26, డిసెంబర్ 2015, శనివారం

లయగ్రాహిలో రామస్తుతి

    లయగ్రాహి.
    భూవలయ మందు బడి బావుకొన నేమి గల దీవిషయ మఙ్ఞుడను కేవలము రామా
    భావనము చేయగల ధీవిభవమే యెఱుగ నావనజ సంభవుని యీవి యిటులయ్యా
    నా వివిధదోషములు నీ వెరుగనివి కావు కేవలము నీదుకృప నావలన నుంటం
    గావుమన ముక్తిగొను ద్రోవ గనజేసితివి నీ విధము లద్భుతములై వెలుగు గాదే
లయగ్రాహి

లయగ్రాహి ఒక పెద్దపద్యం.  దాని పాదానికీ‌ ఏకంగా 30 అక్షరా లుంటాయి.
ఈ‌లయగ్రహికి గణవిభజన భ - జ - స - న - భ - జ - స - న - భ - య అని చాలా పొడుగ్గా ఉంటుంది.
పాదానికి 26అక్షరాల కన్నా పొడుగున్న వృత్తాలని ఉధ్ధురమాలా వృత్తాలు అని పిలుస్తారు.
కాబట్టి లయగ్రహి ఒక ఉధ్ధురమాలా వృత్తం

ఈ లయగ్రాహిలో విశేషం‌ఏమిటంటే యతిస్థానం ఏమీ లేదు.
సాధారణంగా ప్రాసయతి వృత్తాలో  అంగీకరించరు.
లయగ్రాహిలో వాడేది ప్రాసయతిని మాత్రమే. దానిని 10, 18, 26వ స్థానాల్లో వచ్చేలా వేయాలి.

ప్రాసయతి అంటె కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది ప్రాసస్థానంలోని అక్షరానికిమాత్రమే కాదు. ప్రాసస్థానంలోని అక్షరానికి ముందు ఉన్న అక్షరానికీ‌ సంబంధించినది.  ప్రాసకు ముందు అక్షరం గురువైతే ప్రాసయతిస్థానంలో ఉన్న అక్షరానికీ ముందు గురువు ఉండాలి. ఇక్కడ లక్షణం ప్రకారమే అది సిధ్ధిస్తోంది అన్నది గమనించండి. ప్రాసాక్షరం గురువైతే ప్రాసయతిస్థానంలోనూ‌గురువుండాలి. ప్రాసాక్షరం బిందుపూర్వకమైతే ప్రాసయతిస్థానంలోనూ అక్షరం బిందుపూర్వకంగానే ఉండాలి.  ప్రాసాక్షరం ఏ హల్లు ఐతే‌ ప్రాసయతి కూడా అదే హల్లుగా ఉండాలి. ప్రాసాక్షరం ద్విత్వాక్షరమో సంయుక్తాక్షరమో ఐతే ప్రాసయతి అదే ద్విత్వమో సంయుక్తాక్షరమో కావాలి. గుణితంతో ఇబ్బంది లేదు. ఇన్ని నియమాలున్నా ప్రాసయతి ఆట్టే కష్టమైనదేమీ‌ కాదు.

ఉదాహరణకు 'నాతి'కీ  'కోతి'కీ ప్రాసయతి కుదురుతుంది.  కాని 'నాతి'కీ 'పతి' కీ ప్రాసయతి కుదరదు. 'వంక'కి 'డొంక'తో ప్రాసయతి కుదురుతుంది కాని 'మేక'తో కుదరదు.  'అక్క' కీ ముక్కు' కీ‌ ప్రాసయతి కుదురుతుంది కాని 'అక్క'కీ‌ 'అప్ప'కీ కుదరదు.  'పది'కి 'పంది'తో ప్రాసయతి కుదరదు.  అలగే 'రాజు'కీ  'బూజుకీ కుదురుతుంది కాని 'రాజు'కీ 'రాతి'కీ ప్రాసయతి కుదరదు. ఇలా తెలుసుకోవాలన్న మాట.

లయగ్రాహిలోని చివరి ప్రాసయతిని తొలగించినప్పుడు, దానిని లలిత వృత్తము అంటారు.. 

