8, జూన్ 2012, శుక్రవారం

అన్ని వేళల నీవే ఆలోచనల నిండి యున్నావు రా

అన్ని వేళల నీవే ఆలోచనల నిండి
యున్నావు రా నీ యుద్దేశ మేమి
నన్ను పదుగురి వోలె నడువగ నీయవు
తిన్నగ నీయునికి పట్టు తెలియగ నీయవు

కనులు ముక్కును మూసి ఘన యోగ ముద్రనుండి

మనసు నీ లోకము నుండి మరలించగ నా వశమా
పనిగట్టుకొని నీవే పట్టుకొన్నావుగ నన్ను
నను కికురించ నీకు  న్యాయమగున చెప్పవయ్య

కొంటె వాడ నా చుట్టూర కొల్లలుగ బలగము నిటుల

అంటగట్ట నేకతమును  ధ్యానమును నావశమా
తుంటరివై నీవె నాకు తొడగినా వీ బంధములను
కంటబడ విది నీకు తగిన  కార్య మగున చెప్పవయ్య

నాకు తోడై యుందు నని నమ్మించి పంపి యిలకు

నా కర్మమునకు నిచ్చట నన్ను వదలి పెట్టినావు
నీ కేమొ యాటయె గాని నా కిది సంకటము గాదె
శ్రీకర నీవింత బెట్టు చేయనేల చెప్పవయ్య

4 వ్యాఖ్యలు:

 1. అదేకదండీ విష్ణు మాయ.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆలోచనలో నిండి
  నన్ను విడనాడి,
  హృది లో మదిలో
  నెలకొల్పి,
  ప్రేమ తత్వమున
  కర్మ యోగి వై,
  సంచరిచు మిత్రా,
  సర్వం కృష్ణం వందే జగద్గురుం .

  చీర్స్
  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నిరతము మనమున నిండిన
  పరమాత్మ యునికి గనంగ పరతాపమునన్
  మరిమరి యన్వేషించుట
  నరయంగా భక్తిలోని యద్భుతము గదా !

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నమో శ్రీ కృష్ణ......!!చాలా చాలా బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.