4, జూన్ 2015, గురువారం

అచ్చుకు నోచని నా వ్యాఖ్య

మున్నుడి:   నిన్న నేను చేసిన వ్యాఖ్య ఒకటి అచ్చు కెక్క లేదు. పోనీయండి, నేనే అచ్చేసికుంటున్నాను!

>ఇది విన్నాక తెలుగువాడిగా పుట్టడం ఓ అదృష్టం అనిపించింది

వ. మంచిది.

మ. మనుజుల్ గీచిన గీత కావలను సన్మానంబుతో నుండుచో
మనముల్ సంతస మేర్పడంగ నెగురన్ మా గొప్ప నదృష్టమే
యన వచ్చుం గద చూడగా నదియు నూహాతీతమై యొప్పు నా
ఘన కాల ప్రతిపాద్య సౌఖ్యమగుచున్ కన్పించుచుండెం గదా

మ. మనుజుల్ గీచిన గీత కీవలగ నే మాత్రంపు తేజంబు లే
కను దుఃఖంబున నీరసించి వగవంగన్ వచ్చు నా దైన్య మే
మని వర్ణింపగలారమయ్య యది యూహాతీతమై యొప్పు నా
ఘన కాల ప్రతిపాద్య కష్టమగుచున్ కన్పించుచుండెం గదా

కం. ఆవల నదృష్ట మున్నది
ఈవల ఘన దుఃఖ మున్న దీ రెండును కా
లావధి చే నేర్పడినవి
యే వేళకు నెట్లు మారు నెవ్వరి కెఱుకౌ.

వ. కాబట్టి ప్రాజ్ఞులు రెంటిండి యందును సమబుధ్ధి కలిగియుందురు.

ఈ వ్యాఖ్య తిరస్కరణకు గురైనదో లేదా సదరు బ్లాగువారు ఇంకా పరిశీలించలేదో తెలియదు. ఈ పద్యాలు కాసినీ జనం చదివినంతమాత్రాన కొంప మునిగేదేమీ లేదనిపించి ప్రచురిస్తున్నాను.

12 కామెంట్‌లు:

  1. మాస్టారూ,ఇంకా అమీరు అక్కద్ ఆనందం ఇక్కద విషాదం అనే మూడులో ఉన్నారేమిటీ!
    ఇక్కడ ఇంకా హుషారుగా ఉండాలి గానీ - మనకేం తక్కువ,చరిత్ర లేదా సంస్కృతి లేదా?

    రిప్లయితొలగించండి

  2. ఇదియున్నూ సర్వం గుండు మాయ యేనా ??

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా అపార్ట్‍మెంట్ కాంప్లెక్స్ వాసుల్లో ఒక గొడవ. కొందరు కొందరు ఇస్త్రీచేసే మహానుభావులు బట్టలు మాయం చేస్తున్నారో అని.

      ఇక్కడ బ్లాగ్లోకంలో నా గొడవ. కొన్ని కొన్ని బ్లాగులవాళ్ళు (కొండొకచో అన్యాయంగా) నా వ్యాఖ్యలు మాయం చేస్తున్నారో అని.

      నిన్న చాకిరేవు బ్లాగువారు నా వ్యాఖ్యను బాగా ఉతికేసారో ఏమో, ఏ ఏట్లో పారేసారో యేమో మరి. అది కాస్తా మాయం అయ్యింది. ఓ పన్నెండు గంటలపాటు చూసి నేనే ఆ వ్యాఖ్యను ఇలా అచ్చేసుకున్నా నన్న మాట.

      తొలగించండి
    2. ఆ చాకిరేవు వున్నదే వాళ్లని వుతకటానికి!
      మీరేమో అంతలా ఉతకొద్దూ అంటే యెష్లా?

      తొలగించండి
    3. ఉతకొద్దూ అనటానికి నేనెవర్ని లెండి.
      పద్యాలు కనిపించేసరికి ఇదేదో తెలుగు కాదేమో అని అనుమానపడి స్పామ్ వలే పరిగణించి త్రోసివేసారేమో. ఏదో ఒకటి. నాకేమీ ఇబ్బంది లేదు.

      ఆ మధ్య మరొక బ్లాగువారికి సింహం గాండ్రించదండీ గర్జిస్తుంది కానీ, గాండ్రించేది పులీ, పిల్లలకోసం వ్రాసేటప్పుడు కొంచెం గమనికగా ఉండండీ అని ఒక వ్యాఖ్య పెడితే పీకి అవతల పారేసారు వెంటనే. నా అల్పత్వానికి నేనే సిగ్గిల్లి ఊరకున్నాను - ఈ రోజుల్లో పులయ్యేది సింహమయ్యేది మనం చెప్పినట్లే అరవాలేమో మరి! నాకు తెలియక పోతే అది నా తప్పేగా!!

      తొలగించండి
    4. ఏం అనుకోకండి! ఈ మధ్య నాకూ పట్టుకుందీ దురద! ఒక చోట పండితరాయలకి ముడిబియ్యం కట్టి ఇచ్చింది ప్రయాణానికి అని రాశారు. ఇదీ పిల్లలకోసం రాసిందే. బాబూ అవి ముడి బియ్యం కాదు వాటిని అటుకులు అంటారు అని చెప్పా, చిత్రం ఆ కామెంట్ ఈ రోజుకి కనపడలేదు. చెప్పడం మానేస్తే పోలా! నేనదే నిర్ణయం తీసుకున్నా, ఎవరెలాపోతే పోనివ్వండి, మనతోనేలేదు కదా! సులభా పురుషా రాజన్.....ఇటువంటివి జాల పత్రికలలో వచ్చేస్తున్నాయి..

      తొలగించండి
    5. ఒకరు మాకు చెప్ప నేపాటివారని తలచేవారి సంఖ్య కాలప్రభావం వలన పెరుగుతోంది. నేటికాలపు విద్య ఏమి నేర్పుతోందో తెలియదు కాని వినయం మాత్రం నేర్పటం లేదన్నది స్పష్టం. అందుచేత ఇలాంటి తమాషాలు కనబడుతున్నాయి. అనేకులు బలరామకృష్ణుల గురువుగారు సందీపుడు అని వ్రాస్తున్నారు. సందీపుడు కాదూ సాందీపని , అంటే సందీపనుడు అనే ఋషి కుమారుడు సాందీపని అని అర్థం చెప్పి ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటివి మనం చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం అనిపిస్తోంది.

      తొలగించండి
    6. మెత్తగా చెప్తే అసలు వినరు,పట్టించుకోరు - మారరు!
      గట్టిగా చెప్తే పాతకాల మంటూ యెదురు తిరుగుతారు?

      తొలగించండి
    7. మీ కామెంటు ఇప్పుడక్కడ కనిపిస్తుందండోయ్,కాస్త చూదండి!

      తొలగించండి
    8. ఎంతో ఆలస్యంగా ఐనా, వారు ప్రచురించారని సంతోషం.

      తొలగించండి
  3. >....వినరు,పట్టించుకోరు - మారరు!.....పాతకాల మంటూ....
    కం. వినదగు నెవ్వరు చెప్పిన
    వినువారికి చెప్పదగును విననొల్లని వా
    రిని గనియుం గన నట్లుం
    డిన మన మర్యాద నిలచు డిగ్గక మహిలో

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.