27, డిసెంబర్ 2015, ఆదివారం

ఏనుగు మీద రాముడు ఎంతో చక్కనిదేవుడు






    మత్తేభవిక్రీడితము.
    రవివారం బిది భానువంశతిలకా రామయ్య రావయ్య నే
    డవనీ పుత్రిక తోడ నుత్సవముగా నంబారి పైనెక్కి పం
    డువ జేయందగు జూచు కన్నులకు నీ వూరేగి యేనుంగుపై
    స్తవముల్ సేసలు పూలు గొంచు జనుచో సాకేత ముప్పొంగదే






ఇనకుల తిలకుని భానువారం మత్తేభం మీద చూడాలని ఆశ అన్నారు పెద్దవారు శ్రీ‌ శర్మగారు.  అయన రాముణ్ణి  ఆదివారం నాడు ఏనుగుపై ఎక్కిద్దామని ఉబలాటపడుతున్నారు. ఆయన ముచ్చట తీర్చటం‌ బాగుంటుందని నాకూ అనిపించింది. రాముడి శోభను ఊహించటం వర్ణించటం‌ కన్నా సంతోషం మరేముంటుంది? ముఖ్యంగా నాకు.

లోగడ నా రాముణ్ణీ సీతమ్మతల్లినీ ఏనుగు నెక్కించి ఊరేగిస్తూ ఒక రామకీర్తన వ్రాసుకున్నాను.  పాఠకులు దయచేసి వేదండము నెక్కి మైథిలితో కూడి కోదండపండితు డూరేగె వేదవేద్యుని కీర్తి వేదపండితు లెల్ల వేనోళ్ళ పొగదగ నూరేగె అన్నఆ కీర్తనను కూడా ఒక సారి చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.


10 కామెంట్‌లు:

  1. ఏనుగుపై ఊరేగిన రాముడికి దిష్టి తీయండి!దేంతో తీస్తారు? మీ ఇష్టమే...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనుర్మాసం భానువాసరం నాడు దశరథరాములవారు సీతామహాలక్ష్మీసమేతులై గజారోహణం చేసి ఊరేగుతున్నారు అందువల్ల మహాకోలాహలంగా, పరమశోభాయమానంగా ఉంది సాకేతం అంతా. అయనింకా ఊరేగుతూనే ఉన్నారు కదండీ.తిరిగి స్వామివారూ అమ్మవారూ కోటలోనికి రాగానే తప్పకుండా దృష్టి తీసి వాళ్ళకి హారతి ఇవ్వాలి మరి.

      తొలగించండి
    2. శర్మ గారు

      దిష్టి జిలేబీలతో తీస్తామండీ


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీగారూ,
      మన రాములోరు ఆజానుబాహులండోయ్ గంపలు గంపలు జిలేబీలు తెండి మరి!

      తొలగించండి
    4. సీతమ్మ అన్న ఒక్క జిలేబి కే పడి పోయినవారు ప్రభువులు :) గంపల జిలేబి అవసర మంటారా :) పత్రమ్ పుష్పమ్ జిలేబి తోయం అంటూ లాగించే ద్దా మనుకుంటున్నా !

      తొలగించండి
  2. ఘనుడా రాముడు , రామచంద్ర విభుపై గాఢానురాగాన నం
    గన సీతా సతియున్ ఘనద్ఘనయె , భక్తాగ్రేసరుండయ్యె గా
    వున శ్రీమారుతియున్ _ ఘనాతి ఘనులే _ పూజ్యుండు లక్ష్మన్నయున్ ,
    ఘనమౌ భాగ్యము మాది నేడు కరిపై కాంచంగ శ్రీరామునిన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావుగారు
      అందుకోండి అభినందన మందారమాల! పద్యం అలరించింది.

      తొలగించండి
    2. ధన్యవాదములు శర్మగారూ ,
      మందారమాలను రాముడికీ , శ్యామలుడికీ వేద్దాం .

      తొలగించండి
  3. సీ||జ్ఞానము తోగూడి,జ్ఞేయము దాచేసి,
    మోహము పిండేసి,మోక్ష మార్గ

    మందున రాగము మెండుగ పెంచేసి,
    స్వార్ధము చెక్కేసి,స్వార్జితమ్మె

    కాలము లన్నిట కామన దీర్చుట
    సాధ్యము కాదను భావమింక

    ధ్యానము లోనిల్పి,ధ్యాసను రాముని
    పైనుంచి,త్యాగము పైకి తెచ్చి,

    తే||ఎల్ల లోకాలు చుట్టినా పెచ్చరిల్లి
    పోవు లోభము కిందకు పెట్టి,గీత
    మెచ్చు సౌఖ్యము నందున ముంగితేను -
    రాము డుండును నీవున్న రాజ్యమందు!
    (03/12/2015)

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.