30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఎన్నెన్నో నే చూచితినిఎన్నెన్నో నే చూచితిని నీ
వన్నియు చూపగ చూచితిని

మాయామయమగు జగమును నమ్మే మనుజుల మనసులు చూసితిని
కాయమె తానని తలచే వారల కష్టము నిత్యము చూసితిని
ప్రేయోమార్గము వెంట మనుషుల వెఱ్ఱిపరుగులను చూసితిని
శ్రేయోమార్గము గలదని తెలియని జీవుల కొల్లగ చూసితిని
తెలిసి

అక్కడక్కడ భ్రమలు తొలగిన అనఘుల కొందఱ జూసితిని
చక్కగ రాముని నమ్మిన మనసుల శాంతము సౌఖ్యము చూసితిని
అక్కజముగ శ్రీరాముడు వారికి దక్కుట వేడ్కను చూసితిని
మిక్కిలి ప్రేముడి కొలిచి రాముని దయనే బ్రతుకున చూసితిని
తెలిసి

కవనము నీ నామాంకిత మగుచో కలిగిన సౌఖ్యము చూచితిని
పవలని రేలని భావింపక నిను పాడుట మేలని చూచితిని
ధవళేక్షణ నీదయ నెల్లప్పుడు తలచి పాడగ జూచితిని
అవిరళముగ నటు చేయుటలో గల హాయిని మనసున చూచితిని
తెలిసి


2 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.