12, అక్టోబర్ 2020, సోమవారం

ఐదైదు గుమ్మాలున్న అందమైన యిల్లిది

 ఐదైదు గుమ్మాలున్న అందమైన యిల్లిది

నీదేలే నీదేలే నీవు నాకిచ్చినదే


నీ పనుపున నేనున్నను నీదేగా యీయిల్లు

నా పని నీయింట నుండి నీపనులు సేయుటయే

కాపలా వాడననుము కావలసివాడ వనుము

ఓ పరమాత్మ నన్నిట నుంచితి వే నుంటిని


నా యింటికి రమ్మని జనాంతికముగ నందును

నాయిల్లా నిజమున కిది నీయిల్లని యెరుగనో

నీ యింటికి వచ్చి పోను నిన్ను నే పిలిచెదనో

నా యిల్లని జగమనుకొను నీ యింటికి రావయ్య


పదునాలుగు లోకముల ప్రతిగృహము నీయిల్లే

సదయ నీవు నన్నుంచిన చక్కని యీ యింటిలో

ఎదురు చూచుచుంటి నయా ఎపుడు వత్తువో యని

పదము లిందు మోపవయా పతితపావన రామ