7, జూన్ 2015, ఆదివారం

లలితానామావళిలో కొన్ని నామాలకు వివరణలు

శ్రీ కల్లూరి భాస్కరంగారు బ్లాగులోకానికి పరిచితులే. వారు ఒక వ్యాఖ్య చేసారు నిన్నను. దానికి సమాధానం ఆ వ్యాఖ్య క్రిందే ఇవ్వటానికి వీలుపడక ప్రత్యేకంగా టపాగా వ్రాస్తున్నాను.

ముందుగా భాస్కరంగారి వ్యాఖ్యః

శ్యామలరావు గారూ....ఆలస్యంగా చూశాను. మంచి ఉపయుక్తమైన పని చేశారు. కొన్ని విరుపుల దగ్గర సందేహాలు కలిగాయి.
1.(66) సంపత్కరీ సమారూఢసింధూరవ్రజాసేవితా...ఇక్కడ సంపత్కరీ దగ్గర విరుపు ఉండక్కర్లేదా? లేకుండా అర్థం ఏమిటి?
2. (524) హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా...ఇక్కడ హంసవతీ దగ్గర విరుపు ఉండాలా? లేకుండా అర్థం ఏమిటి?
3. (813) 'నిత్యతృప్తా' నా? 'అనిత్యతృప్తా'నా? అనిత్యతృప్తా కు అర్థం ఏమని చెబుతాం?
4. (821) ప్రచండ/ఆజ్ఞా అని విడదీశారు. ప్రచండాజ్ఞా కాదా?
5. (923) కౌళినీకేవలా --అన్నారు. కౌళినీ/కేవలా --కాదా?

సమాధానం.

ముందుగా క్లుప్తంగా నేను వారికి ఇచ్చిన జవాబు, 'మీరు ఉదహరించిన పై నామాలు సరిగానే విభజించి చూపటం జరిగింది' అని.  ఇప్పుడు మరింత వివరంగా వ్రాస్తున్నాను.

మొట్టమొదట అమ్మ యొక్క సహస్రనామస్తోత్రం ఆవిర్భావాన్ని గురించి ఒక సారి మననం చేసుకోవటం సముచితంగా ఉంటుంది.

శ్రీలలితాపరాభట్టారికాదేవి యొక్క సహస్రనామస్తోత్రాన్ని చదివినవారికి అందునా పారాయణం చేసేవారికి తప్పక స్తోత్రం చివర ఉండే ఈ క్రింది వచనం పరిచితమే.

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహహగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితారహస్యనామస్సాహస్రస్తోత్రకథనమ్‍ నామ ద్వితీయోధ్యాయః

శ్రీలలితాపరాభట్టారికాదేవి వశిన్యాది వాగ్దేవతలను పిలిచి ఒకప్పుడు ఇలా సెలవిచ్చింది. మీరు నా ప్రసాదం వల్ల సద్వాగ్విభూతిని పొందారు. మరి నా ఇతర భక్తులకు కూడా అటువంటి వాగ్విభూతి కలిగేందుకు మీరు ఉపయోగపడాలి కదా. శ్రీచక్రరహస్యాలు తెలిసినవారూ, నామపారాయణం పట్ల ప్రీతికలవారూ మీరు. అందుచేత మీరు నా స్తోత్రం చేయటానికి అనుజ్ఞ ఇస్తున్నాను.

కురుధ్వ మండితం స్తోత్రం మమ నామ సహస్రకైః
యేన భక్తైః స్తుతా యా మే సద్యః ప్రీతిః పరా భవేత్

రహస్యార్థములతో సహా మా సహస్రనామస్తోత్రం మీరు నిర్మించండి. ఏది భక్తులు పఠించినంతనే మాకు ప్రీతి కలుగుతుందో అలాంటి స్తోత్రాన్ని మీరు రచించండి.

అమ్మ ఆజ్ఞమేరకు వశిన్యాది దేవతలు తల్లిస్తోత్రాన్ని రచించి అమ్మ  సమస్తదేవతలూ త్రిమూర్తులూ తన్ను సేవించి ఉండగా కొలువుతీరి ఉన్న నిండు సభలో దానిని వినపించారు.

అలా శ్రీలలితాపరాభటారికాదేవి అమ్మవారి సహస్రనామస్తోత్రం అమ్మ సంకల్పంతో వశిన్యాదులు ఋషులుగా ప్రపంచానికి వెల్లడి చేయబడింది.

