3, డిసెంబర్ 2015, గురువారం

మంజులయాన వృత్తంలో విన్నపం.





    మంజులయాన.
    కనులార భవదీయ కమనీయ రూపమున్
    కనుగొందు నను నాశ కడముట్ట నీకురా
    తనివార నిను జూడ తగనందువా ప్రభూ
    మనసెల్ల రఘురామ మరి నిండి యుండవా





ఈ 'మంజులయాన' వృత్తం కూడా నేను సృష్టించినదే. అప్పట్లో దీనికి  పులిహోర అని పేరు పెట్టాను!  ఇది ఒక అవధానం సందర్భంగా సృజించటం జరిగింది కాకతాళీయంగా.

అవధాని గారి అభిప్రాయాన్ని అనుసరించి (చూడండి:  పులిహోర ఛందస్సుపై టపా) దీనికి ఇప్పుడు కొత్తగా 'మంజులయాన' అని పేరు పెట్టటం జరుగుతున్నది.

దీని లక్షణాలు. పాదానికి గణవిభజన  స - న - భ - జ - ర.  యతిస్థానం 9వ అక్షరం.  ఇది నడకప్రథానమైన వృత్తం కాబట్టి గణవిభజన తదనుగుణంగా  సల - సల - సల - ర అని చెప్పుకుంటే బాగుంటుంది.

ఈ వృత్తానికి జె.కె.మోహనరావుగారి పద్యం:
     అలనాడు నలరాజు హరుసాన వండెగా
     అలనాడు బలభీము డతివేగ వండెగా
     పులిహోర యన నాల్క పొడుగాయె జూడగా
     పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

ఇందులో చివరిపాదం " పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో" అనేది ఈ వృత్తలక్షణానికి ఉదాహరణగా నేను ఇచ్చినది. మోహనరావుగారు మొత్తం పద్యాన్ని పూరించా రన్నమాట.

నా కోరిక మేరకు తదుపరి అవధానానంతరం అవధాని అనిల్ గారు చెప్పిన పద్యం:
     సిరి శ్యామలుడు నేడు జిగి యొప్పు చుండగా
     ధరణీ జనులు మెచ్చదగి నట్లు యిచ్చిరే
     సరసీరుహనిభాంఘ్రి చతురాస్యు పత్నికిన్
     పులిహోర యను వృత్తమును నంకితంబుగా

నిజానికి తమాషాకు నేను అనుకోకుందా సృజించినది ఐనా ఈ తాళప్రథానమైన వృత్తానికి మంచి పరిథి ఉంది. అవధానిగారు అన్నట్లు ఈ వృత్తంలో పూర్తిస్థాయి కవిత్వప్రక్రియలు చేయవచ్చును.  ఉదాహరణకు ఏదైనా ఒక ఖండిక మొత్తాన్ని ఈ‌ మంజులయాన వృత్త పద్యాలతో పూర్తిగా హాయిగా నిర్మించవచ్చును.  హాయిగా చదివించగల నడక ఉందనిపిస్తోంది దీనికి.

9 కామెంట్‌లు:


  1. కోరండీ ఇవ్వబడును అని కోరిక ! జిలేబి వృత్తం ఒకటి కనబెడుదురూ .


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీలు ఛందస్సుల్లో ఉంటాయా - పద్యంలో ఉంటాయా అన్నది కూడా అలోచించండి. ఎలాంటి పద్యలక్షణంతో నైనా మధురంగా వ్రాయటం సాధ్యమే సుకవికి. మధురభావనను కూడా చిందరవందరగా కఠోరంగా వ్రాయగలరు ప్రఙ్ఞ లేదా అభ్యాసం చాలని వారూ భాషమీద పట్టులేని వారూను. ఐతే ఈ‌మధ్య తమతమ భావాలను చెప్పేశక్తి భాషకు చాలటం లేదని వాపోతున్నారు కొందరు భాషపైన ఏమాత్రమూ‌ పట్టులేకుండానే. అది వేరే సంగతి.

      తొలగించండి
  2. శ్యామలీయం కడు శ్లాంఘనీయం...
    బ్లాగులోకంలొ మణిహారం...
    పంచును రామ సుధా గానామృతం...



    రిప్లయితొలగించండి
  3. రామా యని నోరారగ
    నామ జపము జేయు వారి నాదు కొనును శ్రీ
    రాముని కోదండంబో
    శ్యామల రాయా ! మనస్సు కార్తి దొలంగున్ .

    రిప్లయితొలగించండి
  4. రారా సూర్య కుల ప్రదీప విభవా! రారా ఘనాభాజిరా!
    మిత్రులు శ్యామలరావుగారూ!

    మంజులయాన వృత్తము చాలా చక్కని నడకతో అలరారుతున్నది. మీ విశేషవృత్తములలో రామనామ సుధలు జాలువారుచున్నవి. అభినందనలు. రెండవపాదమందు ఉత్తునకు యడాగమం అనపేక్షము కాబట్టి "కనుగొందునను కాంక్ష కడముట్టనీకురా" అంటే ఎలా ఉంటుందో యోచించగలరు.

    జై శ్రీరామ్!

    రారా కౌశిక యజ్ఞ రక్షణ పరా! రారా హరేష్వాసభిత్!
    రారా రావణ కుంభకర్ణ హననా! రారా నిలింపావనా!
    రారా రామమహీశ! చంద్రవదనా! రారా మహీజాపతీ!

    జై శ్రీరామ్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు మధుసూదన్ గారూ,
      అను + ఆశ అన్నపుడు అనునాశ అవుతుందా అను యాశ అవుతుందా?‌ మొదటిదే సాదువు అనుకుంటా. యడాగమం కుదరదనే‌ అంగీకరించాలి. తేలికమాట వాడుదామని ఆశించి 'ఆశ'ను ప్రయోగించినట్లున్నాను. కాంక్ష సరైనది కాని కొంచెం‌ బరువౌతుందేమో అని అనుకుంటున్నాను. సలహా చెప్పండి.

      తొలగించండి
    2. మిత్రులు శ్యామలరావుగారూ,
      అనునాశ అనునదే సాధువు. యడాగమం రాకూడదు. కాంక్షకు బదులు ఆశను వాడాలంటే "కనుఁగొందునను నాశఁ గడముట్టనీకురా" అని అంటే సరిపోతుంది.

      *******************

      నేను రాసిన శ్రీరామస్తుతి... పైన ఒక పాదం వచ్చి, క్రింద మూడుపాదాలు వచ్చాయి. దానిని సరిచేస్తున్నాను.

      జై శ్రీరామ్!

      రారా సూర్య కుల ప్రదీప విభవా! రారా ఘనాభాజిరా!
      రారా కౌశిక యజ్ఞ రక్షణ పరా! రారా హరేష్వాసభిత్!
      రారా రావణ కుంభకర్ణ హననా! రారా నిలింపావనా!
      రారా రామమహీశ! చంద్రవదనా! రారా మహీజాపతీ!

      జై శ్రీరామ్!

      తొలగించండి
    3. ధన్యవాదాలు, మీ శ్రీరామస్తుతి శార్దూలం చాలా బాగుంది. అనునాశ అని సరిజేసాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.