24, డిసెంబర్ 2015, గురువారం

ముగ్గురే చదివిన పద్యం!

కవికి నిర్వేదం‌ కలిగించే సంగతి ఏమిటంటే వాడి కవిత్వాన్ని ఎవరూ పట్టించుకోక పోవటం.

ఈ టపా వ్రాస్తున్న సమయానికి నేటి పద్యం 'రామరధోద్దతము'ముఖం చూసిన వారి సంఖ్య కేవలం మూడు. 
పదిహేడున్నర గంటల్లో మూడు సార్లు దర్శించబడిన టపా ఇది.
అంటే ఆరు గంటలకు ఒకరన్నమాట.
బాగుంది.

ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా! అని ఒక పద్యంలో వస్తుంది.
ఆముక్కతో ఆ పద్యం ప్రసిధ్దం ఐనట్లుంది.
అదలా ఉంచి, ఆ మాట అక్షరసత్యం.

ఎందరో పద్య కవులు మనమధ్యన ఉన్నారు.
కొద్దిమంది చదువుతున్నారు నా పద్యాలను కూడా. అందుకు ఆనందం.
పది మంది పెద్దలు చదివి తప్పొప్పులు చెబితే నాబోటీ అల్పకవికి ఎదిగేందుకు కాస్త అవకాశం వస్తుంది.
లేకుంటే నా బోటివాడికి అభివ్బృధ్ధి ఎట్లాగు?

ఎందరో పద్యరచనా ప్రయత్నాలు చేస్తున్న ఔత్సాహికులున్నారు మనమధ్య.
వారిలో‌ అధికులు ఈ బ్లాగు ముఖం చూదను కూడా చూడరు!
బహుశః నేను వారి స్థాయికి తగిన వాడిని కాకపోవచ్చును.
అది వారిలో‌ కొందరి ఉద్దేశం‌ కావచ్చును.
కొందరికి నా కవిత్వంతో పరిచయం కూడా లేక పోవచ్చును.
కొందరికి వారి కవితావ్యాసంగంతోనే తీరిక లేక ఇతరులు వ్రాసేది చదివే ఓపికా తీరికా లేకపోవచ్చును.

కొందరు చదువుతున్నారు నా కవిత్వాన్ని.
అది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నది.
శ్రీ విష్ణునందన్ గారు కావ్యనిర్మాణం చేసిన కవివరేణ్యులు. వారు సలహాలనిచ్చి ప్రోత్సహిస్తున్నారు.
శ్రీ గుండు మధుసూదన్ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వారు కూడా నాకు ప్రోత్సాహాన్నిస్తున్నారు నా పద్యాలను పరామర్శిస్తూ.
శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు లబ్ధప్రతిష్ఠులైన కవి.  వారు చదువుతున్నారు.  ఒక అభినందన వ్యాఖ్యకూడా ఇచ్చారు.

కొందరు వింతవింత వ్యాఖ్యలూ చేస్తున్నారు కాని వాటీ సంఖ్య స్వల్పమే.
అంటే స్వల్పమైన దర్శనాలు కల అంతకంటే స్వల్పమైన వ్యాఖ్యలు కల టపాల్లో -
స్వల్పసంఖ్యలోనే వింతవ్యాఖ్యలు వచ్చాయి లెండి.
గుడ్డిలో మెల్ల.

మొత్తం మీద చదువుతున్నవారు బాగా తక్కువే.
ఐనా వ్రాస్తూనే ఉంటాను.
ఎందుకంటే ఈ పద్యాలు నా రాముడి కోసం వ్రాస్తున్నవి.
ఎవరు నేడు చదివినా చదవక పోయినా ఇబ్బంది లేదు.
రాముడు మెచ్చిన చాలును కదా!

ఏ మంటారు?

5 కామెంట్‌లు:

  1. మిత్రులు శ్యామలరావుగారు,

    మీరు రాస్తున్నది ఒక లక్షణ గ్రంధం, ఇవి చవికబారు లొల్లాయి పదాలలాటివి కాదు. వ్యాఖ్య చేయడానికి కొంతయినా తెలిసి ఉండాలి కదా! నేనిలా అన్నానని బాధ పడకండి. ఎవరు చదివిన,చదవకపోయిన వీటి విలువ తగ్గదు.
    క్షమించాలి, మేధావులలో ఉన్నంత స్వార్ధం, అసహనం చదువుకోనివారిలో లేదు...