మరి ఆ స్తోత్రం అంత సులభ గ్రాహ్యం ఏమీ కాదు. అదెందుకో కూడా అలోచిద్దాం.

ఇప్పుడు మనం ఒక్క సంగతి గమనిస్తాం. సహస్రనామస్తోత్రాలు అనేకం ఉన్నాయి. గణపత్యాదిగా అందరు ప్రముఖ దేవీదేవతలకూ సహస్రనామస్తోత్రాలున్నాయి. కాని ఒక్క  శ్రీలలితాపరాభట్టారికాదేవి అమ్మ సహస్రనామస్తోత్రానికి మాత్రమే రహస్యసహస్రనామస్తోత్రం అని పేరుంది.

ద్వీతీయోధ్యాయం ఈ స్తోత్రం ఐతే తృతీయోధ్యాం ప్రారంభ శ్లోకంమే

రహస్యానాం రహస్యంచ లలితాప్రీతిదాయకమ్‍

అని నిష్కర్ష చేస్తుంది!  ఆ అధ్యాయం చివరన హయగ్రీవులవారు అగస్త్యునితో 'నా విద్యావేదినే బ్రూయాత్ నా భక్తాయ కదాచన'. యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్య మిదం మునే,  పశుతుల్యాతు న బ్రూయా జ్జనేషు స్తోత్రముత్తమమ్‍' అని హెచ్చరిక చేస్తారు. శ్రీదేవి భక్తులు కాని వారికీ, బాలాది మంత్రోపదేశం ఏదీ లేని వారికి ఈ స్తోత్రం ఉపదేశం చేయరాదని సంప్రదాయం. అందుకే ఇది రహస్యం. అంతే కాక హయగ్రీవులు 'శ్రీదేవీ పేరణా దేవ మయోక్తం కుంభసంభవ' అని అమ్మవారి ఆదేశం మేరకే నీకు ఉపదేశించాను సుమా  (నీవూ అలాగే చేయవలెను) అని స్పష్టం చేస్తారు.

ఈ స్తోత్రంలో వలెనే అనేక ఇతర స్తోత్రాదుల్లో కూడా ఇటువంటి హెచ్చరికలే ఉంటాయని అందరికీ తెలుసు. ఇలా ఉండటానికి కారణం సులభంగానే గ్రహించవచ్చును. ముక్కస్య ముక్కార్థః అన్నట్లు ఏమాటకు ఆమాటకు అర్థం అన్వేషించి కూర్చుకుంటూ శ్లోకాలకు అన్వయం గ్రహించటానికి ప్రయత్నించటం సముచితం కాదు. అలాంటి ప్రయత్నం చేసేవారు భాషపట్ల అధికారం లేని కారణంగా సులువుగా దారితప్పుతారు. రెండవది సంప్రదాయాలని కొన్ని ఉంటాయి. ఏ విషయం గురించిన శ్లోకాలను అర్థం చేసుకోవటానికి యత్నిస్తున్నామో దానికి సంబంధించిన సంప్రదాయాలను క్షుణ్ణంగా గురుపరంపర నుండి స్వీకరించిన వారికి అవి విదితమయ్యే విధానికీ అటువంటిదేమీ తెలియకుండా కేవలం పదాలకు అర్థాల సహాయంతో శ్లోకార్థనిర్మాణక్రియకు దిగిన వారికి తెలిసే విధానికీ హస్తి మశకాంతరం ఉంటుందన్నది నిర్వివాదం. మాట వరసకు జర్మన్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఒకటీ, ఇంగ్లీష్ టూ తెలుగు నిఘంటువు ఒకటి ముందు పెట్టుకొని ఒక న్యూక్ర్లియర్ ఫిజిక్స్ సబ్జెక్ట్ లో వచ్చిన సిధ్ధాంతవ్యాసాన్ని జర్మనీ నుండి తెలుగు చేయటం ఎలా ఉంటుందో ఆలోచించండి.  అది కూడా ఎన్నడూ సైన్స్ విద్యార్థి కాని ఒక జర్నలిష్ట్ ఆపని చేస్తే ఎలా ఉంటుందో యోచించండి.

