16, ఆగస్టు 2016, మంగళవారం

రాజారావు గారి పద్యాలను నేను తస్కరించానా?పాఠకమహాశయులారా,

వరూధిని బ్లాగులో వచ్చిన ఈ క్రింది వ్యాఖ్యను పరిశీలించండి.

వెంకట రాజారావు . లక్కాకుల Aug 15, 2016, 7:27:00 PM
ఖ్యాతి వహించి నట్టి ఘను లక్కట నా పలు పద్య మాలికల్
వ్రాతలు తస్కరించి తమ బ్లాగున వేసిరి , ముందనుఙ్ఞ లే
దే! తమ చేతలేమొ ఘనతే , పెర వారివి తప్పిదా లగున్ ,
నీతులు జెప్పు కోవిదుల నీమము లిట్టివి , చూడ ముచ్చటౌ .


రాజారావు గారు ఘనుడు అంటే అనునిత్యం ఎత్తిపొడిచేది నన్నే కాబట్టి వారు తస్కరుడంటున్నది నన్నే అనుకొన వలసి వస్తోంది.

ఎంతో నొవ్వు కలిగింది ఈ నిరాధారమైన నిందాలాపానికి. వారి పద్యాల మాలలను దొంగిలించి నా బ్లాగులో ప్రచురించ వలసిన అగత్యం నాకేమి ఉంది?

నిజానికి, గత రాత్రి విపులమైన సమధానం వ్రాసాను. కాని ప్రచురించే ముందు సమయం తీసుకోవటం‌ మంచిదని ఆగాను.

నా సంగతి ఈ తెలుగుబ్లాగు లోకానికి చక్కగా తెలిసినదే. అటువంటప్పుడు ఇది నీలాపనింద అన్నది వారికి సులభగ్రాహ్యమే.  అందుచేత నేను విపులమైన అభ్యంతరాన్నీ వివరణనూ వ్రాయవలసిన అగత్యం ఏమీ లేదు కదా. కాబట్టి అలా విపులంగా వ్రాసినది మొత్తం తొలగించి కేవలం క్లుప్తంగా (నా రికార్డు కోసమే అనుకోండి) నా బ్లాగులో ఈ సంగతిని ప్రస్తావిస్తున్నానంతే.

వెత గలిగినన తాళుకొమ్మననే అని భగవద్వచనం అన్నట్లుగా సద్గురు త్యాగరాజస్వాముల వారు

   సద్భక్తులనడత లిట్లనెనే
   యమరికగా నాపూజఁ గొనెనే
   యలుగ వద్దనెనే
   విముఖులతోఁ జేరఁ బోకు మనెనే
   వెత గలిగిన తాళు కొమ్మనెనే


అని ఆరభిరాగం లో సాధించెనే అన్న పల్లవితో మొదలయ్యే తమ పంచరత్న కీర్తనలో ఉపదేశించారు కదా. అదే శిరోధార్యం.


18 కామెంట్‌లు:

 1. లక్కాకులవారికి "దేముడు" తిక్క పట్టుకుంది.జిలేబీకి తంపులు పెట్టడం పిచ్చి పట్టుకుంది.ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ వయస్సుని కూడా మర్చిపోయి రెచ్చిపోతున్నారు.పద్యాలు రాయడం కష్టమే.అన్నీ సరిచూసుకోవాలి,ఛందస్సులో గానీ మామూలు భాషలో గానీ నియమాలు అంటూ ఉన్నప్పుదు పాటించాలి.కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నియమల్ని ఉల్లంఘించినా ఆ ఒక్కసారికీ తప్పలేదు గనక చేసినా తప్పు తప్పే గనక ఒప్పుకోవాలి.రూల్సుని బ్రేక్ చెయ్యటమే ఘనకార్యం అనుకుని ఇది బాబూ నియయమం,ఇట్లా చెయ్యగూదదు అని చెప్పినవాణ్ణి తిట్లకి లంకించుకోవడం మర్యాదస్తులు చెయ్యాల్సిన పని కాదు.

