28, డిసెంబర్ 2015, సోమవారం

ఈ పంక్తి రాముడి కోసం


    పంక్తి.
    ఏ మనుజోత్తము లింపెసగన్
    రాముని నామము రామకథల్
    ప్రేముడి గొల్తురు రేబవళుల్
    స్వామికి వా రతి సన్నిహితుల్పంక్తి.

ఈ‌పంక్తి వృత్తానికి గణవిభజన భ-భ-భ-గ. అంటే పాదానికి 10అక్షరాలన్నమాట. యతిస్థానం 7వ అక్షరం.
ఈ వృత్తాన్ని నాగవర్మ చిత్రపదం అన్నాడు.  దీనికే దోధక, చిత్రగతి, సారవతీ, విశ్వముఖి అన్న పేర్లు కూడా ఉన్నాయి.

అనంతుడు 'పంక్తి' అన్నది వేరే వృత్తం  - దానికి గణాలు భ-గగ.

అందరూ వికటకవి అన్న మాట వినే ఉంటారు. తెనాలి రామకృష్ణకవిని వికటకవి అంటారని నానుడి. ఆయన వ్రాసిన ప్రబంధం పాండురంగమహాత్మ్యంలో హాస్యాన్ని చచ్చీచెడి పిండవలసిందే. ఐనా దొరకదు. అందుచేత ఆయన్ను వికటకవి అనటం వట్టి పుకారే. అదలా ఉంచి ఈ‌ వికటకవి అన్న మాటలో ఒక విశేషం ఉంది. ఎడమనుండి కుడివైపుకు చదివినా కుడినుండి ఎడమవైపుకు చదివినా మాట అలాగే ఉంటుంది. ఈ‌ సంగతి ఆబాలగోపాలానికీ‌ తెలుసినదే. మరి ఒక పద్యంలో గురువులూ లఘువులూ ఉండే అమరిక కూడా ఇలాంటి తమాషాతో ఉండవచ్చునా అంటే భేషుగ్గా ఉండవచ్చును. దానికి ఈ‌ పంక్తి వృత్తం ఒక ఉదాహరణ.

అదెలాగూ ఈ‌పద్యానికి గణాలు భభగ కదా తిప్పిచదివితే వేరేగా ఉంటుంది కదా అనకండి. జాగ్రతగా చూడండి, నేను గురులఘువుల క్రమాన్ని కదా ప్రస్తావించినది? ఈ పంక్తి వృత్తానికి గురులఘుక్రమం UII UII UII U అనే దాన్ని UIIUIIUIIU అని చూస్తే ఈ వృత్తపాదంలో గురులఘువుల అమరికలోని సౌష్ఠవం బోధపడుతుంది. ఈ గురులఘుక్రమం త్రిప్పి చదివినా అలాగే ఉంది కదా. సులభంగా దీనిని మనం UIIU II UIIU అనో లేదా భగ-లల-భగ అనో గుర్తుపెట్టుకోవచ్చును. సమస్తవృత్తసమూహాన్నీ త్రికగణాలతో చూస్తూ కూర్చుంటే చాలా వృత్తాల మర్మమూ వాటి నడకా బోధపడనే‌పడవు.

ఈ పంక్తివృత్తానికి పాదపవృత్తానికీ చాలా దగ్గర చుట్టరికం. పంక్తివృత్త పాదానికి చివరన మరొక గురువును చేర్చితే అది పాదపం ఐపోతుంది!

ఈ పంక్తి వృత్తానికీ మాణవక వృత్తానికీ కూడా దగ్గర చుట్టరికం ఉంది. మాణవకానికి గణవిభజన భ-త-లగ. పంక్తి వృత్తానికి భ-భ-భ-గ. పోలిక కనిపించటం‌ లేదంటారా? గణవిభజనను త్రిక గణాలలో చుట్టరికం ఆట్టే లేని మాట వాస్తవమే. మాణవక వృత్తానికి గణవిభజనను భగ-భగ అని కూడా చూడవచ్చును. పంక్తి కైతే భగ-లల-భగ అని చూడవచ్చును. ఇప్పుడు చుట్టరికం‌ బోధపడుతోంది కదా. ఇది కేవలం సౌష్టవం తాలూకు చుట్టరికం. అందకంటే పెద్దచుట్టరికం మరొక టుంది చూడండి.