మాక్స్ ముల్లర్ సంస్కృతం నేర్చుకొన్నంత మాత్రాన వేదాల్లోని ఋక్కులకు తర్జుమాలు చేసి వాటి పరువుతీసాడని అరవిందులు ఆగ్రహపడ్దారు. ఒక  ఋక్కుకు యథాతధంగా అర్థం ఐతే, 'ఇంద్రుడి రథం పోతూ ఉంటే ఆ రథాశ్వాల గిట్టల నుండి నేయి కారుతున్నదని' వస్తుందట. అలా గ్రహించి ముల్లర్ ట్రాష్ అన్నాడని మనమూ బోల్తా పడకూడదు కదా. అసలు అర్థం వివరించటానికి అరవిందులు ఆ ఋక్కు గురించి ఒక పుస్తకమే వ్రాసారని గుర్తు,

ఈ శాఖాచంక్రమణం ఎందుకంటే అతినిగూఢమైన అర్థం కల శ్లోకసంపుటిని ఎవరికితోచినట్లు వారు దురుపయోగం చేయకుండా కట్టడి చేయటానికే ఇలాంటి నిబంధనలు అని విన్నవించటానికి.

ఈ క్రమంలో శ్రీలలితాసహస్రనామస్తోత్రానికేమి, అంతకన్నా సులభంగా కనిపించే విష్ణుసహస్రనామస్తోత్రానికేమి మహాత్ములు వివరణ ఇచ్చి లోకోధ్ధరణ చేయవలసి వచ్చింది. కాబట్టి ఈ స్తోత్రాలలోని నామాల గురించి వారి వివరణల సహాయంతో మాత్రమే మనం తెలుసుకోగలం.

గతంలో నేను వ్రాసిన నామవిభజన పట్టికకు శ్రీతుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారి లలితామోదినీ భాష్యాన్ని ప్రమాణంగా తీసుకున్నాను. తుమ్మలపల్లివారు ప్రథానంగా భాస్కరరాయలవారి సౌభాగ్యభాస్కరమూ మరికొన్ని వ్యాఖ్యలూ ఆధారంగా భాష్యరచన చేసారు. తుమ్మలవపల్లివారి భాష్యగ్రంథంతో పాటుగా నేను వావిళ్ళవారు ప్రచురించిన సింహభట్ల రామమూర్తిశాస్త్రులవారి గ్రంథాన్నీ, క్వచిత్తుగానైనా అథునికులు వడ్లమూడి వేంకటేశ్వరరావుగారి శ్రీలలితానామర్థమంజూషనూ పరిశీలించాను.

ఇప్పుడు శ్రీ కల్లూరి భాస్కరంగారి ప్రశ్నలు పరిశీలిద్దాము.

1. సంపత్కరీ సమారూఢసింధూరవ్రజాసేవితా...ఇక్కడ సంపత్కరీ దగ్గర విరుపు ఉండక్కర్లేదా? లేకుండా అర్థం
ఏమిటి?

సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా।
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా॥

అనే 25 వశ్లోకంలోనిది ఈ నామం.  ఈ శ్లోకం పూర్వార్థం అంతా 66 వ నామం ఏకసమాసం. కాబట్టి ఒకటే పదం. ఉత్తరార్థం అంతా అదేవిధంగా 67వ నామం.

అందుచేత సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా అని నామం.  సంపత్కరి అని ఒక దేవత. ఆమెను గురించి స్వతంత్ర తంత్రంలో వివరంగా ఉంది. ఆమె వైభవం ఊహాతీతం. ఆ (మంత్ర) విద్యలో మూడు వర్ణాలున్నాయి.  మంత్రాధిష్ఠాన దేవత పేరు సంపత్కరి. లలితాదేవి తన అంకుశం నుండి సంపత్కరీదేవిని సృజించింది.  త్రిపురసుందరీ దేవి గజసైన్యానికి సంపత్కరీదేవి నాయకురాలు అని లలితోపాఖ్యానంలో ఉంది. ఆ సంపత్కరీదేవి రణకోలాహలం అనే ఏనుగునెక్కి దాని వెనుక కోట్లాది గజసైన్యంతో యుధ్ధానికి వచ్చింది.  ఏనుగుల్లో మూడురకాలు  భద్రగజాలు, మంద్రగజాలు, మృగగజాలు అని వాటి లక్షణాలను బట్టి. అన్ని రకాలవీ సంపత్కరి సైన్యంలో ఉన్నాయి, ఇంత గజసైన్యంతో ఆమె లలితాదేవిని సేవిస్తోంది.