  అయినా కొత్త కొత్త చందస్సుల్న్ని బయటికి లాగి ఉదాహరణకి పద్యాలు రాసి చూపిస్తున్న మీకు ఆయన్ని కాపీ కొట్టాల్సిన ఖర్మేమిటి?డాబుసరి డప్పాలు కాకపోతే - టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నట్టు!

  శ్రీశ్రీ "ద్వేషం ఇచ్చే పర్సెంటేజి ప్రేమం ఎట్లా ఇవ్వగలదు?" అనేచోట "ప్రేమం" అనే మాట అద్భుతంగా అమిరింది.కానీ ఆ మాటని శ్రీశ్రీయే మరొకచోట ఎక్కడా వాడలెదు - ఎందుకని?

  "తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు" అన్న వాక్యాన్ని పట్టుకుని మీమీదకి ప్రయోగించేవాళ్ళు "బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా!" అనే మాటని మర్చిపోతున్నారు.

  రిప్లయితొలగించండి
 2. శ్యామల రావుగారు, ఒకరి రాతలు చౌర్యమ్ చెయాల్సిన దుస్తితిలొ మీరు ఉన్నారని నేనే కాదు మీ గురించి మీ రచనా పటిమ గురించి తెలిసిన వారెవరూ అనుకోరు. బహూశా లక్కాకుల వారుకూడా మీ గురించి కాదు అనుకుంటా ప్రస్తావించింది.

  ఏది ఏమైనా శ్యామలరావు గారి లాంటి సీనియర్ రచయిత తన గురించే నిందాపుర్వకమైన వ్యాఖ్యలు చెసారని బాదపడుతూ ప్రస్తావన తెచ్చినప్పుదు , తను అన్నది శ్యామలరావుగారి గురించి కాదని , దానికి సంబందించిన వారు వేరేవరో ఉన్నారని లక్కాకుల వారు చెపితె బాగుంటుంది. లేదూ తాను అన్నది శ్యామల రావు గారి గురించే అని అంటె అందుకు తగిన సాక్శ్యాదారాలు చూపించినా సరే!

  ఏది ఏమైనా తోటి బ్లాగర్, ఒక పెద్దాయన తనను దొంగ అన్నారు అని బాదపడుతున్నప్పుడు అందుకు తగిన విదంగా స్పందించి ఈ విషయం లో ఒక క్లారిటి ఇస్తే బాగుంటుంది అని సాటి బ్లాగర్ గా నేను అభిప్రాయపడుతున్నాను.

  తెలుగు బ్లాగులు కొంతకాలమ్ అయినా మనుగడలో ఉండాలంటె బ్లాగ్లర్లు మద్య సుహ్రుద్బావ వాతావరణం ఉండి తీరాలి. లేకుంటే ఏవరి గోల వారిదే కావచ్చు. చివరకు అందరం అబాసుపాలు కూడా కావచ్చు.

  రిప్లయితొలగించండి
 3. హరిబాబు గారు, మద్దిగుంట వారు చెప్పినది అక్షరాలా నిజం. పండితవైరం, పండితుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఏది తప్పు ఏది ఒప్పు అనే వాదోపవాదాలూ జరుగుతుంటాయి. సుహృద్భావంగా ఉండాలి గానీ ఎదుటి వ్యక్తికి దొంగతనం అంటగట్టేంత దూరం లాక్కెళ్ళడం విచారకరం. అందులోనూ వయసులో పెద్దవారు, బాధ్యతాయుతమైన ఉద్యోగం చేసినవారయ్యుండి ఎదుటివారి మీద నిందారోపణలు చెయ్యడం బాగులేదు.
  ఇక రాజకీయ నాయకులకి ఓట్‌బ్యాంక్ ల్లాగా కొంతమంది బ్లాగర్లకి కొంతమంది మద్దతుదారులుంటారు, వారిని ఆ బ్లాగరు ఏమీ ఖండించరు.
  అయినా గతంలోనూ ఇటువంటి అనుభవాలు ఎదుర్కొన్న శ్యామలీయం గారు ఇకనైనా అటువంటి వ్యక్తులకి దూరంగా ఉంటే మనశ్శాంతని నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 4. భాష జనుల కొరకు
  --------------------------
  జన వ్యవహారము కొరకా
  ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
  జన భాష నుండి విడివడి
  ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

  పండితుల మాట సుష్టువు!
  దండిజనుల నుండి పుట్టి తల్లి పలుకు గా
  మెండుగ వ్యవహారము నం
  దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

  భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
  ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
  పదము మారు , దాని పరమార్థమును మారు
  మార్పు లేని భాష మరణమొందు.

