ్రహ్మతత్త్వ మని యెరుగుటయే తా

ముచ్చటగా రామతత్త్వమును యెరుంగుట