సుఖ సంపద్వికారమైన చిత్తవృత్తికి సంపత్కరి అని పేరు.

ఇది కాక ఈ నామానికి విపులమైన వేదాంతపరమైన వ్యాఖ్యానం కూడా ఉంది. సుఖసంపత్కరమైన చిత్తవ్ర్త్తికి సంపత్కరి అని పేరు. ఈ చిత్తవృత్తిని శభ్దస్పర్శాది విషయసముదాయం సేవిస్తూ ఉంటుంది. ఇదే సింధురవ్రజం.  శ్రీవద్యావిశేషంం ఐన  కాది మతం ప్రకారం శబ్దాది విషయాలు గజములు. అథిష్ఠాత్రి పరమేశ్వరి సంపత్కరి. వివరణంగా చాలా విషయాలున్నాయి. విస్తరణం అవుతుందని వివరించటం లేదు.

శ్రీచక్రంలో త్రికోణాగ్రంలో ఉన్న కామేశ్వరీ దేవికే సంపత్కరి అన్న రహస్యసంజ్ఞ కూడా ఉంది.

ఋగ్వేదీయమైన సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తులో చెప్పబడిన శ్రీ సౌభాగ్యలక్షీ కామకళా ఏకాక్షరమహామంత్రానికి సంపత్కరీ మహామంత్రం అనే సంకేతం కూడా ఉంది శ్రీవిద్యలో. ఆవిడ అధిష్ఠించిన గజమే మంత్రవర్ణస్వరూపం.

అంతేకాని ఈ మంత్రాన్ని సంపత్కరీ, సమారూఢసింధురవ్రజాసేవితా అని విఱచి చెప్పకూడదు. అప్పుడు అన్వయదోషం కూడా వస్తున్నది. సంపత్కరీ అన్నది సంబోధన. లౌకికంగా సంపదలు కలిగించేదేవి అన్న అర్థమూ మరికొన్ని పైన సంపత్కరీ దేవినీ స్మరించటం.  కాని 'సమారూఢసింధురవ్రజాసేవితా' అన్నది అన్వయం కాదు.  సమాశ్రితసింధూరవ్రజాసేవితా అన్నట్లుగా అన్వయం చేసినట్లు సమారూఢ పదంతో అన్వయం రాదు.


2.  హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా...ఇక్కడ హంసవతీ దగ్గర విరుపు ఉండాలా? లేకుండా అర్థం ఏమిటి?

 ఇది 108వ శ్లోకంలో వచ్చే 525వ నామం.

మజ్జాసంస్థా।  హంసవతీముఖ్యశక్తిసమన్వితా। 
హరిద్రాన్నైకరసికా।  హాకినీరూపధారిణీ।  

ఈ శ్లోకం  చక్రదేవలతలను వర్ణింఏ సందర్భం లోనిది..   వారు  డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ,సాకినీ, హాకినీ,యాకినీ అనే వారు. ఈ శ్లోకంలో హాకినీదేవిని గురించిన వర్ణన ఉంది. 

సౌభాగ్యభాస్కరంలో భాస్కరరాయలవారు చెప్పిన ప్రకారం,  హంసవతీముఖ్యశక్తిసమన్వితా అంటే హంసవతీ, క్షమావతీ అనే శక్తులతో కూడినది అని అర్థం. ముఖ్య అంటే ముఖమునుండి పుట్టినది అని.

వావిళ్ళవారి పుస్తకంలో హాకినీదేవి హంసవతీ మొదలైన శక్తులతో కూడి ఉన్నది అని సామాన్యార్థాన్నే చెప్పారు.