  ఎరుకగల వారమందురు ,
  అరమరికలు లేని జనుల వ్యవహారములో
  విరిసిన తాజా మల్లెల
  పరిమళ పదసంపద లకు పరిహాసములా!

  ప్రజల నాల్కల పయి బ్రతుకును భాషలు ,
  పండితుల మెదళ్ళ పైన కాదు,
  ప్రజల నాల్కల పయి పరవశించు పలుకు
  జీవ గుళిక , గొప్ప చేవ కలది .
  ----- అనే ఈ నా పోస్టును
  మొత్తంగానూ , యథాతథంగానూ తమ పోష్టులో
  వేశారు.
  పై పోష్టులో రాసింది భాషపై నాకున్న ఖచ్చితమైన అబిప్రాయం. వారి మీద విసుర్లవుతాయా?
  సదరు పోష్టులో నా ఇంటి పేరును హేళన చేస్తారా?
  నేనెన్నడూ వారి పేరు మీద వ్రాయలేదు. కానీ
  నా పేరు మీద మూడు పోస్టులు వేసి, నానా యాగీ చేశారు.
  నేనేది రాసినా జనరల్ గా రాస్తాను. అన్నింటినీ వారి మీద విసుర్లనుకోవడం వారి భ్రమ.

  'ఘను'లని నేనెవ్వరినీ
  అనలేదే పేరు బెట్టి , యటులెవరైనన్
  తనువుబ్బ గింజు కొనిరా
  వినయముగా నవ్వు కొందు , విధినేమందున్ ?

  నా పద్యాలలో ఒకటో అరో జన వ్యవహారము లోని పదాలుండడం నా కభిమతం.
  వారు దీనిని నిరసించి, తమ బ్లాగులో నా వ్యాఖ్యలు ప్రకటించనన్నారు. కానీ, అపార్థాలకు
  తెర దించడానికి నేడు నా వ్యాఖ్యను ప్రకటించ వలసి
  వచ్చింది. క్షంతవ్యుడను .


  రిప్లయితొలగించండి
 5. గత సంవత్సరంన్నర పైగా బ్లాగుల్లో జరుగుతున్నదేం శోభాయమానంగా లేదు. దొంగతనం జరిగినపుడు పట్టి చూపించడం మంచిది కదా! దొంగతనం చేసిన వారిని ఛీ కొడతారుకదా! అదెందుకు చేయరు?
  పరదాలచాటున కూచుని జనాలమీద రాళ్ళేయడం, అరాచకత్వాన్ని ప్రజ్వలింపచేయడం చేస్తున్నవారు అదే ఘన కార్యమనుకోవడమే శోచనీయం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు, ఇవతలవారనలేరా? సభ్యత వదిలేస్తే ఇవతలివారంతకంటే ఎక్కువే అనగలరు, అది మరవద్దు.
  బ్లాగులు రాసేవారు సరే! మన తెలుగు బ్లాగుల్లో బ్లాగు లేని ఏకైక వ్యక్తి, కామెంటర్ వారిని కించపరచే మాటలు మాటాడి కూడా కనీస క్షమాపణలు కూడా చెప్పలేని దుస్థితిలో, దీన్నేమనాలి?
  మీకిష్టం లేని కామెంట్లు మీరు బ్లాగునుంచి తొలగిస్తున్నపుడు,ఎదుటి వారికి ఆ స్వాతంత్ర్యం ఉండదా? ఆ కామెంట్లని మరొక బ్లాగులో ప్రచురించడం బాగుంటుందా? ఇది అరాచకత్వం కాదా?
  వద్దు మహప్రభో, ఈ తెలుగు బ్లాగులకో దణ్ణం, తెలిసో, తెలియకో ఇందులో కొంత కాలమున్నాం, బయటికి పోతున్నాం, అని బయటికి పోయినవారినీ చంపుతున్నారే, మిమ్మల్నేమనాలి?
  స్పర్ధా వర్ధయతే విద్యా! స్పర్ధతో ఇతరుల మనోభవాలను దెబ్బతీయాలనే ఆ స్పర్ధ ఏంత దూరం పోతోందో...
  ఏ బ్లాగులోనైనా కామెంట్ పెడితే వెనకచేరి నానా కంగాళీ చేసేవారినేమనాలి?
  అందుకే ఈ తెనుగు బ్లాగులకి ఒక గుడ్ బై,.

