పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను పొలసి యారగించే పొద్దాయ నిపుడు | |
వెన్నలారగించఁబోయి వీదులలోఁ దిరిగేనో యెన్నరాని యమునలో యీఁదులాడీనో సన్నల సాందీపనితో చదువఁగఁ బోయి నాఁడో చిన్నవాఁ డాఁకలి గొనె చెలులాల యిపుడు |
॥పిలువరే॥ |
మగువల కాఁగిళ్ళ మఱచి నిద్దరించీనో సొగిసి యావులఁ గాచే చోట నున్నాఁడో యెగువ నుట్లకెక్కి యింతులకుఁ జిక్కినాఁడో సగము వేఁడి కూరలు చల్లనాయ నిపుడు |
॥పిలువరే॥ |
చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో ఇందునే దేవరవలె నింటనున్నాఁడో అందపు శ్రీవేంకటేశుఁ డాడి వచ్చె నిదె వీఁడె విందులఁ మాపొత్తుకు రా వేళాయె నిపుడు |
॥పిలువరే॥ |
(దేవగాంధారి రాగంలో అన్నమాచార్య సంకీర్తనం 1632వ రేకు)
పాట భావానికి వ్యాఖ్యానం.
భోజనాలసమయం దాటిపోవస్తోంది.
కన్నయ్య జాడ లేదు.
యశోదమ్మకు ఒకటే ఆదుర్దా.
చుట్టుపక్కల తెలిసినవాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాడా అని ఆరాతీసింది.
అబ్బాయి గారి జాడలేదు.
ఆవిడ ఇల్లిల్లూ గాలిస్తోంది గాభరాగా.
ఆవిడ కంగారు చూసి గోపమ్మలంతా పోగయ్యారు ఆవిడ చుట్టూ.
యశోదమ్మ గోపమ్మలతో ఇలా చెబుతోంది.
ఓ గోపమ్మల్లారా మీరు కూడా వెదకండి.
ఎన్ని చోట్లా వీలైతే అన్ని చోట్లా గాలించండి.
పేరు పెట్టి పిలిచి ఎక్కడున్నాడో వెదికి పట్టుకోండి.
కృష్ణుడికి వచ్చి భోజనం చేసే వేళయ్యింది.
దాటిపోతోంది కూడాను.
గోపమ్మల్లారా మీరంతా టక్కరి వాళ్ళు.
పిల్లవాడికి వెన్నంటే వల్లమాలిన ప్రీతి.
ఏం? కాస్త వెన్న వాడి చేతిలో పెడితే మీ పాడి తరిగిపోతుందా?
పైగా వచ్చి చాడీలు చెబుతారు కూడాను అస్తమానూ..
పిల్లాడు వెన్నకోసం ఇల్లిల్లూ తిరుగుతున్నాడేమో.
మీరేమో వాడికి అందకుండా వెన్నంతా దాచేసారా?
అది ఎక్కడన్నా దొరక్కపోతుందా అన్న ఆశతో తిరుగుతున్నాడేమో.
ఇప్పుడే వీధుల్లో తిరుగుతున్నాడో ఏమో.
నా పిచ్చి కాని మీరంతా ఇప్పుడే కదా మీ ఇళ్ళల్లోంచే వచ్చారు?
మీ కెవ్వరికీ వాడు కనిపించనే లేదంటున్నారు కూడా.
ఐతే మన కృష్ణుడు పోయి యమునలో జలకాలాడుతున్నాడేమో.
వాడికి నీళ్ళల్లో ఆడటం అంటే భలే హుషారు కదా.
మీరెవరన్నా వాడిని ఏటిగట్టు మీద చూసారా?
అక్కడే ఎక్కడో ఉన్నాడేమో.
ఆ చెట్టు ఎక్కనూ నీళ్ళల్లో దూకనూ.
ఈ గట్టు ఎక్కనూ నీళ్ళల్లో దూకనూ.
కాస్త మీరు పోయి చూసి రండమ్మా.