ఏకనామంగా కాకుండా హంసవతీ , ముఖ్యశక్తిసమన్వితా అని చెబితే చిక్కు వస్తుంది. అప్పుడు హాకినీదేవినే హంసవతి అని అన్వయం చేసి పిలుస్తున్నటౌతుంది. అది తప్పు.  సంప్రదాయంలో హంసవతి హాకినీదేవి కాదు ఆమె పరివార శక్తుల్లో ఒకరు. అంతే కాక , అప్పుడు 'ముఖ్యశక్తిసమన్వితా' అన్నది అన్వయం కాకుండా పోతుంది.  ముఖ్య అనేది ఒక శక్తి అనుకుంటే ముఖ్యశక్తిసంయుతా అన్నది ఒప్పుతుంది కాని ముఖ్యశక్తిసమన్వితా అని కుదరదు. సమన్వితా అన్నది ఒక బృందాన్ని చెప్పటానికి వాడాలనుకుంటేనే బాగుంటుంది.  ముఖ్యమైన శక్తులతో కూడినది అన్నది పేలవంగా ఉంది, నిర్విశేషణంగా.  ఆజ్ఞాచక్రం ముఖ్యప్రాణస్థానం అని సంజ్ఞ. ఈ ముఖ్యప్రాణశక్తులైన  షట్ ధాతుస్వరూప షడాధార కమలదళ స్వరూప పంచాశద్వర్ణాత్మిక శక్తులే హంసవతీ మొదలైన శక్తులు. వావిళ్ళవారి పుస్తకంలో హాకినీదేవి హంసవతీ మొదలైన శక్తులతో కూడి ఉన్నది అనే  చెప్పారు.

3.  'నిత్యతృప్తా' నా? 'అనిత్యతృప్తా'నా? అనిత్యతృప్తా కు అర్థం ఏమని చెబుతాం?

వేర్వు వేరు నామాలున్నాయిలా.  నిత్యతృప్తా అని 115వ శ్లోకంలో ఉన్న 566వ నామం.

నిత్యతృప్తా।  భక్తనిధిః।  నియంత్రీ।  నిఖిలేశ్వరీ। 
మైత్ర్యాదివాసనాలభ్యా।  మహాప్రళయసాక్షిణీ।  


154వ శ్లోకంలో అనిత్యతృప్తా అని 815వ నామం వస్తుంది.

మూర్తా।  అమూర్తా।  అనిత్యతృప్తా।  మునిమానసహంసికా। 
సత్యవ్రతా।  సత్యరూపా।  సర్వాంతర్యామినీ।  సతీ। 

నిత్యతృప్తా అన్న నామానికి అర్థం కేవల బ్రహ్మానందస్వరూపిణి అని. తల్లి నిత్యమైన తృప్తి కలది. పర్యాప్తకామ (పర్యాత్మ కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామం అని శ్రుతి)

అనితి + అతృప్తా = అనిత్యతృప్తా అని నిరూపణం.  న + ఇతి + అతృప్తా అని చెప్పటం వలన దీనివలన దేవి తృప్తిపడదు అని చెప్పటానికి లేదు అని అర్థం. అంటే తల్లి ఏది ఇచ్చినా తృప్తి చెందుతుంది అని. అంటే భక్తిమాత్రం చేతనే అనిత్యమైన ఉపచారాదులకు కూడా అమ్మ తృప్తి చెందుతున్నదని భావం.

నిత్యతృప్తా అన్న నామానికి పునరుక్తి రాకుండా వ్యాఖ్యాతలు అనిత్యతృప్తా అని స్వీకరించారు.

4.  ప్రచండ/ఆజ్ఞా అని విడదీశారు. ప్రచండాజ్ఞా కాదా?

కాదండి, ఇవి వేరు వేరు నామాలుగా భాష్యం. మీరన్న పధ్ధతిలో కూడ  కొందరు వ్యాఖ్యాతలు చెప్పటం ఉంది.

827వ నామం ప్రచండా.
828వ నామం ఆజ్ఞా.

 ప్రచండా అన్న నామానికి అర్థం ఇలా ఉంది.  చడి కోపనే అని ధాతువు.  భీష్మాస్వా ద్వాతః పవతే, భీషోదేతి సూర్యః అని శ్రుతి. ఉల్లంఘించటానికి వీలు లేని ప్రచండమైన ఆజ్ఞ అమ్మది అని అర్థం.   అమ్మ యొక్క దూతికలు కూడా ఆవిడ ఆజ్ఞను అమలు జరిపే విషయంలో మిక్కిలి కోపనశీలురై ఉంటారు. అటువంటిది అమ్మ అని.

ఆజ్ఞ అన్న  నామానికి వివరణ. వేదవిహితమైన ధర్మం విధి నిషేధము అనే రెండు విధాలుగా ఉంటుంది. శివపురాణంలో రుద్రుని యొక్క ఆజ్ఞాస్వరూపం దేవి అని ఉన్నది. జ్ఞః గుణకాలో గుణి సర్వవిద్యః అని శ్రుతి. సర్వగుణి సర్వవిద్యాస్వరూపం జ్ఞః కాబట్టి జ్ఞః అంటే విధి అన్న అర్థం కాబట్టి అలా గ్రహించటమూ ఉంది.

