21, జూన్ 2012, గురువారం

నీ వలె నుండ లేక నాకు తిప్ప లెన్నెన్నో

నీ వలె నుండ లేక నాకు తిప్ప లెన్నెన్నో
కావలసిన యొడుపు బాగ కలుగు దారి చెప్పరా

ఇవి యవి కావలయునని యేవేవో కామనలు
అవి దొరుకని వేళ చెప్ప నలవికాని భావనలు
పవలు లేదు రేయి లేదు పరితపించు నా మనసు
అవధరించ వయ్య యిది అంతులేని బాధ ప్రభూ

ఒక నాడు నీవు నేను నొక్క రీతి నుంటిమిగా
సకలము మనదగుట నాశామోహము లెరుగకను
అకట వేరు చేసితివి అవని కంపితివి నన్ను
వికటాట్టహాసములతొ  విరుచుకు పడెరా ఆశలు

విభవములు వింత లిచట వేలున్నా వలదు నాకు
అభయమిమ్ము దురాశల నధిగమించు సుళువిమ్ము
ఉభయుల మొకటే ననుట ఉట్టిమాట కానీకుము
ప్రభు నాకిక స్వస్వరూపావబోధ కలిగించుము

1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.