19, అక్టోబర్ 2020, సోమవారం

రామకీర్తన లివి

 రామకీర్తన లివి రాముని సొత్తు చాల

ప్రేమతో పాడు భక్తవీరుల సొత్తు


విని తరించగోరు నట్టి విబుధుల సొత్తు యివి

పనవిపనవి సంతసించు మనసులసొత్తు

జనుల కందించ గోరు ఘనులకు సొత్తు యివి

తనివారగ చదువుకొను ధన్యుల సొత్తు


భజన చేసి సంతసించు వారల సొత్తు యివి

ఋజువుగా కొలుచుకొను సుజనుల సొత్తు

సజలనయనులై పాడు సర్వుల సొత్తు భవ

రుజాంతకమని నమ్మెడు ప్రజలకు సొత్తు


ధర్మవీరులగచు వెలుగు దాంతులసొత్తు సత్య

ధర్మములను గారవించు ధన్యుల సొత్తు

నిర్మలురగు రామజప నిష్ఠుల సొత్తు యివి

శర్మదాయినులు కాలచక్రము సొత్తు