భట్టనారాయణ వైద్యనాథదీక్షితులు ప్రచండాజ్ఞా అని రెండు నామలనూ కలిపి గణించారు. అతితీక్ష్ణమైన అజ్ఞాప్రవృత్తి కలది అన్న భావంలో.

 5. కౌళినీకేవలా --అన్నారు. కౌళినీ/కేవలా --కాదా?

ఇంతకు ముందు నామాలుగా కౌలినీ, కులాంగనా, కులాంతస్థా, కులయోగినీ ఇత్యాదులు వచ్చాయి కదా. పునరుక్తిని పరిహరిస్తూ ఈ రెండు మాటలూ కలిపే వ్యాఖ్యాతలు ఏకనామంగా స్వీకరించారు.

కౌలినీ కేవలా అన్నప్పుడు ఆమె శుధ్ధకాలస్వరూపిణి అని అర్థం.

కొందరు వ్యాఖ్యాతలు విడినామాలుగా స్వీకరించి చెప్పారు. కాని 94వనామంలో కౌలినీ అని రానే వచ్చింది కదా?

4 కామెంట్‌లు:

 1. ధన్యవాదములు శ్యామల రావు గారు.

  రిప్లయితొలగించండి
 2. శ్యామలరావు గారూ, నమస్కారం. మీ బ్లాగులోకి నాకు స్వాగతం పలుకుతూ ఎంతో ఓపిక చేసుకుని నా సందేహాలకు వివరణ/ఉపోద్ఘాత పూర్వక సమాధానం ఇచ్చినందుకు ఎంతైనా కృతజ్ఞతలు.
  నా 5 సందేహాలలో మూడింటికి మీరిచ్చిన సమాధానం నా సందేహ నివృత్తికి తోడ్పడింది. 'అనిత్యతృప్తా'కు ఇచ్చిన వివరణ మాత్రం మరీ దూరాన్వయంలా కనిపించింది. 'కౌలీనికేవలా' అని ఒకే నామంగా చూపించడం పునరుక్తి పరిహరణ కన్నారు. అలాగైతే విష్ణు సహస్రనామాలలో కూడా పునరుక్తులు ఉన్నాయి కదా?
  లలితా సహస్రనామాలు కొన్నింటికి మీరిచ్చిన వివరణ చూశాను. అన్నింటికీ ఇచ్చారా? దయచేసి తెలప గలరు.
  ఇక మీ వివరణలోని రెండు అంశాల మీద నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనిపించింది. దీనిని కేవలం అభిప్రాయంగానే తీసుకోగలరు. దీనిని చర్చకు పెట్టాలన్న ఆసక్తి నాకు లేదు. మొదటిది లలితా సహస్రనామాలను రహస్యం అని ఎందుకన్నారో తెలియదు కానీ, అర్థం తెలిసిన పరిచిత పదాలు ఎదురుగా లిఖిత రూపంలో కనిపిస్తున్నపుడు, వాటిని ఆ అర్థంలో తీసుకోకూడదు, వాటికి రహస్యార్థాలు ఉన్నాయని అన్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ రహస్యార్థ నిర్ణయం ఎవరు చేస్తారు? దానికి ప్రమాణం ఏమిటి? ఎదురుగా కనిపించే పదాలను కాకుండా దానికి రహస్యార్థం ఉందని చెప్పే వారిని ఎలా ప్రమాణంగా తీసుకోవాలి? గురుపరంపర అంటారు సరే...ఒక గురువు చెప్పిన రహస్యార్థాన్ని ఇంకో గురువు కాదంటే?! రహస్యార్థం ఉందనే అనుకుందాం. ఏ భాషనైతే నామరచనకు వినియోగించుకుంటున్నారో ఆ భాషనే ఇక్కడ రహస్యార్థం ఉందని చెప్పడానికి ఎందుకు వినియోగించుకోలేదు? అందుకు అవసరమైన సంకేతాలను ఎందుకు అభివృద్ధి చేయలేదు? కావ్యభాషలో ఒకే మాటలో రెండర్థాలను నిక్షిప్తం చేసే సంప్రదాయం మనకు ఉంది. అయితే అది రహస్యం కాదు. మనకు తెలిసిన పదాలనుంచే ఆ రెండర్థాలను తీసుకుంటూ ఉంటాం. లలితా సహస్ర నామాలలో ఆ సౌలభ్యం ఎందుకు లేదు?

