సింహగతి. రామునే తలపరాదా ప్రేమతో పిలువరాదా నీ మనోరథము నీయన్ స్వామి నీ కడకు రాడా సింహగతి. భామ లందరును రారే ప్రేమ మీఱగను సీతా రామచంద్రులకు వేడ్కన్ క్షేమహారతుల నీరే |
సింహగతి అనేది ఒక కొత్త వృత్తం. నా సృష్టియే. దీనికి గణవిభజన ర-న-గగ చిన్న వృత్తంకాబట్టి యతిస్థానం ఏమీ ఉండదు. ప్రాసనియయం మాత్రం ఉంటుంది.
ఈ వృత్తానికీ సింహరేఖకీ చాలా దగ్గర చుట్టరికం. ఒకే ఒక అక్షరంలోనే తేడా. క్రీగీటుతోచూపుతున్నాను ఆ తేడాను.
సింహరేఖ U I U I U I U U
సింహగతి U I U I I I U U
అంతే తేడా. కాని నడక వేరుగా వస్తుంది. ఈ సింహగతిలో సాధారణంగా 'న' గణం దగ్గర విరుపు వస్తుంది. లేదా న-గణానికి పూర్వాక్షరం మీద విరుపు వస్తుంది. అలాగే చివరన ఉన్న 'గగ' పైన కూడా ఒక చిన్న విరుపు ఉందని గమనించండి.
రామునే - తలప - రాదా
ప్రేమతో - పిలువ - రాదా
నీ మనో - రథము - నీయన్
స్వామి - నీ కడకు - రాడా
ఇందులో మొదటి మూడు పాదాల్లోనూ న-గణం దగ్గరా, చివరిపాదంలో తత్పూర్వాక్షరం పైనా విరుపు గమనించండి. రెండవరకం విరుపు ప్రథానంగా ఉన్న పద్యం.
భామ -లందరును - రారే
ప్రేమ -మీఱగను - సీతా
రామ - చంద్రులకు - వేడ్కన్
క్షేమ - హారతుల - నీరే
ఇది వ్రాయటం సులభం కాబట్టీ ఔత్సాహికులు ప్రయత్నించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.