  రిప్లయితొలగించండి
 6. రాజారావు గారు సమాధానం ఇచ్చారు. అదిక్కడ ప్రచురించాను కూడా.

  వారు "నా పోస్టును మొత్తంగానూ , యథాతథంగానూ తమ పోష్టులో వేశారు." అని ఆక్షేపిస్తున్నది నా జూలై 18 నాటి శ్యామలీయంపై శ్రీమాన్ లక్కాకుల వేంకట రాజారావుగారి విసుర్లు అన్న టపాను గురించి. "ఘను లక్కట నా పలు పద్య మాలికల్ వ్రాతలు తస్కరించి తమ బ్లాగున వేసిరి" అన్నారు కాని వారు ప్రస్తావిస్తున్నది ఈ ఒక్క టపాను గురించి మాత్రమే.

  నేనేమీ వారి పద్యాలను నావీ‌ అని ప్రకటించుకోలేదే? మరి ఘను లక్కట నా పలు పద్య మాలికల్ వ్రాతలు తస్కరించి తమ బ్లాగున వేసిరి అని ఆక్షేపించితే అట్లా దురర్థం రావటం లేదా.
  వారి పద్యాలను వారివి అనే ప్రస్తావించటం‌ జరిగింది కదా ఆ నా టపాలో? దాన్ని తస్కరణ అనటం ఏమిటీ? వారి పద్యాలైనా వ్యాఖ్యలైనా వాటి మూలస్థానాలకు లింకులనూ ఇచ్చానే? వారు నామీద పరంపరగా చేస్తున్న విసుర్లను ఎత్తిచూపటానికి వారిపద్యాలను ఉటకించవలసి వచ్చింది. అందులో ఏ విధమైన అతిక్రమణమూ‌ లేదే?

  'ఘను'లని నేనెవ్వరినీ అనలేదే పేరు బెట్టి అని ఇక్కడ తన వ్యాఖ్యలో ముక్తాయింపు దయచేసారు రాజారావు గారు.ఈ ఘునుడు అని కొమ్ములు తగిలించి మరీ పదేపదే ఎవర్నో జనరల్ గా ప్రస్తావిస్తున్నాననీ వారు అంటున్నారు.ఘను లక్కట నా పలు పద్య మాలికల్ వ్రాతలు తస్కరించి తమ బ్లాగున వేసిరి అన్నప్పుడు ఎవర్నండీ అన్నారు? పేరు నేరుగా చెప్పకపోయినా స్పష్టంగా అర్థమై పోవటం‌లేదా ఆ ప్రయోగం నన్ను గురించే అని?

  నేను మీ వ్యాఖ్యలను ప్రకటించనని చెప్పి ఉంటే దానికి కారణం కూడా స్పష్టంగా చెప్పే ఉంటానే? మీ రన్న కారణం‌ కాదనుకుంటాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా వ్యాఖ్యలనే ప్రకటించ డానికి ఇష్టం లేని వాళ్ళు యేకంగా (కారణమేదైనప్పటికీ )నాపోష్టునే వాడుకోవడమేమిటీ? బాగుంది మీ వరస.

   తొలగించండి
  2. మీ వ్యాఖ్యలను ప్రకటించ డానికి ఇష్టం లేదని అన్నట్లు ఈ‌బ్లాగులో ఎక్కడా కనిపించటం‌ లేదండీ.
   మీ‌ టపాను ఉటంకించటానికి కారణం మీ ధోరణిపై నా విమర్శను తెలియజేయటానికే. మీ పద్యాలను చూపకుండా వాటిపై విమర్శ ఎలా వ్రాయటం? విమర్శకుడు మూలాన్ని ఉటకించటం దోషం కాదే.