  రెండోది..."మాట వరసకు జర్మన్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఒకటీ, ఇంగ్లీష్ టూ తెలుగు నిఘంటువు ఒకటి ముందు పెట్టుకొని ఒక న్యూక్ర్లియర్ ఫిజిక్స్ సబ్జెక్ట్ లో వచ్చిన సిధ్ధాంతవ్యాసాన్ని జర్మనీ నుండి తెలుగు చేయటం ఎలా ఉంటుందో ఆలోచించండి. అది కూడా ఎన్నడూ సైన్స్ విద్యార్థి కాని ఒక జర్నలిష్ట్ ఆపని చేస్తే ఎలా ఉంటుందో యోచించండి." అని మీరు అన్నారు. నిఘంటువును ముందు పెట్టుకుని తెలియని సబ్జెక్టుకు చెందిన పాఠాన్నిఅనువదించే దుస్సాహసిగా మీరు జర్నలిస్టును భావించడం సరి కాదండీ. నిజమే, ప్రతి ఒక్క జర్నలిస్టు అన్ని సబ్జెక్టులలో నిష్ణాతుడు కాడు. అలాగే అతను అన్ని సబ్జెక్టులలో నిష్ణాతులు కానీ పాఠకులకు సమాచారం అందిస్తున్నాడన్న సంగతీ మరచిపోకూడదు. ఒక సబ్జెక్టుపై నిష్ణాతులు కానీ పాఠకులకు ఎంతవరకు సమాచారం ఇవ్వాలో, అది కూడా ఎంత నిర్దుష్టంగా ఇవ్వాలో ఆలోచించుకునే జర్నలిష్టు ఇస్తాడు. దాని పూర్వరంగంలో అతని సాధన, అనుభవం రెండూ పనిచేస్తాయి. తను రాస్తున్న అంశానికి అవసరమైన సమాచారాన్ని, అవగాహనను అతను సమీకరించుకున్న తర్వాతే రాస్తాడు. జర్నలిష్టు పాఠకుల పట్ల ఎంతో బాధ్యతగా ఉండడం అతని వృత్తిలో ప్రాథమిక ధర్మం. ప్రతి ఛోటా ఉన్నట్టే ఈ రంగంలోనూ ఇందుకు మినహాయింపులు ఉండచ్చు కానీ, జెనరలైజ్ చేయకూడదు. అచ్చులోకి వెళ్ళే ప్రతి అక్షరం నిర్దుష్టంగా ఉండేలా చూసేందుకే ఎడిటర్లు ఉన్నది. ఏదో ఒక సబ్జెక్టు చదువుకున్నా జర్నలిజంలోకి వచ్చిన తర్వాత వృత్తి రీత్యా అనేక సబ్జెక్టులను డీల్ చేయవలసి రావడంతో ఆ సబ్జెక్టులలో సామాన్య పాఠకులకు అవసరమైన మేరకు పరిజ్ఞానాన్ని పొందిన ఎడిటర్లు, ఇతర పాత్రికేయులు ఎందరో ఉన్నారు. జర్నలిష్టుల గురించి మీ భావన సరికాదనిపించి ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీనో చర్చనీయం చేయడం కాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరంగారూ, మీ క్రొత్త సందేహాలకు నా వివరణలను సాయంత్రం అందించటానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం ఆఫీసు పనివేళ కదా. జర్నలిష్టు అని యథాలాపంగా అన్నాను కాని అది పొరపాటే. జర్నలిష్టు అవసరం లేదండి, '......ఎన్నడూ సైన్స్ విద్యార్థి కాని ఒక వ్యక్తి ఆపని చేస్తే ఎలా ఉంటుందో .....' అని ఉంటే చాలు కదా. జర్నలిష్టుల మాటకు వస్తే మా కుంటుంబంలోనే ఒక రున్నారు కూడా. అసలు నేను ఈ సైస్సు రంగంలోనికి రాకపోతే ఆ వృత్తిలోనికే వెళ్ళేవాడినేమో కూడా. జర్నలిష్టుల గురించి నా భావన సరికాదనిపించేలా వ్రాసినందుకు క్షంతవ్యుడిని. ఇది ప్రమాదవశమే కాని ఉద్దేశపూర్వకం కాదండి.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.