ఒక ముఖ్య విషయం ఏమిటంటే పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారని మనకు తెలుసు. ఈ‌ లయగ్రాహిలో పాదంలో మూడు  సార్లు ప్రాసయతిని వేయాలి. మొదటి ప్రాసస్థానంతో కలిపితే మొత్తం‌ నాలుగు సార్లు ఐనది. ఆన్ని పాదాలను ఒకే‌ ప్రాసతో వ్రాయాలి కదా వృత్తం అంటే. అందుచేత పద్యం మొత్తం మీద ఒకటే ప్రాసాక్షరం నాలుగునాలుగులు పదహారు సార్లు వస్తుంది. సాధారణ కవులకు  అంటే‌ డాంబికం వదిలేసి చెప్పాలంటే నాబోటి అల్పకవులకూ ఇది ఒక పరీక్ష లాంటిదే! ఐతే కేవలం అదృష్టవశాత్తు ఈ‌ లయగ్రాహి నేను భయపడినంతగా కష్టపెట్ట లేదు. దానికి ఒక కారణం సులభప్రాసాక్షరాన్ని ఎంచుకోవటమే అనుకోండి. ఇంతకు ముందు ఎప్పుడూ ఒక్క లయగ్రాహినీ‌ వ్రాయలేదేమో ఎందుకైనా మంచీదని ప్రాస సులభంగా ఉండేలా చూసుకున్నానన్న మాట.

లయగ్రాహిలో గణాలు భ జ స న భ  జ స న భ య అని చెబితే దాని నడక గురించి ఏమీ‌ తెలియదు. చాలా వృత్తాలకు ఇలాగే అవుతూ‌ ఉంటుంది.  త్రికగణాలతో‌  గణవిభజన చెప్పటం వలన నడక గురించి తెలిసేది తరచు శూన్యంగా ఉంటుంది.

ఈ వృత్తానికి గణాలు భ జ స న భ  జ స న భ య కాబట్టి, గురులఘుక్రమం UII IUI IIU III UII IUI IIU III UII IUU అవుతున్నది. ఈ‌ అమరికను మరొకలా చూడండి UIII UIII UIII UIII UIII UIII UIII UU అవుతున్నది. అంటే భల-గణం ఏడు సార్లు వచ్చి ఆపైన గగ అన్నమాట. ఇప్పుడు సుభగంగా ఉంది కదా.

లయగ్రాహి పాదంలో లఘువులు 21, గురువులు 9.  అంటే లఘువులు 70% అన్నమాట. ఐతే మాత్రల పరంగా చూస్తే లఘువులు 21 గురువు 18 కాబట్టి తూకం బాగానే ఉందనుకోవచ్చును.

లయగ్రాహి అనగానే నన్నయ్యగారు గుర్తుకు రావాలి. ఆయన వ్రాసిన ఆదిపర్వం‌ పంచమాశ్వాసంలోని ఈ వసంత ఋతువర్ణన పద్యాలు గుర్తుకు రావాలి.

      కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధు-పమ్ముల సుగీత నినదమ్ములెసఁగెం జూ
      తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధిముకు-ళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా
      లమ్మలగు కోకిల కులమ్ముల రవమ్ము మధు-రమ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా
      రమ్ముల నశోకనికరమ్ములను జంపకచ-యమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్

      చందనతమాలతరులందు నగరుద్రుమము-లందుఁ గదళీవనములందు లవలీమా
      కందతరుషండములయందు ననిమీలదర-విందసరసీవనములందు వనరాజీ
      కందళితపుష్ప మకరంద రసముం దగులు-చుం దనువు సౌరభమునొంది జనచిత్తా
      నందముగఁ బ్రోషితులడెందములలందురఁగ - మందమలయానిల మమంద గతి వీచెన్

పోతన్నగారు కూడా భాగవతంలో లయగ్రాహి పద్యాలు వ్రాసారు. వాటిలో ఒకటి.

     కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపులు; వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
     ప్రేలిరి మరుత్తు; లెదజాలిగొని రాశ్వినులు; కాలుడిగి రుద్రు లవలీలబడి రార్తిన్;
     వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సురజాలములు పెన్నిదుర పాలగుచు ధారా
     భీల గతితోడఁ దమ కేలి ధనువు ల్విడిచి నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!

ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలో మనోరమావృత్తాంతం అని ఒక మనోహరమైన కథ ఉంది. దానిలో‌మనోరమా వివాహ ఘట్టంలోని లయగ్రాహిని చూడండి. 

    అన్నగముపై జరఠ పన్నగపతిస్ఫట లన న్నెగసి కోటతుదల న్నెగడుకొమ్మల్‌
    మి న్నగల రాయ రుచిఁ జెన్నగు విమానముల పన్నుగడ పన్నుగఁ బ్రభిన్న గజఘోట
    చ్ఛన్న గహనాపణముల న్నిగనిగద్యుతి రవి న్నగుమణి ప్రకర మున్న గరిమం బే
    రెన్నఁగల యంగడుల వన్నె గని సంపదలమన్నగరి యొప్పు బలభిన్నగరి ఠేవన్‌.