   తొలగించండి
 7. రాజారావు గారూ,

  మీరు "నా ఇంటి పేరును హేళన చేస్తారా?" అని కించపడుతున్నారు. అది కేవలం ప్రమాదపతితం. కావాలని చేసింది కాదు. ఆ టపాలోనే ఆవిషయాన్ని నా దృష్టికి వచ్చిన వెంటనే (గతనెల 21న) స్పష్టీకరించాను. మీరు ఆపేరు పెట్టీ ఈ‌పేరు పెట్టీ ఎత్తిపొడుపులకు దిగితే సమాధానం చెప్పవలసి వచ్చి చెప్పాను కాని మీ గురించి అనుచితమైన మాటలెప్పుడూ అనలేదు. ఆమాటకు వస్తే ఎవరి గురించీ అనలేదు. మిమ్మల్ని హేళన ఎందుకు చేస్తాను? నిజానికి మీ‌పద్యాల్లో జనరల్ అంటూనే కావలసినంత హేళన కుప్పించారని నా అభిప్రాయం. చివరకు మీరు ఏకవచన ప్రయోగంలోనికి దిగి దానికి ఒక కుంటిసాకు కూడా చెప్పారు.

  అలాగే, "నా పద్యాలలో ఒకటో అరో జన వ్యవహారము లోని పదాలుండడం నా కభిమతం. వారు దీనిని నిరసించి, తమ బ్లాగులో నా వ్యాఖ్యలు ప్రకటించనన్నారు." అన్నారు.

  కాని అలా మీ వ్యాఖ్యలను ప్రచురించనని అన్నట్లు శ్యామలీయంలో ఎక్కడా కనుపించటం‌ లేదు. సవ్యమైన వ్యాఖ్యలకు ఎప్పుడు స్వాగతమే. ఐతే ఆ నమ్మకాన్ని కలిగించటం వ్యాఖ్యాతల ధోరణిపైన, వ్యాఖ్యల ధోరణి పైన వాటిలోని భావజాలం పైన ఉంటుంది తప్పకుండా. (వత్సరారంభంలో నేను జిలేబీగారికి దేవిడీమన్నా చెప్పటం సకారణమే - ఆకారణాలు ఇప్పుడు చర్చనీయాలు కావు.)

  మీ రీనాడు చేసిన వ్యాఖ్యను ప్రచురించనని అనుకున్నారో మరొక కారణమో అది వేరే చోట కూడా ప్రచురించారు. ఇలా చేయటం ఇబ్బంది కలిగిస్తుంది, నేనైనా మరొకరైనా ఒకే వ్యాఖ్య పలుచోట్ల ఉంటే అన్ని చోట్లకూ పోయి సమాధానాలు వ్రాయలేరు కదా. ఆలోచించండి దయచేసి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హేళన విషయం మీ అంతరాత్మకూ తెలుసు, ఆ రాముడికీ తెలుసు, సదరు పోష్టులో వ్యాఖ్యాతలకూ తెలుసు.
   విశేష వృత్తాలకు ముచ్చట పడి రాముడిపై వ్రాసిన
   పద్య వ్యాఖ్యల సందర్భంగా నా వ్యాఖ్యలను ప్రకటించ నన్నారు. గుర్తుంటుంది . మీబ్లాగు మీయిష్టం. అందుకే మీరు నామీద ఎన్ని అనుచిత పోష్టులు ప్రకటించినా నేను మీరలేదు.

   తొలగించండి
  2. రాజారావు గారూ,

   ఆ రోజున కూడా "మీ వ్యాఖ్యలను ప్రచురించను" అని అనలేదు కదండీ?
   ఆ నాటి నా మాటను పాఠకులు ఇక్కడ చూడవచ్చును. సంప్రదాయిక కవిత్వాన్ని ఆ పధ్దతిలో సుష్టువుగా వ్రాయండని విన్నవించాను. అద్విపర్యయంగా ప్రచురించలేను అన్నాను. నిజమే. దాని అర్థం మీ వ్యాఖ్యలను నిషేధిస్తున్నానని ప్రకటించటం కాదే?