అక్కడా కాకపోతే మా కన్నయ్యకి చదువు అంటే భలే గురి కదా.
ఎప్పుడూ గురువుల దగ్గిర నేర్చిన పాఠాల్ని ఏ చెట్టుకొమ్మ మీదో కూర్చుని బిగ్గరగా వల్లె వేస్తుంటాడు.
ఒకవేళ వాడు గురువుగారు సాందీపని ఇంట్లో లేడు కదా?
ఎక్కడున్నాడో ఏమో వాడికి ఆకలి వేళ ఐందే. ఎలా?
మీ కూతుళ్ళు చెల్లెళ్ళూ ఒక్కక్షణం కూడా మా వాణ్ణి నేలమీద నిలబడ నీయరు కదా?
మీ పిచ్చి ప్రేమలు బంగారం కానూ!
మీ పెరళ్ళల్లో ఎక్కడో ఏపిల్లో మా వాణ్ణి ఒళ్ళో కూర్చో బెట్టుకొని కబుర్లూ చెబుతూ ఆడిస్తోందేమో.
ఐనా ఇదేం చోద్యం అమ్మా, చిన్న పిల్లాడే, వాడికి ఆకలి వేళ అని ఎవరికీ తోచదా?
ఎప్పుడూ ఆటలూ కబుర్లేనా? అసలు వాడిని నా దగ్గరకే రానిచ్చేటట్లే లేరే!
వీడొకడు.
నిత్యం ఆవులవెనకా ఆవుదూడల వెనకా చేరి ఆడుతూ ఉంటాడు.
ఆ దూడలతో సమానంగా చెంగుచెంగున ఎగురుతూ ఉంటాడు.
వీడేమో ఆ ఆవుల గంగడోళ్ళు నిమరటమూ అవేమో ప్రేమగా వీణ్ణి నాకుతూ ఉండటమూ.
వీడిని నా స్పర్శకన్నా ఆవుల స్పర్శ అన్నదే ఎక్కువై పోయింది సుమా.
మా కొట్టాంలో ఐతే లేడు కాని మనూరి నిండా ఆవులే కదా.
వేటితో ఎక్కడ ఆడుతున్నాడో ఆదమరచి.
ఐనా ఆవులకి వాటి ఆకలే కాని పిల్లాడి ఆకలి తెలుస్తుందా ఏమిటి?
వీడికా ఆవులదగ్గ రుంటే తిండీ నీళ్ళూ అక్కరేదాయిరి.
కాస్త వెదికి చూడండమ్మా.
అన్నట్లు మర్చే పోయాను.
మీ వాళ్ళెవరన్నా మా కన్నయ్యని కట్టెయ్య లేదుకదా?
ఎందుక్కట్టేస్తాం అంటారా?
ఏమో ఎవరింట్లో ఎవరు వీణ్ణి పట్టుకుందాం అని కాపలా కాసుక్కూర్చున్నారో.
ఏ తల్లి పిల్లని కాపలా పెట్టిందో
ఏ అత్త కోడల్ని కాపలా పెట్టిందో.
ఏ మహా తల్లి స్వయంగా కాపలా కూర్చుందో.
ఆలాంటి దేమన్నా ఐతే కాస్త దయచేసి మావాణ్ణి మీయిళ్ళల్లో వెదకి చూడండమ్మా!
వీడికి అన్నం వేళ దాటిపోతోందీ.
వీడి కిష్టమని చేసిన కూరలూనారలూ అన్నీ చప్పగా చల్లారి పోతున్నాయి.
పైగా చల్లారినవి పిల్లాడికి ఎలాపెడతామూ?
ఐనా ఏమాత్రం చల్లగా అనిపించినా మళ్ళా వాడే నానా రభసా చేస్తాడే!
వీణ్ణి కాస్త వెదికి తెండమ్మా.
మొన్నవ్వరో వీడికోసం ఇన్ని నెమలిపించాలు తెచ్చి పడేసారు చావట్లో.
వీడి కింక పండగే.