ఆతుకూరి మొల్ల వ్రాసిన రామాయణం, మొల్ల రామాయణంగా ప్రసిధ్ధి కెక్కింది. ఆ కవయిత్రీమణి రామాయణం నుండి ఒక లయగ్రాహి.

    తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటు సాయకము లేర్చి యిపుడేయగ దొడంగెన్
    తోయద పథంబున నమేయ రుచి తోడ నుడు-రాయడును మంచి వడ గాయగ గడంగెన్
    కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లే యెడల జూచినను మ్రోయుచు జెలంగెన్
    నాయెడ కృపారసము సేయ కవివేకమున నీ యెడల నుండు టిది న్యాయమె లతాంగీ

ఆధునికులు శ్రీ‌నేమాని రామజోగి సన్యాసి రావుగారు తమ శ్రీమధ్యాత్మరామాయణంలో వ్రాసిన క్రింది లయగ్రాహిని చూడండి.

    కొందరను ద్రొక్కుచును కొందరను మ్రింగుచును కొందరను బట్టి కపి బృందముల యందున్
    కొందరను గూల్చుచును కొందరను జీల్చుచును కొందరను మొత్తునెడ దుందుడుకు మీరన్
    కొందలము నొంది కపు లందరును బర్వులిడ నందరను దాటుచును ముందునకు నెంతే
    తొందరగ నాహవము నందు నసురుండు చనె నందరకు డెందముల యందు భయదుండై

అలాగే శంకరాభరణం బ్లాగుతో‌జగత్ప్రసిధ్ధులైన కంది శంకరయ్య మాష్టారు గారి లహగ్రాహి పద్యం‌ ఒకటి

    మన్మథునిఁ జంపెనఁట సన్మునుల మెచ్చెనఁట సన్మతులఁ బ్రోచు శివునిన్మదిఁ దలంతున్
    చిన్మయుఁడు పర్వతసుతన్మదిని మెచ్చి తనువున్ముదముతో సగముగన్మఱి యొసంగెన్
    తన్మయముతోడ భవునిన్మహితు వెడెదను మన్మలిన జీవనగతిన్మలుపుమంచున్
    మన్మనములోన నెపుడున్మెరసియుండి కరుణన్మెలఁగుమంచును నుతిన్మిగులఁ జేతున్.

ఈ‌ లయగ్రాహి చాలా పెద్ద సైజు పాదంతో‌ గాభరా పెడుతుంది చదివే‌ వారిని. అందుచేత  దీన్ని ఒక సీసంలాగా పాదాన్ని రెందు భాగాలుగా చేసి  వ్రాయటం ఒక ఆచారం ఉంది.  ఉదాహరణకు ముద్రణలో పైన చూపిన నేమాని వారి పద్యం ఇలా ఉంది. పనిలో‌పనిగా ప్రాసయతి స్థానాలను క్రీగీటుతో‌ చూపుతున్నాను.

    కొందరను ద్రొక్కుచును కొందరను మ్రింగుచును
        కొందరను బట్టి కపి బృందముల యందున్
    కొందరను గూల్చుచును కొందరను జీల్చుచును
        కొందరను మొత్తునెడ దుందుడుకు మీరన్
    కొందలము నొంది కపు లందరును బర్వులిడ
        నందరను దాటుచును ముందునకు నెంతే
    తొందరగ నాహవము నందు నసురుండు చనె
        నందరకు డెందముల యందు భయదుండై

ఈ రోజుల్లో వచనకవిత్వాల పుణ్యమా అని పాదానికి ముఫైయారు అక్షరాలైనా సాగదీస్తూనే అదే కవితలో పాదానికి ఒకటి రెండు అక్షరాలు వ్రాయటాన్ని కూడా చూస్తున్నాం. ఐతే పూర్వలక్షణకారుల్లాగా ఈ కాలం వారిలో‌ పలువురు లయ గురించి ఏమీ పట్టించుకోవటం‌ లేదు.  అసలు తెలుగుభాష గురించే‌ ఆట్టే పట్టించుకోవటం లేదనుకోండి, అది వేరే సంగతి. వచన కవిత్వాన్ని ప్రచారంలోనికి తెచ్చిన శ్రీశ్రీ చక్కగా లయాత్మకంగా వ్రాసారన్నది గమనార్హం. వివాదాలు మనకెందుకు గాని, ఈ‌ లయగ్రాహిని మరింత ఆధునిక విధానంలో వ్రాయటం సులభం అని చెప్పటం నా ఉద్దేశం.  ఎలాగంటే, రెండేసి గణాలను ఒక పాదంలాగా చూపటమే.  ప్రాసయతులన్నీ ప్రాసలుగా మారిపోతాయి.  అలా వ్రాస్తే ఎలా ఉంటుందో నేమాని వారి పద్యం ఎలా వస్తుందో చూదాం.

