కౌముది. సురలకేమో సుఖావాప్తిగన్ సురగణారిన్ సొదం బెట్టగన్ వరలె రామావతారం బిలన్ పరమధర్మప్రకాశంబుగన్ (యతి 6వ స్థానం) కౌముది. దివిషదుల్ గోర శ్రీరాముడై భువికినే తెంచె నా వెన్నుడే భువనసమ్మోహనాకారుడై భువనసంరక్షణోద్యోగియై (యతి పాటించలేదు) కౌముది. అనితరం బైన దా రూపమే అనితరం బైన దా శౌర్యమే తనువునం దాల్చి తా వెన్నుడే మనుజుడై పుట్టె మా రాముడై (యతి 7వ స్థానం) |
ఈ కౌముది ఒక పొట్టి వృత్తం.
దీనికి గణవిభజన న -- త -- త -- గ . పాదం నిడివి 10 అక్షరాలు. ఇంత చిన్న వృత్తానికి యతిస్థానం అవసరం లేదని నా అభిప్రాయం. కాని లక్షణకారులు 6వ అక్షరం యతిస్థానం అని చెప్పారు. ప్రాసనియమం తప్పదు. నడక విషయం చూదాం. మనం దీనిలోని గురులఘుక్రమాన్ని నల -- ర -- ర అని పంచమాత్రాగణాలుగా విభజన చేయవచ్చును. బహుశః ఇదే సహజమైన గణవిభజన అనుకోవచ్చును. నడక ననన-నా నాననా నాననా అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఉదాహరణలు చూదాం .
మొదటగా 6వ అక్షరం యతిస్థానంగా ఒక పద్యం.
సురలకేమో సుఖావాప్తిగన్
సురగణారిన్ సొదం బెట్టగన్
వరలె రామావతారం బిలన్
పరమధర్మప్రకాశంబుగన్
యతినియమం వదిలి పెట్టి ఒక పద్యం.
దివిషదుల్ గోర శ్రీరాముడై
భువికినే తెంచె నా వెన్నుడే
భువనసమ్మోహనాకారుడై
భువనసంరక్షణోద్యోగియై
ఈ పద్యం పంచమాత్రాగణాలతో కూడిన నడకతో ఉన్నది. ఆ ప్రకారం విడదీసి చూపితే ఈక్రింది విధంగా ఉంటుంది. ఐదు-ఐదు మాత్రలతో నడిచే తాళగతిని ఖండగతి అంటారు.
దివిషదుల్ | గోర శ్రీ | రాముడై |
భువికి నే | తెంచె నా | వెన్నుడే |
భువన స | మ్మోహనా | కారుడై |
భువన సం | రక్షణో | ద్యోగియై |
ఈ కౌముదీవృత్తానికి యతిస్థానంగా 7వ అక్షరాన్ని గ్రహించటం కూడా బాగుంటుంది. యతిస్థానం కూడా ఒక గురువు పైన వస్తుంది. ఇలా కూడా ఒక పద్యం చెప్పుకుందాం.
అనితరం బైన దా రూపమే
అనితరం బైన దా శౌర్యమే
తనువునందాల్చి తా వెన్నుడే
మనుజుడై పుట్టె మా రాముడై
యతిస్థానం 7వ అక్షరంగా విరచి చదివితే దీని నడక భిన్నంగా తమాషాగా ఉంటుంది
అనితరం | బైన | దా - రూపమే |
అనితరం | బైన | దా - శౌర్యమే |
తనువునం | దాల్చి | తా - వెన్నుడై |
మనుజుడై | పుట్టె | మా - రాముడే |
కొందరు యతిస్థానం 6వ అక్షరంగా నప్పుతుందనీ మరి కొందరు 7వ అక్షరంగా నప్పుతుందనీ అభిప్రాయ పడవచ్చును. అలాగే యతిస్థానం లేకపోవటమే ఉత్తమం అనీ కొందరు అనుకోవచ్చును. వాడంకం మీద కాని ఏ ఆలోచన సరైనది అని నిగ్గుతేలదు.
ఈ కౌముదీవృత్తానికి పూర్వకవుల ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.
