11, డిసెంబర్ 2015, శుక్రవారం

ఇంద్రవంశంలో‌ రామస్తుతి.    ఇంద్రవంశం.
    శ్రీజానకీ‌నాథుని చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత యెన్న నందుచే
    నే జేయు కార్యంబుల నెల్ల భంగులన్
    రాజిల్లు నా భక్తి నిరంతరంబుగన్

ఈ ఇంద్రవంశం అనే‌ వృత్తానికి గణవిభజన త - త - జ - ర అనేవి. యతిస్థానం‌  8వ అక్షరం. అంటే ఇక్కడ 'జ' గణంలో మధ్యలో ఉన్న గురువుపైన యతిస్థానం వస్తుందన్న మాట. సాధారణంగా వృత్తాల్లో యతిస్థానంలో గురువే ఉంటుంది. సాధారణంగా అనటం‌ ఎందుకంటే‌ అదేమీ‌ బండరూలు కాదు కాబట్టి.

ఈ వృత్తానికి నేమాని రామజోగి సన్యాసి రావు గారు ఒక శంకరాభరణం బ్లాగుటపాలో  ఇచ్చిన పద్యం‌

    ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
    బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
    మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
    వందారు మందార! భవప్రణాశకా!

ఇతే ఈ‌ ఉదాహరణ పద్యం అంతా సంస్కృతం‌ కాబట్టి ఇదొక శ్లోకం తప్ప తెలుగు పద్యం‌ కాదనటం‌ వేరే విషయం.  కాని ఇందులో ఉన్నవి తత్సమాలూ వాటితో సంబోధనాప్రథమావిభక్తి ప్రయోగాలు. కాబట్టి ఇది తెలుగు పద్యమే అవుతున్నది.   సరే, ఇంకొక తెలుగుపద్యం‌కావాలంటే వారు అదే టపాలో ఇచ్చిన పద్యం చూదాం.

    దేవా! జగద్రక్షక! దీనబాంధవా!
    కైవల్య యోగప్రద! కామనాశకా!
    భావింతు నీ తత్త్వము ఫాలలోచనా!
    కావింతు నీ సేవల కంజజార్చితా!

 ఈ ఇంద్రవంశం వృత్తంలో‌వాసుదాసులు ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారి రామాయణంలోని ఒక పద్యం చూదాం.

    ధీమజ్జనుల్ మెచ్చెడి దేవరానతిన్
    నేమంబుమైఁ దీర్పఁ గ నేనుగోరిన
    ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
    భూమీశ నాకై యిటు పొక్క నేటికిన్

సంస్కృతంలో పాదాంతయతి ఉంది. అంటే పాదం చివరిమాట తరువాతి పాదంలోనికి ప్రవేశించకూడదు. తెలుగులో మనం‌ ప్రవాహగుణం అని చెప్పి ఆ నియమం సడలించి వేసాం. పైని వాసుదాసు గారి పద్యంలో రెండవపాదం చివరి పదం‌ 'కోరినట్లు'. మూదవపాదం మొదటి పదం‌ 'ఈ' కోరినట్లు +‌ఈ => కోరినట్లీ అని ఐపోతుంది. ఉత్తు వెంబడే మరొక అచ్చు వస్తే‌ అంతే అని కదా తెలుగు వ్యాకరణం. సరే ఇప్పుడు పదం ఏమిటి? 'కోరినట్లీ' అని కదా. మూడవపాదం మొదట ఈ‌'ట్లీ' వచ్చి కూర్చుంది సదుపాయంగా. ఇలా తెలుగులో వీలవుతుంది కాని సంస్కృతంలో కాదు. పాదం చివరకు మాట పూర్తి ఐపోయి తీరాలి.

అలాగే సంస్కృతశ్లోకాల్లో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం‌ మొదలవ్వాలి. అక్కడ మన తెలుగులో లాగా అక్షరసామ్య యతి నియమం లేదు. నేమాని వారిది శ్లోకంలా ఉన్నా అది తెలుగుపద్యమే అనుకున్నాం కదా. నాలుగవ పాదంలో‌యతిస్థానం దగ్గర లోపం‌ కనిపిస్తోంది కాని సరిగానే ఉంది - ఎందుకంటే‌ భవ అన్న పదంలో రెండవ అక్షరం దగ్గర విశ్రామం రావలసి వస్తోంది కాబట్టి సంస్కృతం ఒప్పకపోయినా తెలుగుపద్యంలో అలా అంగీకరిస్తాం కదా.

ఇక ఈ‌ఇంద్రవంశం నడకను గూర్చి కొంచెం ఆలోచిద్దాం.  నాకైతే ఇంద్రవంశం‌పాదం రెండు లేదా మూడు ఖండాలుగా నడుస్తుందని అనిపిస్తోంది.

నేమాని వారి శ్లోకం

    దేవా! జగద్ర - క్షక! దీన - బాంధవా!
    కైవల్య యోగ - ప్రద! కామ - నాశకా!
    భావింతు నీ త - త్త్వము ఫాల - లోచనా!
    కావింతు నీ సే - వల కంజ - జార్చితా!

నే నిచ్చిన పద్యం

    శ్రీజానకీ‌నా - థుని చేరి - యుండుటే
    యీ‌జన్మసాఫ - ల్యత యెన్న - నందుచే
    నే జేయు కార్యం - బుల నెల్ల - భంగులం
    రాజిల్లు నా భక్ - తి నిరంత - రంబుగన్

అలాగే వాసుదాసుగారి పద్యంలో చివరి రెండు పాదాలు చూపుతాను.

    ఈ మేలిభోగం - బుల నిచ్చ - గింపఁ జూ
    భూమీశ నాకై - యిటు పొక్క - నేటికిన్

అలాగే రెండే‌ ఖండాలుగా ఈ‌ ఇంద్రవంశం‌ నడక చూస్తే

    శ్రీజానకీ‌నాథుని  - చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత  - యెన్న నందుచే

 ఇలా ఉంటుంది.

ఏ పద్యాన్ని సాధన చేయాలన్నా ముందుగా దాని నడకను బాగా పరిశీలించాలి. అప్పుడు వ్రాయట‌ం తేలిక అవుతుంది.  అబ్యాసం‌ చేయగా చేయగా మంచి ధార వస్తుంది. అంతకన్న విశేషం లేదు.

చాలా మంది అపోహపడే మరొక సంగతి ఉంది. చాలా మంది భాషమీద మాంచి పట్టూ, పాండిత్యం ఉంటే కాని పద్యాలు వ్రాయటం‌ ఆసాధ్యం‌ అనుకుంటారు. పట్టు చాలు పాండిత్యం అక్కరలేదు. నేను కూడా తెలుగులో మంచి పండితుడను ఏమీ కాను.  అనేకమంది కవులకు పాండిత్యం తగినంత ఉంటుంది - ఉండాలి. కాని కవి ఉద్దండపండితుడు కావాలసిన అవసరం‌ లేదు.  తెలుగులో‌ మంచి పాండిత్యం‌ కలవారు ఉంటారు అనేక మంది ఉంటారు . కాని వాళ్ళలో పద్యాలు వ్రాయటం రాని వారే హెచ్చుమంది ఉంటారు.  అభిరుచి ఉంటే పద్యవిద్యను అభ్యాసం చేయవచ్చును.