    కొందరను ద్రొక్కుచును
    కొందరను మ్రింగుచును
    కొందరను బట్టి కపి
    బృందముల యందున్

    కొందరను గూల్చుచును
    కొందరను జీల్చుచును
    కొందరను మొత్తునెడ
    దుందుడుకు మీరన్

    కొందలము నొంది కపు
    లందరును బర్వులిడ
    నందరను దాటుచును
    ముందునకు నెంతే

    తొందరగ నాహవము
    నందు నసురుండు చనె
    నందరకు డెందముల
    యందు భయదుండై

ఇక్కడ ఇలా చూపటం వలన ప్రాసయతి గురించి చక్కగా అవగాహన అవుతున్నది కదా.  ఇలా పాదంలో వరుసగా మొదటినుండి వచ్చే ఏడు భల-గణాల్లో బేసి గణాలకు ప్రాసయతిని కూర్చాలి.

ఈ‌పద్యంలో పాదానికి ఏడు భల-గణాలు వస్తున్నాయి కదా అవి పంచమాత్రాగణాలు. చివరన ఉన్న గగ-గణం కూడా  దానికి నాలుగుమాత్రలే‌ ప్రమాణం ఐనా ఐదు మాత్రలుగా సాగదీసుకోవచ్చును. అంటే పద్యం మొత్తం పంచమాత్రా గణాలుగా నడుస్తున్నది అన్నమాట.  ఇలా ఐదు మాత్రల మీద నడిచే‌ నడకను ఖండగతి అంటారు. ఈ‌ సంగతి ఇప్పటికే కొన్ని పద్యాలలో ప్రస్తావించుకున్నాం. ఖండగతికి జంపె, ధ్రువ, మఠ్య తాళాలను వాడతారు.

ఇన్ని లయగ్రాహులను ఉదాహరణలుగా చూపటం‌ ఎందుకంటే బాగా చదివిన పిమ్మట గాని సాధారణ పాఠకులకు దీనిలో ఉన్న లయ బోధపడదు కాబట్టి.

ఈ‌ లయగ్రాహి ఒక లయప్రధానమైన వృత్తం‌ కాబట్టి  ప్రాసయతుల దగ్గరా, పాదాంతాలలోనూ‌ విరువు ఉంటే బాగా అందగిస్తుంది. లేదా అంతగా కళ గట్టక పోయే‌ ప్రమాదం ఉందని నా అభిప్రాయం. ప్రాసయతి దగ్గర విరుపు అంటే ప్రాసయతి పూర్వాక్షరం దగ్గర కొత్త పదం మొదలు కావటం అని నా ఉద్దేశం. పూర్వకవులు లయగ్రాహిని ఒక వృత్తంలాగే చూసి సాధారణమైన ప్రవాహశైలిలో దీనిని వ్రాయటం‌ జరిగింది. లయ ఉంటేనే‌ పద్యం పాఠకులను రంజింపజేస్తుంది.  లయగ్రాహివంటి లయప్రధానమైన వృత్తాలైతే చెప్పనక్కర లేదు. అసలు లయగ్రాహికే జీవం‌ దానిలోని లయ. ప్రాసయతులతో మరింతగా అందగించే లయ.


3 కామెంట్‌లు:

 1. మిత్రులు శ్యామలరావు గారు,

  ఒక ప్రశ్న మీచే ఎంత పరిశ్రమ చేయించి ఎంత విషయం చెప్పించింది? అద్భుతః. మరిలాగే కొనసాగండి. అసలు మాకు ఈ వృత్తాలకి ఇన్ని పేర్లున్నాయనే తెలియనివాళ్ళం కదా!

  "వినయము" స గణంతో మొక్కులిడుదు, చాలా చిన్నది కదా!, బాల్య చేష్ట మన్నించాలి :).

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వినయ వృత్తం వచ్చేసిందండీ.

   తొలగించండి
  2. నా అవినయాన్ని మన్నించాలి. స గణం తప్పు దోవ పట్టించబోయినందుకు.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.