15, అక్టోబర్ 2020, గురువారం

రామచంద్రుని మరువగరాదు

రామచంద్రుని మరువగరాదు సుజనులార
ప్రేమతో సేవించి పెంపుగొనుడు

ఒక్కడైన రామునకు మ్రొక్కకుండ మీరు
చిక్కులు కొని తెచ్చుకున్న చింతలయ్యేను
చక్కగా విచారించి సాగుడయ్య రేపకడ
మిక్కిలి విచారించ మీ కేమిటికి

అవియు నివియు కోరి మీ రన్యదేవతలను
పవలు రేలు కొల్చినను ఫలమే ముండు
భవబంధమోచనుడు రవికులేశ్వరుడని
యవగతము కాక లే దావలి యొడ్డు

ఇతరులను కొలుతురా యిచటనే యుందురా
ప్రతిదినమును శ్రీరాముని ప్రార్ధింతురా
మతిమంతులార మీరు మంచి మార్గ మెంచి
ప్రతిఫలముగ మోక్షమును బడయ వలయును