ఏ పెరట్లోనో ఒక్కో నెమలి ఈకా నెత్తిమీద పాగాలో సింగారించుకుంటూ మురుసుకుంటున్నాడేమో.
ఐనా మా యింటి పెరట్లో ఇందాకనే చూసానే?
మీలో ఎవరింటి పెరట్లో ఐనా ఉన్నాడేమో కాస్త చూడండి.
ఏముందీ, ఎక్కడో ఏ బావిగట్టునో నీళ్ల బానల్లోనికి తొంగిచూసుకుంటూ నెమలి ఈకల అందాలు మురుస్తూ ఉంటాడు.
మీ రేమో పొద్దస్తమానం వాడి అందాన్ని పొగుడుతూ ఉంటారు.
దాంతో ఆ ఆందాలయ్యకి మరింత అందం పిచ్చి పట్టుకుంది.
నా మతి మండా ఇంతసేపూ వీధిలో నుంచుని మిమ్మల్ని బతిమాలుతున్నానా?
ఈలోపల మా కృష్ణుడు కాని ఏ పెరటి దారిలోనో ఇంట్లోకి రాలేదు కదా?
అసలే ఆకలితో నకనకలాడుతూ ఉంటాడు.
వెంటనే పోయి వడ్డించకపోతే అలిగి మూల కూర్చుంటాడు.
చూడండి చూడండి.
లోపల్నించి ఏదో చప్పుడు వినిపించటం లేదూ.
వచ్చాడమ్మా వచ్చాడు.
వంటింట్లో దూరి గిన్నెలు విసిరేస్తున్నట్లున్నాడు.
కన్నయ్యకు కోపం వచ్చేస్తున్నట్లుంది.
పాపం మా కృష్ణుడు ఊరంతా బలాదూరు తిరిగితిరిగి బాగా ఆడిఆడి విచ్చేసినట్లున్నాడు.
వెంటనే లోపలికి వెళ్ళకపోతే దొరగారికి తామసం వచ్చేస్తుంది.
ఉంటానమ్మా.
అందగాడు దయచేసాడు కదా స్వగృహానికీ.
మా వాడికి విందులు చేయాలి తక్షణమేను.
లేకపోతే తెలుసుగా వాడి సంగతి.
అదిగో వింటున్నారా?
వస్తున్నావా లేదా ఏమిటా జనంతో పోచికోలు కబుర్లూ అని అరుస్తున్నాడు.
వస్తానమ్మా.
మీరంతా ఇంక పోయిరండి.
Nice....
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినాకు చాలా ఇష్టమైనది ఈ కీర్తన. బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన విధానం అన్నమయ్య చెవుతున్నట్లే ఉంటుంది. మీరు నాగుల చవితి నాడు కూడా మంచి పాటను గుర్తు చేసారు. ధన్యవాదాలు _/\_
అవునండీ, బాలకృష్ణప్రసాద్ గారు ధన్యులు. వారు అన్నమయ్యకీర్తనలను తాదాత్మ్యంతో ఆలపించటం వారి సుకృతం ఐతే ఆ ఆలాపనలను వినటం మనసుకృతం.
తొలగించండిఅవునండి నాగులచవితినాటి టపాలోని పాట బసవరాజు అప్పారావుగారి ప్రముఖ గీతం. ఐతే కాలమ్రమేణా మన మీద విరుచుకొని పడిన కొంత తక్కువస్థాయి సినీగీతాలవెల్లువ పుణ్యమా అని చివరకు పాట అంటే సినిమా పాట అనే అర్థంలోనికి మనం దిగజారాము. ఆ నాగులచవితిపాట కన్యాశుల్కం సినిమాలోనిది కాని ఈ రోజున పాతవి తెలుపునలుపు సినిమాలంటే యువతరం చూడకుండానే బోర్ అనేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అది అందుబాటులో లేదు. అదే కాదు పాతసినిమాల్లోవి అన్న కారణంతో అనేక ఆణిముత్యాల్లాంటీ పాటలను ఈ తరం కోల్పోతున్నదేమో నండి.