9, జూన్ 2012, శనివారం

తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను

తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను
విలసిల్లె నీరీతి విడని బంధము రామ

క్షణక్షణమును నీది దినదినమును నీది

కనుగవ యెదుట నుండి కరగు కాలము నీది
వెనుకటి గొడవలన్ని విడిపించి నన్ను నీ
కనుసన్నల నుంచి కాచేవు భళిభళి

ఘటికుడ యెన్నెన్నొ కష్టజన్మము లెత్తి

కటకట పడుచుండ కని యూరకున్నావు
చిటుకున నిపుడు నీవు చేకొన చిక్కు లన్ని
మటుమాయ మాయెనే మంచిది భళిభళి

కలిగి యవిద్య చేత కలవర పరచినట్టి

కిలుమెల్ల వదలినది తలకెక్కె తత్వము
నిలచితి స్వస్వరూప నిష్టుడనై యుండుట
తెలియగ నీవిచ్చిన తెలివిడి భళిభళి