    ఈ గ్రంధాన్ని పూర్తి చేయమని వినతి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏక క్రియా ద్వ్యర్ధి కరీ‌ అన్నట్లుగా ఈ పాహిరామప్రభో శీర్షిక ఉద్దేశం రామస్తుతి. అందులో ఒక భాగంగా విశేషవృత్తాలలో రామస్తుతి నడుస్తోంది. ఈ వృత్తాలను విశేష వృత్తాలనటానికి కారణం అవి మనకు కవిప్రయోగాల్లో చాలా అరుదుగా కనిపించటమే. ఏవో‌ అశ్వాసాంతాల్లాంటి చోట్ల తప్ప అవి కనిపించవు. ఇలాంటివి వందల్లో ఉన్నాయి. ప్రతి వృత్తంలోనూ చేయాలని సంకల్పం రామస్తుతి. ఇవి అరుదైనవి కాబట్టి లక్షణం చర్చించవలసి వస్తోంది. అందుచేత లక్షణ గ్రంథం కూడా అవుతోంది. మంచిదే కానివ్వండి. రోజుకు ఒకటి చొప్పున ఒక ఏడాది నడుస్తుందేమో‌ ఇలాగు ఈ భాగం. రామేఛ్ఛ.

      ఇక మేధావులంటారా, వారి ఇబ్బందులు వారివి వారి వారి ప్రత్యేక పరిస్థితులు వారివి మరి. పోనివ్వండి.

      తొలగించండి
    2. ”క్షీరకంఠుల కెరుగదరమె?” ఏదో పద్యపాదంలా ఉందండీ! :) నా కబుర్లకేంగాని లయగ్రాహి చెప్పరూ, మళ్ళీ కొన్ని పెద్ద వృత్తాల దగ్గరకెళదాం.

      తొలగించండి
  2. శ్రీ శ్యామలీయం గారూ, మీ మాటల్లో ఒక విధమైన ఆవేదనుంది , శ్రీ శర్మ గారి మాటల్లో ఇంకో విధమైన ఆలోచనుంది.
    పాత సామెత - "ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరిగి చెడతాడు" అనొకటుంది - దాన్ని కొనసాగిస్తే " కవి చదవక చెడతాడు " అని స్వీయాభిప్రాయం.

    "గణములెరింగినంతట నెకాయెకి పద్యములేవొ వ్రాసి ధీ
    మణి యని పేరుఁ గాంచి కడు మన్నననొందఁగ నుత్సహించుఁ; దా
    నణువయినన్ పఠించుచు నయమ్ముగఁ బూర్వ కవి ప్రయోగ స
    ద్గుణముల సంగ్రహించుటకుఁ గోరఁడు నేటి కవీంద్రుఁడక్కటా !"

    పూర్వ కవిప్రయోగాలు , కావ్యాలు చదివితే ఒక సౌలభ్యముంది. ఆయా సందర్భాల్లో - అవసరమైనప్పుడు ఆయా కవి ప్రయోగాలు గుర్తుకు వచ్చి పద్యం ఎంత ధారగా నడుస్తుందో అనుభవైక వేద్యం. యతి , ప్రాస , గణాలు దేనికీ తడుముకోనవసరం లేదు. పదం వెంట పదం వచ్చి కూర్చుంటాయి - అదీ పఠనం వల్ల కలిగే ప్రయోజనం. ఈ విషయాన్నే ఔత్సాహికులు గుర్తెరగగలగాలి.

    అవును - నేటి ఔత్సాహిక కవులు స్వీకరించినంత స్వీకరించి , ఇంటికి పట్టుకుపోగలిగినంత ' సరకు ' మీ దగ్గరుంది. అది దొరికినవానికి దొరికుతుంది , లేని వానికి లేదు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.విష్ణునందన్ గారు
      మన్నించాలి.
      సామెత సరి చేయాలి. ఇది పాత కాలపు సామెత,నేటికి వర్తించదనుకోండి.
      "ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు" ఇక్కడ తిరగడం అంటే లోక సంచారమని.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.