19, డిసెంబర్ 2015, శనివారం

శ్రీరామ ప్రమాణికం





    ప్రమాణి.
    ధరాత్మజామనోహరా
    మొరాలకింప వేమిరా
    పరాకు మాని ప్రోవరా
    తరింపజేయరా ప్రభూ




ప్రమాణి
ఈ‌ప్రమాణి వృత్తానికి గణవిభజన జ - ర - లగ.  అంటే పదానికి 8 అక్షరాలు మాత్రమే కల చిట్టి వృత్తం
రెండు ప్రమాణిపాదాలు కలిపితే అది పంచచామరం అవుతుంది.

జగత్ప్రసిధ్ధమైన  గణేశ పంచరత్న స్తోత్రం ఈ‌ పంచచామర వృత్తాల్లోనే ఉంది. ఒక సారి  ఇక్కడ చదువుకోండి.

నడక చూస్తే ఈ‌ప్రమాణి వృత్తం నడిమికి విరుగుతూ జగ - జగ అన్నట్లుగా ఉంటుంది. లేదా అక్కడక్కడ ఇది జ - గల - ర అన్నట్లుగా ఉంటుంది.  ఎదురు నడకతో‌ ప్రారంభం కావటమే ఈ‌ వృత్తాల్లోని ప్రత్యేకమైన అందానికి కారణం అనుకుంటాను.

    ధరాత్మజా  - మనోహరా
    తరింప  -  జేయ - రా ప్రభూ
    నిరంతరం‌ - భజింతురా
    పరాకు - మాని -  బ్రోవరా

తెలుగులో పూర్వప్రయోగాలు ఎక్కువగా ఉన్నట్లు తోచదు.  అధునిక ప్రయోగం కావ్యకంఠ గణపతి ముని గారు చేసిన ఆథ్మాత్మిక సర్వోపచార పూజ ఒకటి చక్కటిది ఉన్నది. తప్పక చదవదగినది.

ఇంకొకటి గుండు మధుసూదన్ గారి శ్లోకం చూడండి.

గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద!
స ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్


6 కామెంట్‌లు:

  1. శ్రీ శ్యామలీయం గారూ, చక్కని రామ స్తుతి. చాలా మనోహరంగా రచించినారు.
    1. నిరంతరం - అని బిందుపూర్వక పద ప్రయోగం అయితే వ్యావహారికం లేదా శుద్ధ సంస్కృత భాషా ప్రయోగార్హం. : "నిరంతరం భజామ్యహం ---- " రీతిగా . తెలుగు పద్యంలో "నిరంతరం" అన్న సంస్కృత పదం తత్సమమై - నిరంతరము అన్న ప్రథమా విభక్తి అవుతుంది.

    2. ప్రోచు అన్న శబ్దాన్ని ' వాసుదేవాచారి గారు ' ద్రుత సంఘటితం కాకుండానే - ' బ్రోచేవారెవరురా ' అంటూ కీర్తన ప్రారంభించినా - పరాకు మాని ప్రోవరా అంటే బాగుంటుందేమో ( అది ప్రస్తుత సందర్భంలోనూ ద్రుత పరం కాదు కనుక ) అని సూచన.

    3. రెండు స్వీయ పంచ చామర లక్ష్యాలు - రెండు వేర్వేరు సందర్భాలలో :

    ఉగ్ర నారసింహాటోపం :

    చలత్ సటా ఛటా ప్రభావ సంభ్రమత్ సమీరుఁడై
    జ్వలన్మహోగ్ర నేత్ర గోళ సంభృతాగ్ని హోత్రుఁడై
    విలక్షణాభియాన మాత్ర ప్రేంఖిత క్షితీడ్యుఁడై
    చెలంగె నా నృసింహ మూర్తి జృంభిత ప్రతాపుఁడై !

    కాలభైరవాగ్రహం :

    కరాళ నాదమున్ వెలార్చి కాలకాలుఁడంత భీ
    కర త్రిశూలమెత్తి వాని కంఠ సీమ నుత్తరిం
    చి రోష తీవ్రతన్ నటించె జృంభితాగ్రహమ్ముతో
    హరోం హరా యటంచుఁ బేర్మి నాడ భూత జాలముల్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విష్ణునందన్ గారూ,

      ప్రోవరా అన్నదే వేయవలసి ఉందిగాని, మీరు చెప్పిన కీర్తన 'బ్రోచే వా రెవరురా' ప్రభావం ఎక్కడో అంతరంగంలో కుదురుకు పోయి తరచుగా ప్రోచు అన్నదానికి బ్రోచు అన్నట్లుగానే బయటకు వస్తోందని గమనించాను.

      'నిరంతరం భజింతురా' అన్నది మార్చవలసి ఉందా అన్నది ఆలోచించాలి. నిరంతరము అన్నదే తెలుగులో‌ ప్రథమావిభక్తిరూపం అవుతున్నప్పుడు మువర్ణకాన్ని మనం పూర్ణానుస్వారంగా మార్చుకొనే వాడుకను పాటించవచ్చును అని అనుకొన్నాను. ఇక్కడ పాదం‌లో మార్పు చేయవలసి ఉంటే తెలియజేయ గలరు

      తొలగించండి
  2. శ్రీ శ్యామలీయం గారూ , మువర్ణకాన్ని బిందుపూర్వకం చేయడం కేవలం వ్యావహారిక , గ్రామ్యాలకే పరిమితం. కావ్య / ప్రమాణ భాషా సంప్రదాయ గౌరవం దానికి లభించదు. కనుక దానిని పరిహరిస్తే మేలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చెప్పిన దోషం పరిహరించి, పద్యంలో క్రొత్తపాదం చేర్చటమూ, పద్యపాదాల క్రమం మార్చటమూ‌ చేసానండీ. ఒకసారి పరిశీలించండి.

      తొలగించండి
  3. నిర్దోషమై , సజావుగా సాగింది పద్యం.

    శివంకరమ్ముగా భవత్
    కవిత్వ తత్వ ధారలున్
    స్రవించి మించి సద్యశ
    ప్రవృద్ధి మీకొసంగెడిన్ !

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.