మీరు కొంచెం జాగ్రత్తగా గమనించితే ‌ఈ‌ పంక్తివృత్తం నడక కూడా తోటక వృత్తం నడకలాగా కనిపిస్తుంది. ఎందుకబ్బా అని కొంచెం ఆలోచించితే స్ఫురించే విషయం ఒకటుంది. ఈ పంక్తి వృత్తానికీ తోటకవృత్తానికీ కూడా దగ్గర చుట్టరికమే అని. తోటక వృత్తానికి గణాలు స-స-స-స. పంక్తికేమో భ-భ-భ-గ. చుట్టరికం ఎలాగూ‌ అనవచ్చును. మళ్ళా గురులఘువుల క్రమం చూడాల్సిందే. తోటకంలొ గురులఘుక్రమం IIU IIU IIU IIU ఐతే పంక్తికి  UII UII UII U. మంచిది. ఇప్పుడు చూడండి.  పంక్తి వృత్తపాదానికి ముందు రెండు లఘువులని చేర్చితే అది కాస్తా తోటకం పాదం ఐపోతోంది. II  UII UII UII U. -->  IIU IIU IIU IIU కదా.  అదన్నమాట ఈ పంక్తి వృత్తం‌ నడక తోటకం నడకలాగా కనిపించటానికి కారణం.  అంతే కాదు. ఈ‌ పంక్తి వృత్తానికి యతిస్థానం 7వ అక్షరం ఐతే తోటకానికి 9వ అక్షరం. అందుచేత తోటకానికీ పంక్తివృత్తానికి యతిమైత్రి ఒకే అక్షరం పైన వస్తుంది. చిత్రకవిత్వం మీద ఆసక్తి ఉన్నవాళ్ళకు పంక్తిగర్భతోటకం వ్రాయటం  కొంత సులువు.  తోటకంలో ఒకటి, మూడు, తొమ్మిది స్థానాలకు యతిమైత్రి కూర్చుకుంటూ వ్రాయటమే కాబట్టి,

ఈ పంక్తి వృత్తానికి మణిమధ్యం అనే వృత్తంతో ఇంకా చాలా దగ్గరి చుట్టరికం‌ ఉంది. అదెలాగో చూడంది. ఈ పంక్తికి గురులఘుక్రమం UII UII UII U అంటే UIIU II UIIU కదా. ఈ మధ్యన ఉన్న రెండు లఘువుల్నీ తీసి వాటిస్థానంలో ఒక గురువును ఉంచితే అప్పుడు గురులఘుక్రమం UIIU U UIIU  అవుతున్నది కదా - అదే మణిమధ్యం అనే వృత్తం. మణిమధ్యం అనేదానికి మణిబంధం అన్న పేరూ ఉంది. ఆ  పద్యాన్ని తరువాత చెప్పుకుందాం.

మనం‌ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే స్వల్పమైన మార్పులతో ఒక వృత్తం మరొకటిగా మారటం చాలా తరచుగా చూస్తాం అన్నది.

లక్షణ గ్రంథాల్లోనిది కాబోలు ఒక ఉదాహరణ పద్యం వెబ్‌లో కనిపించింది.

దుర్ముఖుఁడీతఁడు తూగి సమి
త్కర్మ ప్రచండుఁడుకాహళరా
నోర్మిచలద్రవుఁ డత్థభుజా
కర్మఠుఁ డాహవకాలుఁడయా

ఈ‌ పంక్తి వృత్తానికి పూర్వకవుల ప్రయోగాలేమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.

7 కామెంట్‌లు:

 1. ఒక్క భకారంబెక్కు గగంబులు కాదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పంక్తి ఒక భగణం రెండు గురువులు కలిగిన ఐదక్షరాల వృత్తం కాదాండీ.

   తొలగించండి
  2. పాదానికి గణవిభజన భ-గగ ఉండే వృత్తానికి అనంతుని ఛందము 'పంక్తి' అన్న పేరుతో ఉంది నిజమే. దీన్ని నాగవర్మ 'కాంచనమాలె' అన్నాడు మిగిలిన లక్షణగ్రంథాలు 'సుందరి' అన్నాయి.

   తొలగించండి
  3. శర్మగారూ, ఈ రోజున ఈ‌ సుందరీ వృత్తంలో వ్రాసాను, దయచేసి పరిశీలించండి.

   తొలగించండి
 2. రిప్లయిలు
  1. అక్కరలు దేశి ఛందస్సులు. వృత్తాలు మార్గిఛందస్సులు. మార్గిఛందస్సులలో ప్రతి స్థానానికి గురుత్వలఘుత్వాలు నియతాలు. ఉత్పలమాలలో మూడవ అక్షరం లఘువు. ఎప్పుడూ‌ అక్కడ లఘువే రావాలన్నమాట. దేశి ఛందాలు సూర్యచంద్రేంద్రాది మాత్రాగణ నిర్మితాలు. వదేశిఛందస్సుల్లో ఫలాని గణక్రమం అని ఉంటుందే కాని ఫలాని అక్షరస్థానం‌గురువనీ లఘువనీ‌ నియమం ఉండదు.తేటగీతి దేశిఛందం. దానిలో మొదటీ గణం‌ సూర్యగణం. అది నియమం. తేటగీతి మొదటి అక్షరం గురువు కావచ్చు లేదా లఘువు కావచ్చును. మార్గిఛందస్సులు త్రికగణనిర్మితాలు కాబట్టి వాటిలో‌ ఈ‌ సదుపాయం లేదు. ప్రతిస్థానమూ‌ గురువొ‌ లఘువో ఖచ్చితంగా ఉంటుంది. అసలు మొదట మార్గిఛందస్సుల్లో ఇలా అక్షరస్థానాల గురులఘుక్రమం చెప్పటమే సంప్రదాయం - త్రికగణాలతో చెప్పటం తరువాత వచ్చింది.

   ఒక పద్యం మార్గి దేశీ ఛందస్సులు రెండింటిలోనూ‌ అమరినప్పుడు మార్గి వృత్తాన్ని మాత్రమే సూచించటం సంప్రదాయం.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.