   ఈ వ్యాఖ్యా-ప్రతివ్యాఖ్యాపరంపరను ఆపుదామని విజ్ఞప్తి. దయచేసి ఇక వ్రాయకండి.

   తొలగించండి
 8. రాజారావు గారూ,

  మీరూ‌ నేనూ అభిప్రాయాలను పంచుకోవటం జరిగింది. ఇంక ఈ విషయంలో మనమధ్య చర్చ కొనసాగవలసినది ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఈ టపాపైన కొనసాగింపు వ్యాఖ్యలు వ్రాయకండి. అవి ప్రచిరించి, మళ్ళా నేను సమాధానాలు చెబుతూ, మరలా మీరు మరొకసారి ... ఇలా రోజుల తరబడి చర్చించవలసినది ఏమీ లేదు. ఆ చర్చవలన ప్రయోజనమూ ఉండదు.

  నేనూ ఇంకా వివరించవలసినది కూడా ఏమీ‌ లేదు. అపార్థాల వలన ప్రయోజనాలు లేవు కాబట్టి ఇద్దరమూ శాంతించటమే మేలు.

  రిప్లయితొలగించండి
 9. మిత్రులు శ్యామలరావుగారు,
  ఉ.బో.స అనుకోకపోతే ఒక సలహా! ఇంతతో బ్లాగులనుంచి విరమించండి.
  చెప్పడమే నాధర్మం.......

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిత్రులు శర్మగారు,

   నా సాహిత్యవాసంగాన్ని బ్లాగులద్వారా కొనసాగిస్తున్నాను. ప్రస్తుతానికి ఇదే ఆధారం.

   సాహిత్యం కాబట్టి ఈ‌ బ్లాగును ఎక్కువ మంది ఎలాగూ చదవరు. ఇబ్బంది లేదు.

   సాహిత్యకారుల పైనా వారి సాహిత్యం పైనా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి.కొన్ని నవ్వు పుట్టించే మాటలుంటాయి. కొన్ని నొవ్వు కలిగించే మాటలుంటాయి. కొన్ని బాగా బాధ కలిగిస్తాయి. కొన్ని అంతులేని నిర్వేదమూ‌ కలిగిస్తాయి. బయటి ప్రపంచంలో ఎంత మంచి ఉందో ఇక్కడా అంత ఉంది. బయటి ప్రపంచంలో ఎంత కుళ్ళు ఉందో ఇక్కడ అంతకన్నా ఎక్కువే ఉంది.

   కొన్ని స్పర్థలు సాహిత్యకారుల వలన రావటమూ, కొన్ని స్పర్థలు సాహిత్యకారుల‌ం‌ అనుకొనే వారి వలన రేగటమూ చూస్తూనే ఉంటాము.

   విశ్వనాథ సత్యనారాయణ గారంతటి వారు కొత్త సత్యనారాయణ చౌదరి గారి నుండి పలు విమర్శలు ఎదుర్కున్నారు. చౌదరిగారు విశ్వనాథను తప్పులు పడుతూ‌ పుస్తకాలే వ్రాసారు! కాని చిరస్థాయిగా నిలచింది విశ్వనాథ వారి పేరా? చౌదరి గారి పేరా?

   అన్నట్లు వీధిలో ఒకరికొకరు ఎదురైతేనే పోట్లాడుకొనే సాహిత్యకారులూ ఉండేవారు.

   బ్లాగులనుండి నేను విరమించవలసిన రోజు కూడా వస్తుంది. తప్పకుండా. ముందుగా అసంపూర్ణంగా ఉన్నవి పూర్తిచేయాలి - అదొక బాధ్యత ఉన్నది. ఈలోగా ప్రత్యామ్నాయ వేదిక గురించి అలోచిస్తాను. సీరియస్ గానే ఆలోచిస్తాను. ఈ‌ వ్యవహారం ఎంత త్వరగా కుదిరితే అంత మంచిది. అంత త్వరగా బ్లాగుల నుండి సెలవు పుచ్చుకుంటాను.

