1, డిసెంబర్ 2014, సోమవారం

అమ్మ - తెలుగు

ఆదరించేవాళ్ళు లేక అమ్మ చచ్చిపోతోంది
పలకరించేవాళ్ళు లేక తెలుగు చచ్చిపోతోంది.

అంతగా అన్నవస్త్రాలు అవసరమా అన్నది ఒక ప్రశ్న
అన్నిఅక్షరాభరణాలు అవసరమా అన్నది ఒక ప్రశ్న

అమ్మా అని పిలవకూడదూ అని బళ్ళల్లో హెచ్చరించి చెబుతున్నారు
తెలుగులో మాట్లాడితే శిక్ష తప్పదని కూడా కఠినంగా చెబుతున్నారు

ఇప్పటికే అనేకానేకమంది అమ్మలు మమ్మీలుగా మారిపోయారు
ఇప్పటికే తెలుగమ్మ కూడా చాలావరకూ డమ్మీగా మారిపోయింది

పాలిచ్చి పెంచి అవసరాలు తీర్చేందుకు అమ్మ ఒక పనిముట్టుగా మారిపోయింది.
సరదాగా మాట్లాడి వినోదంగా చూసేందుకు తెలుగు ఒక పనిముట్టుగా మారిపోయింది.

కేవలం మనిషైనందుకు అమ్మకు పనిముట్టు అన్న అగౌరవవాచకం మాత్రం వాడం
కేవలం జీవం లేనిదేకదా అనిపించినందుకే తెలుగుకు మాతృగౌరవం కూడా ఇవ్వం

మాతృమూర్తి ఒక పనిముట్టు అనిపించుకోని పనిముట్టు
మాతృభాష తెలుగు మనం గొప్పవాళ్లం కాబట్టి ఒక పనిముట్టు

పడి ఉండకపోతే అమ్మని బయటకి విసిరేస్తున్నారు ఆధునికులు
నోటికి పట్టుబడకపోతే తెలుగును చీరి ఆరేస్తున్నారు ఆధునికులు

అమ్మ మనం చెప్పినట్లు వినాలి కదా ముసలిదైపోయిన తరువాత
తెలుగు మనం కోరినట్లు మారాలికదా మనం మారమన్న తరువాత

మారని మాతృమూర్తిని ఎవరు మాత్రం ఎంతకాలం ఆదరిస్తారు పాపం
మారనంటే మాతృభాషని ఎవరు మాత్రం ఎంతకాలం ఆదరిస్తారు పాపం

అందుకే మన ఆధునికతాప్రీతి దెబ్బకు లోకంలో అమ్మ చచ్చిపోతోంది
అందుకే మన ఆధునికతాప్రీతి గొప్పకు లోకంలో తెలుగు చచ్చిపోతోంది

మాతృమూర్తి అనిపించుకున్నందుకు ఆ పిల్లల చేతిలో ఏదన్నా కాక తప్పదు కదా
మాతృభాష అనిపించుకున్నందుకు ఈ జనం చేతిలో ఏదన్నా కాక తప్పదు కదా

అందుకే, ఆదరించేవాళ్ళు లేక అమ్మ చచ్చిపోతోంది
అలాగే, పలకరించేవాళ్ళు లేక తెలుగు చచ్చిపోతోంది.