రిప్లయితొలగించండిరాముల వారికీ ఉద్యోగం ఇప్పించేసారూ :) భువన సంరక్షణ ఉద్యోగి :)
జిలేబి
ఏం చెప్పమంటారు?
తొలగించండి- మీకు నా పద్యాల్లోని భక్తిభావన గురించి మాట్లాడవలసింది ఏమీ కనబడలేదు.
- ఒక విశేషవృత్తం తాలూకు పూర్వం రంగం ఏమీ కనిపించని పరిస్థితిలో దాని యొక్క స్వభావాన్ని భావన చేయటంలో కవి చేసే మానసికమైన తపస్సు అనేది మీకు ఆనలేదు.
- ఒక విశేషవృత్తాన్ని ఎన్నుకొని పద్యాలు మంచి నడకతో చెప్పటంలో ఒక కవికి ఉన్న కష్టమూ తృప్తీ మీకు కనబడలేదు.
ఇలా అన్నానని ఏమీ అనుకోకండి. నేను నా రాములవారి కోసం పద్యాలు వ్రాసుకోవటం మీకు హాస్యవస్తువుగా కనబడటం నాకు నచ్చలేదు.
విషయానికి వస్తే, 'పాండవోద్యోగము' అన్న పేరు విన్నారా?
'అరసికాయ కవిత్వనివేదనంశిరసి మాలిఖ మాలిఖ మాలిఖ' అని ఎవరో ఒక కవి పూర్వం మొత్తుకున్నాడట. అలాగుంది నా పరిస్థితి
తొలగించండిశ్యామలీయం వారు,
ఆ పదం చదివి శ్రీ పాద వారి విప్రలంభ శృంగార యోగి అన్న పదం గుర్తు కొచ్చింది !
శ్యామలీయం వారి రాముల వారి గురించిన తపన ని అర్థం చేసుకోలేని వారమా ?
కొంత జిలేబితనం అంతే !
రాముడు నావాడు అని మనం అనుకుంటే రాముడు అందరూ మనవాళ్ళే అనుకుంటారని అదే మానవుల మైన మనకి దేవాంశ శంభూతులకి వ్యత్యాసం అని ఎక్కడో చదివి నట్టు గుర్తు !
అట్లా భువన సంరక్షణ ఉద్యోగం రాముల వారి కి మీరు ఇప్పించడం (అందరి క్షేమం కోరి ) అన్నది అర్థమై అట్లా అన్నా ! రాముల వారికి ఉద్యోగం ఇప్పించే సారు అని !
చీర్స్
జిలేబి
రాముడేప్పుడూ అందరూ నావాళ్ళే అనుకుంటాడండీ. మనలో చాలా మందికి అలా అనుకునేంత తీరిక కూడ ఉండటం లేదు కదా.
తొలగించండిరాముడంటే వెన్నుడే కదా. అయన ఉద్యోగమే భువనాలకు స్థ్తితి కారకుడీగా ఉండటం కదా.
శ్రీ శ్యామలీయం గారు,
రిప్లయితొలగించండిఅయి త్యక్తాసి కస్తూరి
పామరై:పంకశంకయా
అలం ఖేదేన భూపాలా:
కిం న సంతి మహీతలే (జగన్నాథ పండితరాయలు)
బుద్ధి లేని వారు బురదగా భావించి
విడిచి వైచిరంచు వెతలవేల?
కలరు లోకమందు కస్తూరి! పెక్కండ్రు
నిన్ను మెచ్చునట్టి నృపతివరులు! (నా తెనుఁగుసేత)
అన్నట్లు మీరుదహరించిన వాక్యం కూడా పండిత రాయలదే.
"అరసికేషు కవిత్వ నివేదనమ్.... " అని ఉండాలి.
మీ వ్రాసిన త్రివిధ పద్య రూపాల్లో, 7వ స్థానంలో యతితో మంచి తూగు కనపడుతోంది - లాక్షణికం కాకపోయినా.
రిప్లయితొలగించండిశ్రీ రామ 'చంద్ర' కౌముది చక్కగా ఉంది.
విష్ణునందనులవారు. అవునండి. ఇంత చిన్న వృత్తంలో నడకలో వైవిధ్యం చూపేందుకు మంచి అవకాశమే ఉన్నదండి.
తొలగించండి