5, జూన్ 2012, మంగళవారం

ఏమయ్యా మంచివాడ యెంతో చక్కని వాడ

ఏమయ్యా మంచివాడ యెంతో చక్కని వాడ
గోముగ సేవించు పూల గోడు కాస్త వినవయ్య

ఈ మా సువాసనలు స్వామీ మీ దయ చేత
మా మా తనువులను మన్నించి చేరినవి
ఈ మహిత సృష్టిని నీ మహిమను గాక
ఏ మైన కలిగెనా యేమి తేగలమయ్య
మా మా భాగ్యములు మాపరీమళములను
మీ మేన నలదుటకు వే మారులు వేడెదము

ఈ రేకుల వన్నెలు ఈ సౌకుమార్యములు
చేరినవి మాతనువుల శ్రీకర నీకరుణచే
ఆరయ ఘనప్రకృతిలో నన్నియు నీ మహిమయే
కూరిమి నమరించగా కొల్లలై గలిగినవి
వేరుగ మేమేమి తెచ్చి విన్నవించగలము
తీరుగ మా భాగ్యమైన మా వన్నెచిన్నెలే
మీరు పరిగ్రహింపగ  వే మారులు వేడెదము

ఈ మా గుండెలలో నిండి పొంగి పొరలెను
స్వామీ మీ ప్రేముడియే చక్కని తేనియగా
యేమని చెప్పవచ్చు నింతకన్న తీయని దిం
కేమైనా సృష్టిలోన నెచటనైన నున్నదా
ఏమీ అనుకొనక యీ తీయతీయని
ప్రేమనే గైకొనుమని  వే మారులు వేడెదము

2 కామెంట్‌లు:

 1. సిత తామర పూ బాలా !
  అతులిత ప్రేమల మధువులు , నద్భుత సౌగం
  ధిత పరిమళములు , రమణీ
  య తనూ విభవములు - నతని - నందుట కేనా ?

  దర్శించండి బ్లాగు సుజన-సృజన

  రిప్లయితొలగించండి
 2. రాజారావుగారూ, సమస్తమూ స్వామినుండే ప్రభవించి స్వామియందే పర్యవసించుచున్నాయి.
  ప్రకృతి యొక్క మాయ ప్రభావం యెంతటి దంటే ఈ సత్యం సార్వకాలీనం, సర్వేసర్వత్రా దర్శనీయం, సులభగ్రాహ్యం. అయినా జీవులకు అది విస్మృతిలోనే ఉంటుంది! ఇక్కడ పూవులకు చెప్పబడిన సుగందం, సువర్ణం, మకరందమాధుర్యం అనేవి జ్ఞానుల పరంగా శుభ సంస్కారం, ఈశ్వరవిభూతి స్వరూపమైన గాత్రం ,ఆత్మానందం అనే వాటీకి ప్రతీకలు. నిత్యం వినయంగా జ్ఞానులయిన వారు వీటిని తిరిగి స్వామికే వినయంగా సమర్పిస్తున్నారు.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.