   ఇక్కడికి నేను భళిభళీల కోసం రాలేదన్నది ఎంత నిజమే మాటలు పడటానికి రాలేదన్నదీ అంత నిజం.

   ఇప్పటికే పలుమంది తెలుగుబ్లాగు ప్రపంచం నుండి సెలవు పుచ్చుకున్నారు. వారిలో అనేకులు ఈ ప్రపంచంలోని నిరంతరరణగొణధ్వనుల మధ్య బ్రతకటానికి చిరాకు పుట్టి మానివేసినారే అనుకుంటున్నాను.

   శుభం భూయాత్.

   తొలగించండి
  2. మిత్రులు మన్నించాలి, బాధ కలిగి నా మనసులో మాట చెప్పేసేను. బ్లాగులనుంచి తప్పుకుని నేను సుఖపడ్డాను. అందుకే మీకలా చెప్పేను. మీ మనసు గాయపడితే మన్నించండి.

   తొలగించండి
  3. మిత్రులు శర్మగారు,

   మీ రిచ్చిన సలహా సరైనదే. అందుకే ఎప్పటిలాగే, మీ సలహా ప్రకారమే నడచుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను బ్లాగుల్లోనుండి తప్పుకోవటమే ఖాయం. నాకు కూడా సుఖపడాలని ఉండదా చెప్పండి.

   కాని ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకొనే వరకూ ఈ బ్లాగుల్లో‌ ఉండవలసి వస్తున్నది. అంతకన్న మరేమీ లేదు. ఐతే అసిధారావ్రతం లాగా నిత్యం చాలా జాగరూకతతో మెలగక తప్పదు. ఈ వ్యవధానంలో అసంపూర్తిగా ఉన్నవాటిని ముగించటం పైన సమయం దాదాపు పూర్తిగా వెచ్చిస్తాను.

   ఇక బహుశః ఇతర బ్లాగులను చూడటానికి నాకు దొరికే కొద్ది సమయంలో ఏమీ కేటాయించలేను. అందుచేత నా మార్కు వ్యాఖ్యలూ ఉండవు. (నిజానికి ఈ‌సాయంత్రం భండారువారి బ్లాగులో అభినందనలు తెలుపుదామనుకున్నాను. కాని వ్యాఖ్య అనేది వ్రాయటం పైన మనసే పోవటం‌ లేదు. వారితో ఫోనులో‌ మాట్లాడుతాను వీలు చూసుకొని). ఈ‌ బ్లాగులో కూడా యథాప్రకారం ఉచితవ్యాఖ్యలకు ఎప్పటిలాగే అవకాశం ఉంటుంది. వ్యర్థచర్చలకు ఎప్పటిలాగే అవకాశం ఉండదు.

   మరొక బ్లాగరును గెంటివేసామని పండగచేసుకునే వాళ్ళు కొద్ది కాలం వేచి ఉంటే సరిపోతుంది.

   తొలగించండి
 10. శర్మ గారి లాగా మీరు కూడా మీ ఈ బ్లాగుని ప్రైవేట్ బ్లాగుగా మారిస్తే పోలా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మగారు తన బ్లాగును ప్రైవేట్ బ్లాగుగా మార్చితే ఆయన్ను గురిచేసుకొని జరిగిన అల్లరి మీకు తెలియదా? ఆ అల్లరిపెట్టే వారిని ఆకాశానికి ఎత్తివేస్తూ పొగడ్తలు కురవటం మీకు తెలియదా చెప్పండి?

   ప్రైవేట్ బ్లాగుగా మార్చి ఏమీ లాభం ఉండదండీ. నా సాహిత్యకృషికి తగిన వేదికకోసం ప్రత్యామ్నాయం అన్వేషించుకొనక తప్పదు.

   ఈ బ్లాగులోకం ఒక చక్కని సాహిత్యవేదిక కాగలదని భ్రమపడ్డాను. చివరకు ఇది చేపలబజారులాగా మారి ఇక్కడ ఉండటం అప్రతిష్ట అన్న పరిస్థితి వచ్చేస్తున్నది. చాలా నిరాశ కలుగుతోంది.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.